DailyDose

అక్టోబరులో బాగా తగ్గిన పారిశ్రామికోత్పత్తి-వాణిజ్యం-12/12

Business News Roundup Of The Day In Telugu-India Witnesses Decline In Manufacturing-12/12

* ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ గురించి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లోక్‌సభకు రాతపూర్వక సమాధానంగా తెలియజేశారు. ‘దాదాపు రూ.50,000 కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో 100 శాతం వాటాను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100శాతం వాటా విక్రయానికి ఎయిరిండియా స్పెసిఫిక్‌ ఆల్టర్నేటివ్‌ మెకానిజం(ఏఐఎస్‌ఏఎం) కూడా అంగీకరించింది’అని ఆయన తెలిపారు. 2018-19 సంవత్సరంలో ఎయిరిండియా నష్టం రూ.8,556.35కోట్లుగా ఉంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని గతేడాది మార్చిలోనే ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అప్పుల బారిన పడ్డ సంస్థను కాపాడేందుకు ఐదేళ్లు సమయం ఇవ్వాలన్న పార్లమెంటరీ ప్యానెల్‌ చేసిన సిఫారసును విస్మరించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రతిపాదిత అమ్మకం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియాను 100శాతం ప్రైవేటుపరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందనే విషయాన్ని మంత్రి హర్‌దీప్‌ గత ఆగస్టులోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

* దేశాన్ని ఆర్థిక మందగమనం ఓవైపు వెంటాడుతుంటే.. మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి కూడా పడిపోతోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 3.8శాతానికి పడిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌, ఖనిజాలు, ఉత్పత్తి రంగాల్లో నెలకొన్న పేలవమైన ప్రదర్శనే ఇందుకు కారణం. గతేడాది ఇదే సమయానికి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 8.4గా ఉండటం గమనార్హం. ఉత్పత్తి రంగంలో నెలకొన్న మందగమనంతోనే ఈ పరిస్థితి దిగజారినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. గతేడాది 12.2 శాతంగా ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి ఈ ఏడాది 10.8శాతానికి పడిపోయింది. అలాగే, ఖనిజ ఉత్పత్తులు కూడా 8 శాతం నుంచి 7.3శాతానికి పడిపోయాయని గణాంకాలు సూచించాయి.

* వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో సాగాయి. ఆ సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు కూడా రాణించాయి. అటు లోహ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు కూడా సూచీలను ముందుకు నడిపించాయి. ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఒక దశలో దాదాపు 300 పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. అటు నిఫ్టీ కూడా 12వేల మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే చివర్లో కొన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఒత్తిడికి గురైన సూచీలు లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది. నేటి సెషన్‌లో 169 పాయింట్ల లాభంతో 40,582 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 11,972 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.60గా కొనసాగుతోంది. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో నిలిచాయి. లోహ, ఆటోమొబైల్‌, ఫార్మా, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు రాణించాయి. గత సెషన్లలో భారీ నష్టాన్ని చవిచూసిన యెస్‌ బ్యాంక్‌ షేరు నేడు దూసుకెళ్లింది.

* ఉజ్జీవన్‌ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ నేడు భారీ ప్రీమియంతో మార్కెట్లలో నమోదైంది. లిస్టింగ్‌సమయంలో ఈ షేరు ధర రూ.58గా పలికింది. అంటే ఐపీవోలో కేటాయించిన రేటు కంటే 57శాతం అధికమన్నమాట. ఇష్యూలో దీనిని రూ.37కు కేటాయించారు. ఒక దశలో ఈ షేరు రూ.62.08కి కూడా చేరింది. రూ.750 కోట్లను సమీకరించేందుకు ఐపీవోకు వచ్చిన ఈ సంస్థకు రూ.76వేల కోట్లకు బిడ్లు రావడం విశేషం. అంటే దాదాపు 160 రెట్లకు పైమాటే. 2018 నుంచి వచ్చిన అన్ని ఐపీవోల్లోకి ఇదే అత్యధికంగా బిడ్లను దక్కించుకొంది. ఈ ఐపీవోలో 12.4 కోట్ల షేర్లను విక్రయించాలని సంస్థ భావించగా.. 20,538 మిలియన్ల షేర్లకు డిమాండ్‌ వచ్చింది.