DailyDose

టిక్‌టాక్ మోజులో మొగుడ్ని వదిలేసింది-నేరవార్తలు-12/14

Wife loses husband being busy on tiktok-telugu crime news-12/14

* ఓ ఇల్లాలు టిక్‌టాక్‌ మోజులోపడి కట్టుకున్న భర్తనే వదిలేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ ఘటన జరిగింది. టిక్‌టాక్‌లో పరిచయమైన బెంగళూరుకు చెందిన అంజలి కోసం..అర్చన అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఇల్లును వదిలి బెంగళూరు వెళ్లిపోయింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు అర్చనను పట్టుకుని తిరిగి భర్తకు అప్పగించారు.

* హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ హస్టల్‌లో ఉంటున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయితేజ(23) అనే యువకుడు వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉద్యోగం రావట్లేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

* తెలంగాణలో దిశ హత్యాచార ఉదంతంతో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఘమేఘాలపై అమల్లోకి తెచ్చిన దిశ చట్టం 2019పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఇలాంటి చట్టాన్ని దేశమంతా అమలు చెయ్యాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దిశ చట్టాన్ని వెంటనే దేశమంతా అమల్లోకి తెవాలని ఢిల్లీ మహిళా కమిషన్ (డ్ఛ్వ్) అధ్యక్షురాలు స్వాతి మలివాల్… ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 12 రోజులుగా తాను నిరాహార దీక్ష చేస్తున్నా… కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం దేశమంతా అమల్లోకి వచ్చే వరకూ తాను నిరాహార దీక్షను విడిచే ప్రసక్తే లేదన్నారు స్వాతి మలివాల్.

* నగదు, బంగారం, విలువైన వస్తులు చోరీ కావడం చూస్తూనే ఉంటాం. అయితే వాటి జాబితాలో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చేరాయి. ఉల్లిరేటు భారీగా పెరగడంతో వీటిని కూడా వదలడం లేదు దొంగలు. చిక్కడపల్లి దోమలగూడలో కూరగాయల వ్యాపారి బండి నుంచి 20 కేజీల ఉల్లిగడ్డలను చోరీ చేశాడో దొంగ. అర్థరాత్రి బైక్ వచ్చిన దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలీసులు.

* నగరంలోని బషీర్‌బాగ్‌లోని రిధే సిద్ధే జువెలర్స్‌లో చోరీ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన నిందితులు అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. నిందితుల నుంచి రూ39 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.

* గుంటూరు జిల్లా నగరపాలెంలో అత్యాచారానికి గురైన యువతిని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆస్పత్రి ఎదుట జనసేన, వామపక్ష, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. పరామర్శకు వచ్చిన పద్మను బాధితురాలి బంధువులు రాజకీయ, ప్రజాసంఘాల నేతలు అడ్డుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. బాధితకుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులపై దిశ చట్టం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు.

* పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోం రాష్ట్రంలో ఆందోళనలు అధికమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కర్ఫ్యూ విధించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలకు ఊరట లభించింది. నిత్యవసర వస్తువులు, సరుకులను కొనుగోలు చేసేందుకు జనాలు రోడ్లపైకి వస్తున్నారు. కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ పోలీసులు ఆందోళనకారులపై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో.. బుధవారం నుంచి అసోంలో ఆందోళనలు మొదలయ్యాయి. గురువారం ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అసోంలో 48 గంటల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పోలీసులు నిలిపివేశారు.

* పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శుభోదయ లాడ్జ్‌ లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వారిపై తాడేపల్లిగూడెం పట్టణ సిఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో శనివారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా.. పట్టణ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిఐ ఆకుల రఘు వివరాలను వెల్లడించారు. పుట్టపూడి వీర నరసింహారాజు అనే క్రికెట్‌ బుకీ నిర్వహకుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. బుకీ నుంచి లాప్‌టాప్‌, ఏడు సెల్‌ ఫోన్లు, రెండు లైన్‌ ఫోన్లు, ఆరు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడి వద్ద సేకరించిన వివరాల ఆధారంగా ఈ బెట్టింగ్‌ నిర్వహణలో ఉన్న మరికొంత మంది బుకీలను త్వరలో అరెస్ట్‌ చేయనున్నామని సిఐ వివరించారు.

