ScienceAndTech

రేడియో అలా తయారైంది

The history of how Marconi made the radio

అది 1901వ సంవత్సరం. మార్కోని తన సహాయకులతో కలిసి న్యూఫౌండ్ లాండ్‌లో ఒకచోట పూరి గుడిసెలో కూర్చున్నాడు. మంచి శీతాకాలం. తుఫాను గాలులు గోడ పగుళ్లలో నుంచి ఎముకలు కొరికేలా వీస్తున్నాయి. పైకప్పు రంధ్రాల నుంచి వర్షం పడుతున్నది. పని అవుతుందా లేదా? అనే ఆందోళన మొదలైంది. చూడండి. ఈ ప్రయోగం విజయవంతం అయితేనే మనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చినట్లు అవుతుంది. వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేద్దాం. ఫలితం అనుకూలంగానే వస్తుందనే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం. మీలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు అంటూ సహచరులకు మార్కోని సందేశం ఇచ్చాడు.
**డియర్ మార్కోనీ! మీ శ్రమ ఏంటో మాకు తెలుసు. తప్పకుండా విజయం సాధిస్తారు అనే నమ్మకం మాలో ఉంది. మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యంలో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు ధన్యవాదాలు అంటూ వాళ్లు మార్కోనీ సేవల్ని కొనియాడారు. తమ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కొద్దిసేపటికి.. 400 అడుగుల ఎత్తున్న ఏరియల్ గాలికి ఊగుతుంది. 2,170 మైళ్ల దూరంలో మోర్స్ కోడ్ ప్రకారం S అక్షరాన్ని ప్రసారం చేయాల్సి ఉంది. ప్రయోగం కొనసాగుతూనే ఉన్నది. ఏవో శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయి. కానీ వాటిలో స్పష్టత లేదు. మార్కోనీలో ఆందోళన మళ్లీ మొదలైంది. భూమి గోళాకారంగా ఉండటం వల్ల విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించడానికి అవరోధం ఉండదు. ప్రపంచంలో ఎక్కడికైనా వాటిని ప్రసారం చేయవచ్చు అన్నాడు మార్కోనీ. దృష్టంతా సముద్రం వైపే ఉంది. అవతలివైపు నుంచి ఏవైనా సంకేతాలు వినబడతాయేమో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఎలాంటి సంకేతాలు, సమాచారం రాలేదు. ఇక ఆశలు అడియాశలే అనుకొని ప్రయోగం విరమించే ఆలోచనలో ఉన్నాడు మార్కోనీ. మళ్లీ ఓవైపు, సముద్రం అవతలి వైపుకేసి చూస్తున్నాడు. తన అనుచరుడు చేయి పైకెత్తి సైగ చేశాడు. వెంటనే మార్కోనీకి సమాచారం అందించాడు. పిప్.. పిప్.. పిప్ అని మూడుసార్లు శబ్దం వినిపించింది. ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇంతకూ అదేం ప్రయోగం? మార్కోనీ ఎవరు? ఏం చేశాడాయన? వైర్‌లెస్ తరంగ ప్రయోగం అది. సముద్రాలపై దీనిని ప్రయోగించాడు. ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా అహర్నిషలూ కష్టపడి సాధించాడు మార్కోనీ. ప్రజా జీవనంలో దీని మహత్తర ఉపయోగాన్ని ఎలుగెత్తి చాటే సంఘటలు తర్వాత చాలా జరిగాయి. 1909లో రెండు పడవలు సముద్ర మధ్యలో ఢీకొన్నాయి. దాంట్లో 1700 మంది ఉన్నారు. అప్పుడు అందరి ముందు ఉన్న ఒకే ఒక్క పరిష్కారం మార్కోనీ వైర్‌లెస్ విధానం. మర్కోనీ తరంగ పద్ధతి గనుక వైర్‌లెస్ ద్వారా తీరానికి సమాచారం వెంటనే అందించకపోయి ఉంటే వాళ్లంతా మునిగిపోయేవారు.
