ScienceAndTech

MIT నుండి నూతన స్కానింగ్ సాంకేతికత

New safe scanning technology developed by MIT

రోగి శరీరాన్ని సురక్షితంగా పరీక్షించే అత్యాధునిక స్కానింగ్‌ విధానాన్ని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సంప్రదాయ ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ స్థానంలో తీసుకొచ్చిన ఈ విధానంతో కళ్లకు, చర్మానికి ఎలాంటి హాని ఉండదని వారు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కానింగ్‌ విధానం… చిన్నారులకు, కాలిన గాయాలతో బాధపడేవారికి, సున్నిత చర్మతత్వం గలవారికి హానికరం. ఈ పరిమితులను అధిగమించడంపై పరిశోధకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మొదట ఒక నిర్దిష్ట తరంగధైర్ఘ్యం వద్ద ప్రకంపనాలతో కూడిన కాంతి (పల్స్‌డ్‌ లేజర్‌)ని కొంతమంది వ్యక్తుల ముంజేతుల్లోకి పంపారు. చర్మంలోకి చొచ్చుకెళ్లిన ఈ కాంతి ప్రభావంతో రక్తనాళాలు వ్యాకోచించాయి. కొద్దిసేపటికి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇలా పలుమార్లు వ్యాకోచ, సంకోచాలు జరిగే క్రమంలో… చర్మం కింద ఆరు సెంటీమీటర్ల లోతులోని కండర, కొవ్వు, ఎముకల లక్షణాలను పరిశోధకులు గుర్తించగలిగారు. అంతేకాదు. శరీరంలోకి ప్రవేశించి, తిరిగి వెనక్కి చేరుకున్న ఈ ప్రకంపనాలను పరిశోధకులు సిగ్నల్‌ కన్వర్టర్ల సాయంతో చిత్రాలుగా రూపొందించారు. ‘‘ఈ కొత్త విధానం ద్వారా శరీరంలోని ప్రతి భాగాన్నీ లోతుగా పరిశీలించి, కండరాల తీరును విశ్లేషించాం’’ అని పరిశోధనకర్త బ్రియాన్‌ ఆంటోనీ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ‘జర్నల్‌ లైట్‌: సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌’ అందించింది.