Movies

పిస్తోలు కథతో పిండేసిన పవన్

Pawan Kalyan Shares His Pistol Suicide Story

‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తీయాలన్న మాట ఎప్పట్నుంచో వింటున్నా. కానీ ఎవ్వరూ ధైర్యం చేయలేదు. రామ్‌చరణ్‌ ధైర్యం చేశాడు. ఈ సినిమా చేస్తే చిరంజీవిగారే చేయాలి, తీస్తే రామ్‌చరణే తీయాలి అనిపించేలా ‘సైరా’ తెరకెక్కింద’’న్నారు పవన్‌ కల్యాణ్‌. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అభిమానుల మధ్య చిరు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘అభిమానుల్లో ఒకడిగా ఇక్కడికి వచ్చాను. జీవితంలో నా స్ఫూర్తి ప్రదాత అన్నయ్య. ఓ అభిమానిగా ఆయన్ని ఎలాంటి సినిమాలో చూడాలని కోరుకున్నానో అలాంటి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు పనిచేశారు. ఒకరు అన్నయ్య, మరొకరు అమితాబ్‌బచ్చన్‌. నా జీవితంలో మూడు సందర్భాల్లో తప్పుడు మార్గం వైపు వెళ్లకుండా అన్నయ్య నన్ను కాపాడారు. తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. నాకూ అలాంటి సందర్భమే ఎదురైంది. నేను ఇంటర్‌ ఫెయిల్‌ అయినప్పుడు నిరాశ నిస్పృహలకు లోనయ్యా. అన్నయ్య దగ్గరున్న లైసెన్స్‌ పిస్టోల్‌ తీసుకుని కాల్చుకుని చనిపోదామనుకున్నా. కానీ ఆరోజు అన్నయ్య చెప్పిన మాటలు నాలో విశ్వాసం నింపాయి. ఆత్మ హత్యలు చేసుకున్నవాళ్ల ఇళ్లల్లో కూడా చిరంజీవిలాంటి అన్నయ్యలు ఉంటే అలాంటి ఘటనలు జరిగేవికాదు. యుక్త వయసులో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరైనా ఏమైనా అంటే కోపంతో ఊగిపోయేవాడ్ని. ఆ సమయంలో ‘నువ్వు కులం, మతం దాటి మానవత్వం వైపు ఆలోచించాలి’ అని అన్నయ్య హితబోధ చేశారు. 22 ఏళ్ల వయసులో ఓ ఆశ్రమంలో చేరిపోయా. ‘నాకేం అవసరం లేదు. ఇలా ఉండిపోతా’ అని చెప్పాను. నువ్వు భగవంతుడివైపు వెళ్లిపోతే సమాజానికి ఎందుకూ ఉపయోగపడవు. బాధ్యతలు ఉంటే ఈ మాటలు మాట్లాడవు అని నన్ను అన్నయ్య ఆపారు. ఆ మాటలే ఈరోజు మీ ముందు నిలబడేలా చేశాయి. ‘సైరా’ లాంటి గొప్ప సినిమాకి గళం ఇవ్వడం నా అదృష్టం. మా అన్నయ్య ఇలాంటి సినిమా చేయాలని కలలు కన్నాను. కానీ ఇలాంటి గొప్ప సినిమా తీసే శక్తి, సమర్థత నాకు లేకపోయాయి. కానీ నా తమ్ముడు లాంటి రామ్‌చరణ్‌ ఈ పని చేశాడు. ఏ తండ్రయినా తనయుడ్ని లాంచ్‌ చేస్తారు. కానీ ఇక్కడ కొడుకే తండ్రిని లాంచ్‌ చేశాడు. సురేందర్‌రెడ్డి ఈ సినిమాతో తన కలని సాకారం చేసుకున్నారు. ఓ అజ్ఞాత వీరుడి కథ ఇది. అలాంటి వ్యక్తి చరిత్రని తెరకెక్కించిన గొప్ప చిత్రంలో నేను నటించకపోయినా గొంతు ఇవ్వగలిగాను. ‘అన్నా నువ్వు బద్దలు కొట్టగలవు.. నువ్వు చరిత్ర తిరగరాయగలవు. అన్నా.. నీకు మేం బానిసలం’’ అన్నారు. కార్యక్రమంలో అల్లు అరవింద్‌, కల్యాణ్‌దేవ్‌, ఎం.ఎల్‌.ఏ రాపాక వరప్రసాద్‌, హరిప్రసాద్‌, సాయిధరమ్‌తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.