DailyDose

చిదంబరానికి 19 వరకు చిప్పకూడే గతి-నేరవార్తలు–09/05

Chidambaram In Tihar Jail Till 19th-Telugu Crime News-09/05

* కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి చిక్కులు వీడటం లేదు. అయన జైలు నుంచి బయటకు వచ్చేందుకు ప్రస్తుతానికి దారులు మూసుకుపోయాయి. దీనికి కారణం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ కు సుప్రీంకోర్టులో గురువారం నాడు చుక్కెదురు అయింది. ఐఎన్‌ఎక్స్‌ మనీల్యాండరింగ్‌ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్‌ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.అయితే చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం ఆయన రెగ్యులర్‌ బెయిల్‌ కోసం స్వేచ్ఛగా ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇది కొంతలో కొంత ఆయనకు ఊరటలాంటిదనే చెప్పొచ్చు. ఇక అన్ని న్యాయస్థానాల్లో ఆయన మళ్ళీ బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రీ డీ కె శివకుమార్ కూడా ఈడీ కేసులో అరెస్ట్ అయి విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదంతా రాజకీయ వేధింపుల్లో భాగమే అని శివకుమార్ ఆరోపిస్తున్నారు.
* ఓ మైనర్‌ గర్ల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ గోవా స్మిమ్మింగ్‌ కోచ్‌ సురజిత్‌ గంగూలీపై వేటు పడింది. తనపై సురజిత్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మైనర్‌ బాలిక ఫిర్యాదుకు కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజుజు స్పందించారు. అతనిపై చర్యలకు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు రిజుజు ఆమెకు హామీ ఇచ్చారు. అదే సమయంలో సురజిత్‌కు భారత్‌లో ఎక్కడా కూడా స్విమ్మింగ్‌ కోచ్‌గా పదవి ఇవ్వొద్దంటూ స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌కు విజ్ఞప్తి చేశారు.
* హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్ నవోదయనగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్ షాక్ తగలడంతో ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థి హాజీని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు.
* కూకట్‌పల్లిలో సాఫ్‌్అవేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో నిందితుడు హేమంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ మీడియాకు వెల్లడించారు.
* ఆప్ఘ‌నిస్తాన్‌లో ఇవాళ భారీ కారు బాంబు దాడి జ‌రిగింది. కాబూల్‌లోని షాదార‌క్ ఏరియాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ట్ర‌క్కు బాంబుతో గ్రీన్ విలేజ్ కాంపౌడ్‌లో పేలుడుకు పాల్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని మంత్రి నుష్ర‌త్ దృవీక‌రించారు.
*పంజాబ్లోని గురుదాస్పూర్లో గల బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 21 మంది మృతిచెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. కర్మాగారంలో మరో 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం.
*మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలో గల వర్ధన పాఠశాలలో చోరీ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వెనుకవైపు కిటికీని తొలగించి దొంగలు లోనికి ప్రవేశించారు. పాఠశాల యాజమాన్యం గది లాకర్లో దాచిన రూ.95 వేలను అపహరించుకుపోయారు. బాధిత యాజమాన్యం కీసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* రేషన్ బియ్యం అక్రమ తరలింపును అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో చోటుచేసుకుంది. ట్రాలీ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో సోదాలు చేపట్టిన పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
*రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇందిరానగర్లో రైతు నర్సింహులు(40) పొలంలో మూడు బోర్లు వేసి అప్పుల పాలయ్యాడు. దీంతో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సర్వారం హలావత్ తండాలో మాలోత్ రమేష్ (35) అప్పులు ఎక్కువై పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
*రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుస్తానంటూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి సోమవారం సాయంత్రం విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి మామిడిపాలెం వద్ద ఉన్న ఒకటో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో దూకి ఆత్మహత్యచేసుకుంది. ఈ ఘటనలో స్థానిక విజయనగర్ కాలనీకి చెందిన గుంజా రేణుక(20) మృతి చెందింది.
*కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాములపాడు మండంలం పెంచికలపల్లె గ్రామంలో నివసిస్తున్న వాడాలా వెంకటేశ్వర్లకు భార్య దేవమ్మ(28) మూడేళ్ల కూతురు ఉన్నారు. కాగా ఇటీవల రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర్లు దానికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని భావించి సమీపంలో ఉన్న నిప్పుల వాగులోకి తోసేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.