*రేడియోను కనిపెట్టింది కూడా ఇతడే. తీగల సహాయం లేకుండా శబ్దాలు.. మాటలు ఎలా వినవచ్చో ప్రయోగం ద్వారా నిరూపించాడు. మార్కోనీ పూర్తిపేరు గూగ్లీల్మో మార్కోనీ. ఇతడు 1874లో ఇటలీలోని బలోగ్నోలో పుట్టాడు. మార్కోనీ తండ్రి పెద్ద భూస్వామి. మార్క్.. అస్తమానం ఆ ప్రయోగం.. ఈ ప్రయోగం అని తిరగకుండా నాతో పాటు ఉండు. సమాజం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రయోగాలు చేస్తే మనకు వచ్చేదేముంది? ఇప్పుడు ఓ వంద ఎకరాలు ఉందనుకుందాం.. నేను రెండొందల ఎకరాలకు పెంచి నీకిస్తే.. నువ్వు దానిని ఓ మూడువందల ఎకరాలకు పెంచి వచ్చే తరం చేతిలో పెట్టాలి. అంటే ఆస్తులు పెరగాలి అని అర్థం. అర్థమయ్యిందా? అని ప్రశ్నించాడు. నాన్నా.. నాకు నచ్చని పనులు చేయలేను. ఈ ఆస్తులు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి. కానీ మనం ఏదైనా ఒక పరికరం కనిపెడితే అది ఎల్లకాలం గుర్తుండిపోతుంది. నాకు విద్యుదయస్కాంత పరికరాలను, వాటి పనితీరును పరిశీలించాలని, అధ్యయనం చేయాలని ఉంది. ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా అని మార్కోనీ వాళ్ల నాన్నకు బదులిచ్చాడు. తండ్రి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మార్కోనికి అప్పుడు 13 సంవత్సరాలు. అగస్టో లాబొరేటరీలో ప్రైవేటుగా చదువుకున్నాడు. చదువు కొనసాగిస్తూనే లివోర్నో నగరంలోని ఒక సంస్థలో ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ విద్యుదయస్కాంత తరంగాలను పరిశీలించడం ఆయన డ్యూటీ. ఇక్కడ వాళ్లమ్మ కలుగజేసుకొని ఏది చేసినా ఎప్పటికీ గుర్తుండే పని చేయి బిడ్డా అని తల్లి మార్కోనీతో చెప్పింది. ఇంటి దగ్గరే ఉంటూ కొడుకు ఏం చేస్తున్నాడో అని ఎప్పుడూ నిఘా వేసి ఉంచేది. అప్పటికే మాక్స్‌వెల్ విద్యుత్‌శక్తి, అయస్కాంత తత్వాలకు సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. అయితే విద్యుత్ అయస్కాంత బలాలకు సంబంధించిన ఆయన ప్రతిపాదనలను ఎవరూ అంగీకరించలేదు. సిద్ధాంతం సరైందే అని నిరూపించేలోపు మాక్స్‌వెల్ మరణించాడు. హెర్ట్‌జ్ విద్యుత్ ప్రేరణ యంత్రాన్ని కనిపెట్టి దాని సహాయంతో విద్యుత్ అయస్కాంత తరంగాలపై పరిశోధనలు చేశాడు. కానీ పూర్తికాకముందే చనిపోయాడు. ఇతడు ప్రతిపాదించిన హెర్ట్ తరంగాలు, కాంతి రెండూ విద్యుత్ అయస్కాంత తరంగాలే అని శాస్త్రవేత్తలు అంగీకరించారు.
*హెర్ట్‌జ్ తర్వాత విద్యుత్ అయస్కాంత తరంగాలపై బ్రాన్లీ ప్రయోగం చేశాడు. కానీ అతడి ప్రతిపాదనలూ ఆమోదానికి నోచుకోలేదు. ఈ ముగ్గురి ప్రయోగాలు.. ప్రతిపాదనలు మార్కోనీకి మంచి వనరు అయ్యాయి. చేయకూడనివి ఏమిటో తెలిసిపోయింది. తనకు చిన్నప్పటి నుంచి ఎలాగూ విద్యుత్ అయస్కాంత పరికరాల అధ్యయనంపై అభిరుచి ఉంది కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని అనుకున్నాడు. రేడియోను కనిపెట్టేందుకు ఇంట్లోనే ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలన్నీ సిద్ధం చేసుకున్నాడు.