* సీబీఐ ద్వారా తన బిడ్డకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అయేషా మీరా తల్లి బేగం పేర్కొంది. రీపోస్టుమార్టంతో అయేషామీరాకు న్యాయం జరుగుతుందని దేశంలోని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారన్నారు. అయేషామీరాకు జరిగిన అన్యాయం మరే మహిళకు జరగొద్దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తీసుకురావడం శుభపరిణామమన్నారు. దిశ చట్టం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా అయేషామీరా హత్య ఘటన ప్రస్తావిస్తే బాగుండేదన్నారు.

* నెల్లూరు గ్రామీణ తహసీల్దార్ నిర్మలానంద బాబు సస్పెండ్ అయ్యారు. కులదృవీకరణ పత్రాల జారీలో అవకతవకలకు పాల్పడినట్టు నిర్దారణ కావడంతో జిల్లా కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారు. కోర్టు పరిధిలోని కులానికి కులదృవీకరణ పత్రం తహసీల్దార్ మంజూరు చేశారు.

* చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో ఆటో బోల్తా 20 మందికి గాయాలు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఏర్పేడు మండలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్తున్న కూలీలని తెలుస్తోంది. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

* అయేషామీరా మృతదేహం వెలికితీసి… ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది.

* భార్య పెట్టే దుబారా ఖర్చులు, వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన భర్త తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. శ్రీనాథ్ (39) సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేసేవాడు. ఇతని భార్య రేఖ నిత్యం దుబారా ఖర్చులు పెడుతూ విలాసవంతమైన జీవితం గడిపేది. భార్య పెట్టే దుబారా ఖర్చులు, ఫ్లాట్ కొనడం కోసం శ్రీనాథ్ పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు. శ్రీనాథ్ పేరిట ఉన్న ఫ్లాటును తన తండ్రి పేరిట బదలాయించాలని భార్య రేఖ ఒత్తిడి చేసింది. నిత్యం భార్య రేఖ పెట్టే వేధింపులు భరించలేక విసిగిపోయిన శ్రీనాథ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు శ్రీనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి భార్య రేఖ, ఆమె తల్లిదండ్రులపై ఐపీస సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* బంగాల్‌లోని లగోలా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పౌరసత్వ సవరణచట్టాన్ని వ్యతిరేకిస్తూ బంగాల్‌లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. హౌరా లోని సంక్రాలి రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టగా అక్కడ ఉన్న పలు దుకాణాలు తగలబడ్డాయి. అనంతరం టికెట్‌ కౌంటర్‌ను తగులబెట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆర్పీఎఫ్‌, రైల్వే సిబ్బందిపై దాడి చేసి గాయపరిచినట్లు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారి ఒకరు తెలిపారు. 

* ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటువంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించేందుకు తెచ్చిన దిశ బిల్లును అసెంబ్లీ ముక్తకంఠంతో ఆమోదించిన రోజే గుంటూరు సిటీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఉదంతంపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. బాధితురాలు చికిత్స పొందుతున్న జీజీహెచ్‌ ఆస్పత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకొని.. నిరసన తెలిపాయి. హోంమంత్రి ఎక్కడ….తను గుంటూరు నగరములో నివాసముంటున్న ఎందుకు బైటికి రావటం లేదని విమర్శించారు. ‘నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారా.. లేక రెడ్డి సామాజికవర్గంవాడని చెప్పి వదిలిపెడతారా’’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. వారితో టీడీపీ, బీజేపీ మహిళా నేతలు కూడా గొంతు కలిపారు. దీంతో జీజీహెచ్‌ ప్రాంతంలో కొద్దిగంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.