NRI-NRT

హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్‌లో భయంకరమైన వెయిటింగ్

Heavy waiting times in USA Consulate At Hyderabad

అమెరికాలో విద్యా సంవత్సర ప్రారంభం సమీపిస్తున్నా వీసా సమయం కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. దేశంలో వీసాలు జారీ చేసే అన్ని ప్రాంతాల్లోనూ వెయిటింగ్‌ (వేచిచూసే సమయం) అధికంగా ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఏటా జనవరి-ఫిబ్రవరి నెలల్లో అమెరికాలో వసంతకాల(స్ప్రింగ్‌ సీజన్‌) విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అక్కడికి వెళ్లేందుకు వేలాది మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఏ ప్రాంతానికి చెందినవారు అక్కడే వీసా ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్న నిబంధనను అమెరికా ఎత్తివేసింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ పరిధిలో హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలోని ఐదు ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే వేచిచూసే సమయం అధికంగా ఉంది. వీసా ఇంటర్వ్యూ కోసం కనిష్ఠంగా 25 రోజులు, గరిష్ఠంగా 78 రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. కోల్‌కతా కాన్సులేట్‌ పరిధిలో 25 రోజులు, ముంబయిలో 35, చెన్నైలో 40, హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో 78 రోజుల సమయం పడుతోంది. దిల్లీలోని రాయబార కార్యాలయంలో 35 రోజులపాటు సమయం తీసుకుంటోంది. విద్యార్థులకు సంబంధించిన వీసా(ఎఫ్‌-1) జారీ ప్రక్రియ సుమారు 120 రోజుల ముందు నుంచి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అమెరికాలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రుల్లో సింహభాగం మంది బ్యాంకుల నుంచి విద్యారుణాలు తీసుకుంటారు. ఆ ప్రక్రియలో ఎక్కడ జాప్యం జరిగినా వీసా కోసం వెయిటింగ్‌ గడువు పెరుగుతుందని వరల్డ్‌వైడ్‌ ఎడ్యూ కన్సల్టెంట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉడుముల వెంకటేశ్వరరెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. వసంత కాలంలో ప్రారంభమయ్యే కోర్సుల్లో చేరే విద్యార్థులు అక్టోబరు, నవంబరు నెలల్లో వీసాలకు దరఖాస్తు చేసుకునేందుకు సరైన సమయంగా నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 40 వేల నుంచి 50 వేల మంది చదువుకునేందుకు అమెరికా వెళుతున్నారు.