NRI-NRT

వర్జీనియాలో TSRTC రభస

NRI Telanganites Protest To Save RTC At TDF 20th Anniversary In Virgnia USA

ఆరు వారాలుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను దాటి అమెరికాకు కూడా పాకింది. అక్కడ పర్యటిస్తున్న టీఆర్ఎస్ నాయకులకు కూడా ఎన్నారైల నుంచి ఆర్టీసి సెగ తగులుతోంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పలువురు ఎన్నారైలు టీఆర్ఎస్ నేతల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(టీడీఎఫ్) 20వ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అమెరికాకు వెళ్లారు.. ఆయనతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు. సభలో వినోద్ మాట్లాడుతుండగా.. కొంత మంది ఎన్నారైలు ఆర్టీసీకి మద్దతుగా ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ‘సేవ్ ఆర్టీసీ.. సేవ్ ఆర్టీసీ’ అంటూ పదే పదే నినాదాలు చేశారు. దీంతో సభలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభ నిర్వాహకులు వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత మాట్లాడిన వినోద్ కుమార్.. ఆర్టీసీ విషయమై నిరసన తెలియజేయడాన్ని తాను తప్పబట్టడం లేదన్నారు. ‘ఆర్టీసీ అంశం గురించి చర్చించాలనుకుంటే చాలా సేపు చర్చించుకోవచ్చు. నేను ఇక్కడకు రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు. కొన్ని రాష్ట్రాలు ఆర్టీసిని ఇప్పటికే రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉంది…’ అంటూ వినోద్ చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగా.. ‘కేసీఆర్.. ఆర్టీసీ ఉండదని అంటున్నారు.. మీరేమంటారు..’ అని పలువురు ఎన్నారైలు ప్రశ్నించారు. దీంతో సభలో మరోసారి గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన వినోద్.. ఇక్కడ జరిగిన విషయాలు.. ఎన్నారైల అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాను కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాననీ.. నిరసనలను, అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును ఎవరూ అణచివేయలేరన్నారు. ‘ఆర్టీసీ గురించి ఎవరైనా తనతో మాట్లాడాలనుకుంటే.. నా గదికి రండి.. అక్కడ ఎంతసేపైనా మాట్లాడుకుందాం.. అంతా విన్న తర్వాత 100 శాతం నాతో పాటు ఏకీభవిస్తారు..’ అని ఓ తరుణంలో వినోద్ అన్నారు. ఈ ఘటన అమెరికాలోని తెలంగాణ వాసుల్లో చర్చనీయాంశమయింది.