WorldWonders

ఠీక్ హై…ముషారఫ్ మరణశిక్ష కొట్టేస్తున్నాం

Musharraf Death Sentence Cancelled-Pakistan Judicial System

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను లాహోర్‌ హైకోర్టు కొట్టేసింది. ముషారఫ్‌ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్‌ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను లాహోర్‌ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ముషారఫ్‌పై నమోదు చేసిన దేశద్రోహం కేసు చట్టనిబంధనల ప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ముషారఫ్‌కు ఎటువంటి శిక్ష లేదని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.2007లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్‌ పాకిస్థాన్‌లో అత్యయిక స్థితిని ప్రకటించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్భందం విధించారు. అనేక మంది న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో2013 డిసెంబరులో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆరేళ్ల పాటు విచారణ కొనసాగింది. డిసెంబరు 17న ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష విధించడం పాకిస్థాన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.