WorldWonders

టైటానిక్ ఉప్పు లాగా కరిగిపోతోంది

Titanic Melting Like Salt Under The Atlantic Ocean

అట్లాంటిక్ మహా సంద్రం. నిశ్శబ్ద యుద్ధం చేస్తూ ఎగుస్తున్న అలల మధ్య టైటానిక్ ప్రయాణం ప్రారంభించింది. నాలుగు రోజులు గడిచిందో లేదో, పెద్ద మంచు కొండ దాని దారికి అడ్డొచ్చింది. తప్పించేలోపు ఓడ ఢీకొట్టేసింది. 1912 ఏప్రిల్ 15న ఆ మహా సంద్రం షిప్పును మింగేసింది. అప్పుడు షిప్పును మింగేసిన సంద్రమే, ఇప్పుడు తినేస్తోంది. అవును, 13 వేల అడుగుల లోతున (4 కిలోమీటర్లు) నిశ్శబ్దంగా సేద తీరుతున్న ఆ టైటానిక్ షిప్పు ముక్కలవుతోంది. ఉప్పునీటి తుప్పు, ఇనుమును తినేసే బ్యాక్టీరియా టైటానిక్ డెక్కును పట్టేసి కొన్ని భాగాలను తినేశాయి. 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా కలాడన్ ఓషియానిక్ అనే కంపెనీకి చెందిన డైవర్లు టైటానిక్ దగ్గరకు వెళ్లారు. అట్లాంటిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దానిపై డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో భాగంగానే కంపెనీ డైవర్లు 4కే రెజల్యూషన్ కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీశారు.1997లో దాని షిప్పు పరిస్థితిని, ఇప్పటి స్థితిని పోల్చి చూశారు. డెక్కు సైడ్ భాగంలో పెద్ద రంధ్రం పడిందని, అది ముక్కలైపోతోందని నిర్ధారణకు వచ్చారు. ‘‘టైటానిక్ షిప్పు ఇలా కరాబవడం షాక్కు గురిచేసింది. ఇది మున్ముందు ఇలాగే కొనసాగుతుంది. షిప్పు నామ రూపాల్లేకుండా పోతుంది” అని టైటానిక్ చరిత్రకారుడు పార్క్ స్టీఫెన్సన్ అన్నారు. టైటానిక్ షిప్పులోని ఫేమస్ కెప్టెన్ బాత్ టబ్ ఇప్పుడు కనుమరుగైపోయిందని చెప్పారు. అయితే, టైటానిక్ ఇలా కరాబైపోవడం సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియేనని సైంటిస్ట్ లోరి జాన్సన్ చెప్పారు. బ్యాక్టీరియా కమ్యూనిటీ మొత్తం ఒకే చోటకు చేరి ఓడ శకలాలను తినేస్తాయని వివరించారు. డాక్యుమెంటరీలో భాగంగా కెనడాలోని న్యూఫౌండ్లాండ్ వద్ద ఐదు సార్లు సముద్రం అడుగున ఉన్న టైటానిక్ దగ్గరకు వెళ్లొచ్చారు డైవర్లు. బెల్ఫాస్ట్ అండ్ వూల్ఫ్ షిప్యార్డ్ ఈ షిప్పును తయారు చేసింది.