*మిజ్‌నా.. మీరు సిద్ధంగా ఉన్నారా? పని ప్రారంభిద్దామా? అని సహాయుడిని అడిగాడు. కింది అంతస్తులో తల్లిదండ్రులు ఉండేవారు. పై అంతస్తులో మార్కోనీ ఉండేవాడు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే కిందికి వచ్చేవాడు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడం ఒక అలవాటుగా మారిపోయింది అతనికి. ఒకరోజు అర్ధరాత్రి.. తల్లిని నిద్రలేపాడు మార్కోనీ. ఏంట్రా.. ఇంత అర్ధరాత్రి నిద్రలేపావు. నాన్న కోప్పడతాడు అన్నది వాళ్లమ్మ. నీకు ఓ గమ్మత్తు చూపిస్తానమ్మా. నువ్వే కాదు అది చూసి నాన్న కూడా మెచ్చుకుంటాడు అంటూ వాళ్లమ్మను పై అంతస్తులోకి తీసుకెళ్లాడు. అప్పటివరకు ఎప్పుడు కూడా మార్కోనీ అతని సహాయకుడు తప్పితే వేరేవాళ్లెవరూ పై అంతస్తులోకి వెళ్లలేదు. ఒకచోట మోర్స్ కీ 12 అడుగుల దూరంలో ఎలక్ట్రిక్ బెల్‌ని అమర్చి ఉంది. కీని అదిమితే గంట మోగుతుంది. మధ్యలో తీగలు లేకపోయినా గంట మోగే ఇంకో పరికరం ఉంది. ఇవన్నీ చూసిన వాళ్లమ్మ.. ఇది ఇల్లా? ప్రయోగశాలనా? ఏంటి చిన్నపిల్లాడిలా ఈ బొమ్మలు అని విసుక్కుంది. వెనక్కి తిరగకుండా కిందికి వెళ్లిపోయింది. మార్కోని తన పరికరాలన్నింటినీ తోటలోకి షిప్ట్ చేశాడు. క్రమంగా సంకేతాలు వెళ్లగలిగే దూరాన్ని పెంచుతూ పోయాడు. ఓ చిన్న గుట్ట అవతలివైపు దాకా సంకేతాలు వెళ్ల గలిగాయి. సంకేతం ఆవలి వైపున చేరగానే దాన్ని గుర్తించానని నాట్యం చేయడానికి వాళ్ల తమ్ముడు గుట్టపై నిలబడి నాట్యం చేసేవాడు. 1896 నాటికి ఈ సంకేతాలు రెండు మైళ్ల దాకా వెళ్లగలిగేవి. ఇలా ప్రతిరోజూ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
*కొన్ని పరిస్థితుల వల్ల వాళ్లు ఇటలీ నుంచి లండన్ వెళ్లారు. లండన్ వెళ్లగానే మార్కోనీ వైర్‌లెస్ పరికరం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకొని.. పేటెంట్ హక్కు సంపాదించాడు. ఎన్నో ప్రయోగాల ఫలితంగా.. రేడియోను కనిపెట్టి ఈ ప్రపంచాన్ని శబ్దతరంగాలతో నిద్ర లేపాడు మార్కోనీ. చాలారోజులకు.. వైర్‌లెస్ విధానం ద్వారా తొలి సంకేతాన్ని ప్రసారం చేసిన ఈ ప్రయోగం గొప్ప చారిత్రాత్మ సంఘటన అని మార్కోనీ తల్లి గ్రహించింది. అనతికాలంలోనే మార్కోనీ ప్రయోగాల విజయగాథలు ఐరోపా అంతటా వ్యాపించాయి. ఎక్కడ చూసినా ప్రజలు ఆయన వినూత్న ఆవిర్భావాన్ని గురించి చర్చించుకోసాగారు. ఇదివరకు ఇంగ్లండ్‌లో అతడిని వెక్కిరించినవాళ్లు.. విమర్శించిన వాళ్లు తర్వాత ప్రశంసలు కురిపించారు. తర్వాత సంకేతాలను ఎక్కువ దూరం ప్రసరింపజేసేలా చేయడంలో మార్కోనీ సక్సెస్ అయ్యి.. రేడియోను లాంచ్ చేశారు.
*మనపై మనకు నమ్మకం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపించాడు మార్కోనీ. ఎందుకంటే, భౌతిక శాస్త్రవేత్తలు ఇతడు ఎదుర్కొన్న విమర్శలు బహుశా మరే శాస్త్రవేత్తా ఎదుర్కొని ఉండకపోవచ్చు. కాపీ కొట్టావని కొందరు, ఐడియాను దొంగిలించుకెళ్లావని ఇంకొందరు, ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవని మరికొందరు! చివరకు అది సాధ్యం అయిందన్నాడు.. నానా రకాలుగా డిస్టర్బ్ చేసినా అతడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెట్టకుండా అందరికీ దూరంగా ఉంటూ తనపై తాను నమ్మకంతో ప్రయోగాలు చేశాడు. విజయం సాధించాడు.