Agriculture

ప్రశాంతంగా ఏపీ గ్రామ సచివాలయ రాతపరీక్ష

ప్రశాంతంగా ఏపీ గ్రామ సచివాలయ రాతపరీక్ష

ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో చేపడుతున్న గ్రామ సచివాలయాల నియామకాల పరీక్షలు ప్రారంభమయ్యాయి. 14,944 సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాల నియామకం కోసం ఆదివారం నుంచి ఏడు రోజులపాటు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కేటగిరి-1 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు కేటగిరీ-3 పరీక్ష జరగనుంది. ఇందుకోసం యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఒకేరోజు 13 జిల్లాల్లోని 4,478 కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు రాతపరీక్షలు రాశారు. ఉదయం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, వార్డు మహిళా పోలీస్‌, సంక్షేమ, విద్య కార్యదర్శి (గ్రామీణం), వార్డు పరిపాలన కార్యదర్శి (పట్టణ) పోస్టులకు 12,10,432 మంది పోటీపడుతున్నారు. మిగతా వారంతా మధ్యాహ్నం నిర్వహించే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6, డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పరీక్షలకు హాజరవుతారు. వీటి నిర్వహణకు ప్రభుత్వ శాఖల నుంచి 1,22,554 మంది అధికారులు, ఉద్యోగుల సేవలను వినియోగిస్తున్నారు. పరీక్ష కేంద్రాలు, ప్రశ్నాపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 500 బస్సులు నడిపింది.