Business

బ్యాంకుల విలీనం ఎవరికి లాభం మరెవరికి నష్టం?

Who benefits from bank mergers and who is at danger?

గతేడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరు బ్యాంకులు విలీనమయ్యాయి. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఎస్‌బీఐ రూపాంతరం చెందింది. ఇప్పుడు కేంద్రం మరోసారి ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం చేపట్టింది.10 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసింది. ఈ విలీనం తర్వాత నాలుగు అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకులు ఏర్పడతాయి. దీని మొత్తం వ్యాపారం రూ .55.81 లక్షల కోట్లు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2017లో దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా, విలీనంతో ఇప్పుడు అవి 12కు తగ్గాయి.ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ప్రకారం, మరో ఆరు బ్యాంకులు పిఎన్‌బి, కెనరా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులలో విలీనమవుతాయి. నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులుగా అవతరిస్తాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ పిఎన్‌బిలో కలుస్తాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్‌లో విలీనం అవుతాయి. కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ కలిస్తే, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనం అవుతుంది. దేశంలో ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు 12కు చేరతాయి. ఎస్‌బిఐ తర్వాత పిఎన్‌బి అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఈ విలీనం వల్ల రుణ వ్యయం తగ్గుతుందని, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికి బలోపేతం అవుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇకపై రూ.250 కోట్లకు పైగా ఉన్న ప్రతి రుణాన్ని పర్యవేక్షించనున్నామని, మొండి బకాయిలు రూ.8.65 లక్షల కోట్ల నుంచి రూ.7.90 లక్షల కోట్లకు తగ్గాయని ఆర్థికమంత్రి తెలిపారు.అయితే దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి కష్టం ఓ సారి చూద్దాం.
బ్యాంకుల విలీనం అన్నది రాత్రికి రాత్రే ముగిసిపోయే ప్రక్రియ కాదు. బ్యాంకుల్ని కలిపేయడం వల్ల ఆ బ్యాంకు బ్యాలెన్స్ షీట్ పెరిగి అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లన్నీ ఒకే లెక్కలోకి వస్తాయి. డిపాజిట్లే కాకుండా ఆయా బ్యాంకులు ఇచ్చిన అప్పుల లెక్క కూడా పెరుగుతుంది. ఇక విలీనమయ్యే బ్యాంకుల్లో ఉన్న ఉద్యోగుల్ని ఇంకా సమర్థవంతంగా వాడుకోవచ్చు.
**ఉద్యోగులు వ్యతిరేకత ఎందుకు ?
ఈ విలీన పక్రియను సాధారణంగా బ్యాంకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తుంటారు. ఎందుకంటే… అప్పటివరకు తాము పొందుతున్న బెన్‌ఫిట్స్ వస్తాయో రావో అన్న ఆందోళనతో పాటు ప్రమోషన్ల విషయంలోనూ గందరగోళం ఏర్పడుతుందన్న భావన వారిలో ఉంటుంది. వీలినంతో వారి ఉద్యోగం ఎక్కడికైనా బదిలీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క ఉద్యోగి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆర్థిక శాఖ చెబుతోంది.
**ఇది కస్టమర్లకు లాభమా? నష్టమా?
విలీనం వల్ల సామాన్యులకు కొన్ని లాభాలు ఉండే అవకాశం ఉంది. నాలుగైదు బ్యాంకుల డిపాజిట్లు ఒకే చోటకు చేరడం, నగదు పెరగడం పరోక్షంగా కస్టమర్లకు మేలు చేస్తుందనే చెప్పాలి. దీంతో పాటుగా తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయని, కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయన్న వాదన ఉంది. విలీనమయ్యే బ్యాంకుల ఏటీఎంలు అన్నీ ఒకే బ్యాంకు కిందకు వస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. విలీనం తర్వాత ఎక్కువగా ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు మీ బ్యాంకులో లభిస్తున్న ఫీచర్లు విలీనం తర్వాత కూడా ఉంటాయో లేదో చెప్పలేం. విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.
