Politics

ఢిల్లీ పోయి తెరాసను తిట్టిన రేవంత్

Congress MP Revanth Reddy Slams TRS For Making Telangana Debt State

రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం.. మరోసారి సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చడం లేదని ఆరోపించారు. పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. మిగుల బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఆరేళ్లలోనే అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. రూ.16వేల కోట్ల మిగుల బడ్జెట్‌తో కొత్త రాష్ట్రంగా ప్రయాణం మొదలు పెట్టిన తెలంగాణ.. ఆరేళ్లు పూర్తయ్యేసరికి రూ.3లక్షల కోట్ల అప్పుతో ఉందని ధ్వజమెత్తారు. ఇప్పుడు బంగారు తెలంగాణ కాదని.. బాకీల తెలంగాణ అయిందని ఈ సందర్భంగా రేవంత్‌ ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ.. ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని రేవంత్‌ విమర్శించారు.