DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-12/27

Today's Top 10 Breaking News In Telugu - Dec 27 2019

1.అంధకారంలోకి రాష్ట్ర భవిష్యత్తు: చంద్రబాబు
వైకాపా నేతలు, మంత్రులు రోజుకో మాట మాట్లాడి ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఆరోజు.. ఈరోజు ఎప్పుడైనా అమరావతి ప్రజారాజధానే. రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలుగా రాజధానిపై మీన మేషాలు లెక్కించింది. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన వనరులు, ఆదాయం సమకూర్చే రాజధాని అమరావతి’ అని చెప్పారు.
2. ఎప్పుడూ నేలవిడిచి సాము చేయలేదు: కేటీఆర్‌
తెరాసకు ప్రజలు అడుగడుగునా మద్దతు తెలుపుతూ కేసీఆర్‌ నాయకత్వానికి మరింత బలాన్ని చేకూర్చేలా తీర్పులిస్తూ వచ్చారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గుర్తు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా జనం తెరాస వెంటే నిలిచారన్నారు. కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘గడిచిన ఐదేళ్లలో మేం ఎక్కడా నేలవిడిచి సాము చేయలేదు. ప్రజలు కోరుకొనేవిధంగా కనీస మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన, వారికి సేవలందించే అంశంపైనే ప్రభుత్వ పరంగా కేంద్రీకరించి పనిచేశాం’ అని వ్యాఖ్యానించారు.
3. బీసీజీ నివేదిక తర్వాతే రాజధానిపై నిర్ణయం!
రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌( బీసీజీ) నివేదిక తర్వాత రాజధాని అంశంపై స్పష్టత రానుంది. రాజధానిపై జనవరి 3న బీసీజీ నివేదిక అందజేయనుంది. అనంతరం జనవరి మూడో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించి అక్కడ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది.
4. సాంకేతికతతో పేదల బతుకులు మార్చాలి: తమిళిసై
పేదల బతుకులు మార్చేందుకు సాంకేతికత ఉపయోగపడాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన 34వ భారతీయ ఇంజినీరింగ్‌ మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్‌ కృషిని గవర్నర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును ఇటీవలే సందర్శించానని, ప్రాజెక్టులో ఎక్కువ శాతం మనదేశంలో రూపొందించిన సాంకేతికతనే వాడారని చెప్పారు. ఇది చాలా గర్వకారణమని కొనియాడారు.
5. రాజధానిని అమ్మేందుకే జగన్‌ కుట్ర: కన్నా
రాజధానిని అమ్మేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర పన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా ఉద్ధండరాయపాలెంలో అమరావతి కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో ఆయన మౌన దీక్ష చేపట్టారు. దీక్ష విరమించిన అనంతరం కన్నా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని భూములను నచ్చిన వారికి అమ్ముతామని వైకాపా నేతలు చెబుతున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
6. యూపీలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
గత శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆరు జిల్లాల్లో అంతర్జాల సేవలపై నిషేధం విధించారు. ఆగ్రాలోనూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గురువారం సున్నితమైన ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పారామిలిటరీ, పోలీసు బలగాల్ని మోహరించామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు
7. దలాల్‌స్ట్రీట్‌లో కొనుగోళ్ల జోరు
మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో మెరిసిపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్, లోహ, ఐటీ, ఫార్మా సహా దాదాపు అన్ని రంగాల షేర్లలో జరిగిన కొనుగోళ్లతో సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి 411 పాయింట్లు లాభపడి 41,575 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 119 పాయింట్ల లాభంతో 12,246 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.35గా కొనసాగుతోంది.
8. ఆధార్‌ కార్డులు.. @ 125కోట్లు
భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(ఉడాయ్‌) అరుదైన మైలురాయి సాధించింది. ఆధార్‌ కార్డుల జారీలో 125కోట్ల మార్క్‌ను దాటింది. దీంతో 125కోట్ల మందికి పైగా భారతీయుల వద్ద 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య ఉందని ఉడాయ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. అంటే ప్రస్తుత దేశ జనాభాలో దాదాపు 93శాతం మంది వద్ద ఆధార్‌ కార్డులు ఉన్నట్లే. ‘ఆధార్‌ ప్రాజెక్టు అరుదైన మైలురాయిని సాధించింది. ఇప్పుడు 125కోట్ల మంది భారతీయులు ఆధార్‌ నంబరు కలిగి ఉన్నారు. అంతేగాక, ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది’ అని ఉడాయ్‌ పేర్కొంది.
9. ఎయిర్‌టెల్‌ ₹558 ప్లాన్‌లో భారీ కోత
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది. తన రూ.558 ప్లాన్‌లో భారీ మార్పు చేసింది. ఈ ప్లాన్‌పై ఇస్తున్న గడువును దాదాపు 26 రోజులు తగ్గించింది. మిగిలిన వాటిని యథాతథంగా ఉంచింది. ఇటీవల ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన నెల రోజులు తిరగక ముందే ప్లాన్‌లో భారీ కోత విధించడం గమనార్హం. ఎయిర్‌టెల్‌ రూ.558 ప్లాన్‌ కింద అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ లభిస్తున్నాయి. రోజుకు 3జీబీ డేటా, 100 ఎమ్మెస్‌లు చొప్పున లభిస్తాయి. అయితే 82 రోజులుగా ఉన్న కాలపరిమితిని తాజాగా 56 రోజులకు ఎయిర్‌టెల్‌ తగ్గించింది.
10. ఆర్టీసీలో సంచార బయోటాయిలెట్లు ప్రారంభం
ఉద్యోగులకు టాయ్‌లెట్స్‌, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటుచేయాలని ప్రగతిభవన్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన టాయిలెట్లు ఏర్పాటయ్యాయి.ఉద్యోగులకు ఛేంజ్‌ ఓవర్‌ పాయింట్‌లలో సంచార బయో టాయిలెట్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా పాత బస్సుల్లో టాయిలెట్లను ఏర్పాటుచేశారు.నగరంలో తొమ్మిది చేంజ్‌ ఓవర్‌ పాయింట్లలో మొదట వీటిని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన వనభోజనాల సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వీటిని ప్రారంభించారు.