ScienceAndTech

అసత్య వార్తలపై గూగుల్ కొరడా

Google hitting hard on fake news-Telugu scitech news

అంతర్జాలంలో చక్కర్లుకొట్టే రాజకీయ అసత్య వార్తలను నియంత్రించేందుకు మరో అడుగు ముందుకేసింది గూగుల్ సంస్థ. ఇందుకోసం రాజకీయ వార్తల ప్రకటన విధానాలను మరింత కఠినతరం చేసింది. ఓటర్ల నమ్మకాన్ని, ఎన్నికల్లో పాల్గొనాలనుకునేవారి ఆత్మస్థైర్యాన్ని బలహీనపరిచే తప్పుడు ప్రకటనలు, అలాంటి సమాచారానికి సంబంధించిన లింక్‌లను నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ అసత్య వార్తల నియంత్రణకు సరికొత్త విధానాలు రూపొందించింది అంతర్జాల దిగ్గజం గూగుల్​. ఇందుకోసం రాజకీయ వార్తల ప్రకటన విధానాలను మరింత కఠినతరం చేసింది.

ఆన్​లైన్​ మాధ్యమాల్లో అసత్య వార్తల ప్రచారాన్ని నియంత్రించాలన్న వివిధ వర్గాల ఒత్తిళ్లతో ఈ నిర్ణయం తీసుకుంది గూగుల్. ఎడిట్​ చేసిన ఫొటోలు, వీడియోలను ఎలా నియంత్రించనున్నారో తెలిపేందుకు కొన్ని ఉదాహరణలు చెప్పింది. ఓటర్ల నమ్మకాన్ని, ఎన్నికల్లో పాల్గొనాలనుకునేవారి ఆత్మస్థైర్యాన్ని బలహీనపరిచే తప్పుడు ప్రకటనలు, అలాంటి సమాచారానికి సంబంధించిన లింక్‌లను నిషేధించడం ఇందులో భాగమేనని పేర్కొంది.

“ఎన్నికల తేదీ మార్పు, అభ్యర్థి మరణానికి సంబంధించి అసత్య వార్తలు ప్రకటించాలనుకోవడం మా విధానాలకు విరుద్ధం. ప్రజాస్వామ్యంలో బలమైన రాజకీయ వాదోపవాదనలు ముఖ్యమైన భాగమని మాకు తెలుసు. అయితే వాటిల్లో ఏది సత్యమో, ఏది అసత్యమో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అందుకే మేము నిషేధించే రాజకీయ వార్తలు ప్రస్తుతానికి తక్కువగానే ఉంటాయి. చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం.”-స్కాట్​ స్పెన్సర్​, గూగుల్​ యాడ్స్​ ప్రాడక్ట్ మేనేజ్​మెంట్​ వైస్​ ప్రెసిడెంట్​

ఏదైనా అంశం గురించి గూగుల్​లో శోధించినప్పుడు యూట్యూబ్​లో వచ్చే వీడియోలు, ఇతర వెబ్​సైట్లలో వచ్చే యాడ్స్​తోనే ప్రధానంగా రాజకీయ అసత్య వార్తలు ప్రసారం అవుతున్నాయన్నారు స్పెన్సర్​. అందుకే గూగుల్​ యాడ్స్​లో రాజకీయ ప్రకటనలను వయస్సు, లింగం, ప్రదేశానికే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు​. అయితే సందర్భాన్ని బట్టి ప్రకటనదారులు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన యాడ్స్​ ఇచ్చుకోవచ్చన్నారు.