**అయితే వీలినం ద్వారా బ్యాంకులకు లాభం జరగుతుందా..
గతేడాది భారతీయ మహిళా బ్యాంక్, మరో ఐదు అనుబంధ బ్యాంక్‌లను కలిపేసుకున్న ఎస్‌బీఐకి మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) మరింత పెరిగి రూ.2.25 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకుల విలీనం వల్ల శాఖలు మూతబడి ఉద్యోగులు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. స్టేట్‌ బ్యాంకులో అసోసియేటెడ్‌ బ్యాంకుల విలీనం తర్వాత బ్యాంకు శాఖలు మూతపడ్డాయి. మొండి బాకీలు పెరిగాయి. నూతన వ్యాపారం తగ్గింది. ఉద్యోగుల సంఖ్య తగ్గింది. 31.3.2017 నాటికి ఎస్‌బీఐ యొక్క మొండి బాకీలు 65 వేల కోట్లు. అసోసియేటెడ్‌ బ్యాంకుల మొండి బాకీలు ఒక లక్షా 12 వేల కోట్ల రూపాయలు. అంటే మొత్తం మొండి బాకీలు ఒక లక్షా 77 వేల కోట్ల రూపాయలు. విలీనం తర్వాత 2018 సంవత్సరానికి మొత్తం మొండి బాకీలు రెండు లక్షల 25 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నవి. అంటే విలీనం తర్వాత మొండి బాకీలు పెరిగాయి కానీ తగ్గలేదు.
**నరసింహన్ కమిటీ రిపోర్టు ఏమిటి ?
బ్యాంకుల విలీనం నూతన ఆర్థిక విధానాలలో భాగంగా జరుగుతున్నది. 1992 నాటి నరసింహన్ కమిటీ రిపోర్టు మొత్తం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్యను 5 నుంచి 6 వరకు కుదించాలని సిఫారసు చేసింది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 33శాతానికి తగ్గించుకోవాలని కూడా నరసింహన్‌ కమిటీ సూచించింది. తర్వాత 1998లో రెండవ నరసింహన్‌ కమిటీ రిపోర్టు బలంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్‌ బ్యాంకుల విలీనాలను సిఫారసు చేసింది. రిజర్వు బ్యాంకు డాటా ప్రకారం 1990 తరువాత 32 ప్రయివేట్‌ బ్యాంకుల విలీనం జరిగింది. 2004లో రిజర్వు బ్యాంకు ఒత్తిడి మేరకు గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకును ఓరియంటల్‌ బ్యాంక్‌ అఫ్‌ కామర్స్‌లో విలీనం చేశారు. తరువాత 1993లో న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు.
**వీలినమైన బ్యాంకుల మొండిబకాయిలు ఎంత ?
బిఒబి, విజయ బ్యాంకు, దేనా బ్యాంకు మొండి బాకీలు 80 వేల కోట్ల రూపాయలుగా ఉన్నవి. విలీనం వల్ల ఈ మొండి బాకీలు ఎలా వసూలవుతాయో తెలియదు. పబ్లిక్‌ రంగ బ్యాంకులన్నింటికి కలిపి మొండి బాకీలు 31.3.2018 నాటికి 89560 కోట్ల రూపాయలుగా ఉన్నవి. రిజర్వు బ్యాంకు యొక్క ఇన్సాల్వెన్సీ, బాంక్రప్సి కోడ్‌ బ్యాంకుల లాభాలపై ప్రభావం చూపిస్తున్నది. మొండి బకాయిలకు ప్రొవిజనింగ్‌ చేసుకోవాలన్న నిబంధనల మూలంగా 21 పబ్లిక్‌ రంగ బ్యాంకుల్లో 19 బ్యాంకులు నష్టాల్లో ఉన్నవి. 31.3.2018 నాటికి 21 బ్యాంకులు 1,55,565 కోట్ల రూపాయల లాభాలను గడించాయి. కానీ 2,70,000 కోట్ల రూపాయలను మొండి బాకీల నిమిత్తం ప్రొవిజనింగ్‌ చేసుకోవాల్సి రావడంతో 85 వేల కోట్ల రూపాయల నికర నష్టాన్ని చూపించాల్సి వస్తున్నది. ఈ నిబంధనల మూలంగా ఎస్‌బీఐ కూడా నష్టాలలోకి వెళ్లిపోయింది.మొండి బకాయిల వసూలుకు బ్యాంకులకు తగిన అధికారాలను కట్టపెట్టకుండా, విలీనాలు చేయడం ద్వారా నరసింహన్‌ కమిటి ప్రయివేటీకరణ సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పాలి. విలీనం ద్వారా మొండి బకాయిలు తగ్గుతాయని చెపుతున్నారు. కానీ విలీనం తర్వాత కూడా మొండి బాకీల శాతం పెరిగే అవకాశమున్నది. మొండి బాకీలకు సంబంధించిన వ్యవస్థీకత సవాళ్లను అధిగమించకుండా విలీనాల ద్వారా మొండి బకాయిల సమస్యను పరిష్కరించుకోవచ్చని అనుకోవడం కరెక్ట్‌ కాదని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెపుతున్నారు.