DailyDose

నేటి పది ప్రధాన వార్తలు- 12/03

Telugu top 10 breaking news round up of the day latest

1.ఆధునిక రోటా వ్యాక్సిన్‌ ఆవిష్కరణ
ఆధునీకరించిన రోటా వ్యాక్సిన్‌ ‘ రోటా వ్యాక్స్‌5డి’ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.రెండేళ్లలోపు పిల్లలకు డయేరియా వ్యాధి నివారణ కోసం ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఇప్పటి వరకు దీనిని మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తున్నారు. ఆ పరిస్థితిని అధిగమించే రీతిలో భారత్‌ బయోటెక్‌ సంస్థ వ్యాక్సిన్‌ను ఆధునీకరించింది.
2. నితిన్‌ గడ్కరీని కలిసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
కేంద్రం రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు, పలువురు తెరాస ఎంపీలు దిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెండింగ్‌ రహదారుల అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన రహదారులకు గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కోరామని, హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌రోడ్డు విషయాన్ని మరోసారి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని ఆయన మీడియాతో చెప్పారు.
3. పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్
కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలికి వెళ్లి మరమ్మతు చర్యలు చేపట్టారు. దీంతో అటువైపుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
4. అయోధ్య కేసు నుంచి రాజీవ్‌ ధవన్‌ తొలగింపు
అయోధ్య వ్యవహారంలో సున్నీ వక్ఫ్‌ బోర్డు సహా ముస్లిం పక్షాల తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ను ఈ కేసు నుంచి తొలగించారు. ఈ విషయాన్ని రాజీవ్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘జామియత్‌ తరఫున వాదిస్తున్న అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ ఇజాజ్‌ మక్బూల్‌ నన్ను అయోధ్య కేసు నుంచి తొలగించారు. ఆయన నిర్ణయాన్ని నేను ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరిస్తున్నా. ఇక అయోధ్య రివ్యూ లేదా కేసు వ్యవహారంలో నేను జోక్యం చేసుకోను.’ అని రాజీవ్‌ అన్నారు.
5, 50ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం,హత్య
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటన మరవక ముందే అలాంటి దారుణ ఘటనే ఏపీలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
6. రెండోరోజుకు చేరిన ఖాతాదారుల కష్టాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఖాతాదారులు సంస్థ నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాన్ని, మొబైల్‌ యాప్‌ను వినియోగించుకోవడంలో సాంకేతిక సమస్య తలెత్తి రెండు రోజలువుతోంది. సోమవారం ఉదయం 10 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇవి పనిచేయడంలేదు. దీనిపై సోషల్‌ మీడియాలో కూడా తీవ్రవిమర్శలు వెల్లువెత్తున్నాయి.
7. ఆసక్తికర టైటిల్‌తో నాని కొత్త సినిమా..
వైవిధ్యమైన పాత్రలు, కథలతో అలరించే యువ కథానాయకుడు నాని. ఒక సినిమా పూర్తవుతుందనగానే, మరో సినిమాకు పచ్చ జెండా ఊపేస్తారు. ఇప్పటికే ఈ ఏడాది ‘గ్యాంగ్‌లీడర్‌’తో బాక్సాఫీస్‌ వద్ద అలరించిన ఆయన ప్రస్తుతం ‘వి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణలో ఉండగానే తన కొత్త సినిమాను ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఈ సినిమా టైటిల్‌, ఇతర వివరాలు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘టక్‌ జగదీష్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
8. పోలీసు కుట్రతో చంద్రబాబుపై దాడి: అచ్చెన్న
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పర్యటన సమయంలో బస్సుపై దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆనాటి సంఘటనను వివరించారు. అనంతరం ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాజధానిపై సీఎం, మంత్రులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల కుట్రతోనే చంద్రబాబుపై దాడి జరిగిందని అచ్చెన్నాయుడు విమర్శించారు
9. ఉల్లి లొల్లిపై ఫన్నీ మీమ్స్‌.. చూసేయండి!
ఉల్లి ధర ఆకాశాన్ని తాకుతోంది. తరగేటప్పుడే కాదు.. కొనాలన్నా కంటతడి పెట్టిస్తోంది. కేజీ ధర కొన్ని చోట్ల సెంచరీ కొట్టేసింది. ఉల్లి కోసం దొంగతనాలూ జరుగుతున్నాయి. కొన్ని చోట్లయితే డబ్బులొదిలేసి ఏకంగా ఉల్లి సంచులు ఎత్తుకుపోతున్న ఉదంతాలూ కనిపిస్తున్నాయి. ఇంతకంటే నెటిజన్లకు, ఇంకేం కావాలి? అంతే.. ఉల్లి ధరలకు సంబంధించి రకరకాల మీమ్స్‌ తయారుచేస్తున్నారు. ఆ మీమ్స్‌, వీడియోలపై ఓ లుక్కేయండి..
10. మల్లెపూలు కిలో ధర రూ.3వేలు…
తమిళనాడు రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మల్లెపూల ధరలకు రెక్కలు వచ్చాయి. దేవాలయాలతోపాటు పూజాదికాలు అధికంగా ఉన్న తమిళనాడులోని మధురై నగరంలో మల్లెపూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వారంరోజుల క్రితం మధురై నగరంలో కిలో మల్లెపూల ధర 1500 రూపాయలు పలికింది. మంగళవారం మధురై నగరంలో మల్లెపూలు కిలో ధర మూడు వేలరూపాయలకు పెరిగింది. తమిళనాడులో కురుస్తున్న భారీవర్షాల వల్ల మల్లెపూల ధర అమాంతం ఆకాశన్నంటిందని శ్రావణ్ కుమార్ అనే పూల వ్యాపారి చెప్పారు. మల్లెపూల ధర కిలో మూడువేలరూపాయలకు చేరినా భక్తులు మాత్రం వాటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు.