Business

బ్రాహ్మణి చెప్తున్న భువనేశ్వరి అత్తయ్య ముచ్చట్లు

Nara Brahmani Speaks About Mother In Law Bhuvaneswari

చిన్నప్పుడు అత్తయ్యా వాళ్లింటికి వెళ్లడం… అక్కడే కొన్నిరోజులు ఉండటం అలవాటు. అందుకే పెళ్లయ్యాక నేను వేరే ఇంటికి వెళ్లాననిపించలేదు. ఇది నా మెట్టినిల్లు అనేకంటే ఇంకో పుట్టిల్లు అనే ఫీల్‌ అవుతా. చిన్నప్పుడు నేను భువనేశ్వరి అత్తయ్యకి భయపడేదాన్నట. అప్పుడప్పుడూ ఆ విషయం గుర్తు చేసి నన్ను ఆటపట్టిస్తుంటారు. తనకి ఆడపిల్లలు లేకపోవడంతో నన్నే కూతురు అనుకుంటారు. పెళ్లయ్యాక కూడా చదువుకుంటానంటే అందరికంటే ముందు అత్తయ్యే ప్రోత్సహించారు. ఆమె చాలా తెలివైనవారు. మావయ్య హెరిటేజ్‌ను స్థాపించి చంటిబిడ్డలా అత్తయ్య చేతుల్లో పెడితే దాన్ని రెండువేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. నా దృష్టిలో ఇల్లాలిగా, వ్యాపారవేత్తగా ఆమె ‘ది బెస్ట్‌’. మావయ్యగారు రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇటు ఇంటినీ అటు ఆఫీసునీ చాలా చక్కగా మేనేజ్‌ చేసుకుంటారు. ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛా, స్వాతంత్య్రం అవసరమంటారు. అందుకే హెరిటేజ్‌ ద్వారా మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఆడపిల్లల చదువుకి సాయం అందిస్తున్నారు. బయటే కాదు ఇంట్లో కూడా ఆడపిల్లల్ని ఎంకరేజ్‌ చేస్తారు. అది నా విషయంలోనే రుజువైంది.
నన్ను నమ్మి హెరిటేజ్‌ కీలక బాధ్యతలు నాకు అప్పగించాలన్న నిర్ణయం అత్తయ్యదే. ఎప్పుడూ నన్ను గైడ్‌ చేస్తుంటారు. పెళ్లయ్యాక తననుంచీ నేను చాలా నేర్చుకున్నా. సెలవురోజైనా తెల్లవారుజామున నాలుగ్గంటలకే నిద్రలేస్తారు. వ్యాయామం ఆ తరవాత పూజా చేశాకే దినచర్య ప్రారంభిస్తారు. ఆరోగ్యంపట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇంట్లోకీ, మావయ్యగారికీ ఏం కావాలో స్వయంగా చూసుకుంటారు. తరచూహెరిటేజ్‌ బ్రాంచిలన్నింటికీ వెళ్లొస్తుంటారు. ఎంత దూరం ప్రయాణం చేసినా అత్తయ్య అస్సలు అలసిపోరు. ఆ విషయంలో నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఏ పనినీ వాయిదా వేయరు. ఏదైనా చేయాలీ అనుకుంటే వందశాతం కష్టపడి చేసి తీరతారు. ఆ పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. మా అబ్బాయి దేవాన్ష్‌ పనులైతే ఎవర్నీ చేయనివ్వరు. తనే వాడిని రెడీ చేసి స్కూలుకు పంపుతారు. నానమ్మగా వాడితో క్వాలిటీ టైం గడపడానికే చూస్తారు. నాకేదన్నా పని ఉంటే వాడికోసం ఆమె ఇంట్లో ఉండిపోయి నన్ను పంపుతారు. అలాంటప్పుడే ఉమ్మడి కుటుంబం విలువ తెలుస్తుంది. నాక్కూడా అదే ఇష్టం. అందుకే పెళ్లైనప్పట్నుంచీ అత్తయ్య వాళ్లతోనే కలిసి ఉంటున్నాం.

నా విజయంలో అత్తయ్యదే కీలక పాత్ర అని గర్వంగా చెప్పుకుంటా. పండగలూ, ఇతర ఫంక్షన్లప్పుడు తను దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుని మీరంతా సమయానికి వస్తే చాలని చెబుతారు. ఎప్పుడూ చురుగ్గా ఉండే అత్తయ్య పనితీరు చూస్తే నాకు ముచ్చటేస్తుంది. తనని దగ్గరగా చూస్తున్న నేను కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా. అత్తయ్యలా వ్యక్తిగతంగానూ వృత్తిగతంగానూ చక్కగా సమన్వయం చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నా.