Agriculture

పాలలో వెన్న శాతం ఎలా పెంచాలి?

Telugu agriculture and cattle news-How to increase fat content of milk

పాలలో వెన్న శాతానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. వెన్న శాతం ఆధారంగానే పాల ధరను నిర్ణయిస్తారు. పశువులు అసౌకర్యానికి, అనార్యోగానికి గురైతే పాల ఉత్పత్తితో పాటు వెన్నశాతం కూడా తగ్గుతుంది. పాడి పశువులకు మేత తక్కువైనప్పుడు, అధిక ఎండలు, చలి తీవ్రత ఉన్నప్పుడు పాలలో వెన్నశాతం తగ్గుతుంది. వెన్నశాతం.. గేదె పాలలో 6-8 శాతం, దేశవాళీ ఆవు పాలలో 4-4.5 శాతం, సంకరజాతి ఆవుల్లో 3-4 శాతం వరకు ఉంటుంది. పాలలో వెన్నశాతం తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశుసంవర్థకశాఖ కడప పశువైద్యాధికారి డాక్టర్‌ జి.రాంబాబు సూచించారు.
*జన్యు కారణాలు: పాలలో వెన్నశాతం.. పాడి పశువుల జన్యు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పశువుల జాతి ఆధారంగా వెన్నశాతంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ముర్రా, జాఫరాబాది జాతి గేదెల పాలలో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. దేశవాళీ ఆవులైన సాహివాల్‌, గిర్‌, థియోని, ఒంగోలు జాతి పశువుల్లో పాల దిగుబడి తక్కువున్నా, సంకరజాతి పశువులతో పోల్చితే.. వెన్నశాతం అధికంగా ఉంటుంది. సంకరజాతి పశువుల్లో పాల ఉత్పత్తి ఎక్కువున్నా, వెన్నశాతం తక్కువగా ఉంటుంది. జన్యుపరమైన మార్పులే ఇందుకు కారణం. పశువుల జాతి, వయస్సు, పాల దిగుబడి, మేత లభ్యత, పాలిచ్చే కాలం (పాడికాలం), వాతావరణం, గృహవసతి.. వంటివి వెన్నశాతాన్ని ప్రభావితం చేస్తాయి.
*పాలలో వెన్నశాతం పెంచే చర్యలు!
వాతావరణ ప్రభావం: ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు పాలలో వెన్నశాతాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల కొట్టాల్లో అధిక వేడి లేదా అధిక చలి ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలి. వేసవిలో ముఖ్యంగా సాయంత్రం పూట పిండే పాలలో వెన్నశాతం తక్కువగా ఉంటుంది. వ్యాయామం కోసం పశువులను 3-4 కిలోమీటర్లు తిప్పితే పాలలో వెన్నశాతం పెరుగుతుంది. ఇంతకుమించి పశువులు అధికంగా నడిచినప్పుడు వెన్నశాతం తగ్గుతుంది.
*పాలలో వెన్నశాతం పెంచే చర్యలు!
*అందించాల్సిన మేపు
* పాలిచ్చే పశువులకు రోజుకు 30-40 కిలోల పచ్చిమేత ఇవ్వాలి. ఇందులో 10-15 కిలోల పప్పుజాతి గ్రాసం ఉండాలి.
* జొన్న, సజ్జ, మొక్కజొన్న చొప్ప లేనప్పుడు.. 6-8 కిలోల ఎండుగడ్డిని మేతగా వాడితే పాలలో వెన్నశాతం తగ్గకుండా ఉంటుంది.
* బర్సీమ్‌, లూసర్న్‌, అలసంద, పిల్లిపెసర, జనుము, స్టైలో వంటి ధాన్యపుజాతి గ్రాసాలను కలిపి మేపితే వెన్నశాతం పెరుగుతుంది.
* సుబాబుల్‌, అవిశ, హెడ్జిలూసర్న్‌ వంటి చెట్ల ఆకులను మేతగా ఇవ్వొచ్చు.
* గ్రాసాలను పూత దశలో కోసి మేపితే వెన్నశాతం పెరుగుతుంది. చిన్న ముక్కలుగా కత్తిరించి మేపితే.. అందులో ఉండే పీచు పదార్థం త్వరగా జీర్ణమై పాలలో వెన్నశాతం పెరుగుతుంది.
* దాణా మిశ్రమంలో పత్తిగింజలు, కొబ్బరి, సోయాచిక్కుడు గింజలు, పొద్దుతిరుగుడు, వేరుసెనగ చెక్క వంటివి కలిపి పెడితే వెన్నశాతం పెరుగుతుంది.
* పంట అవశేషాలతోపాటు, ధాన్యపు గింజలు, పత్తి గింజల చెక్కలు, వేరుసెనగ చెక్కలను కలిపి సంపూర్ణ సమీకృత ఆహారం తయారు చేసి అందించడం ద్వారా దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు. తద్వారా పోషకాలు పూర్తి స్థాయిలో అంది, వెన్నశాతం బాగుంటుంది. వేసవిలో గ్రాసాల కొరత ఉన్నప్పుడు సమీకృత దాణాను తయారు చేసుకోవడం మంచిది.
*మాగుడు గడ్డి మేలు
వర్షాకాలం, శీతాకాలంలో పశుగ్రాసాల లభ్యత ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో.. అదనంగా ఉండే గడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించి మాగుడు గడ్డిగా తయారు చేసి నిల్వ చేయాలి. కరవు పరిస్థితుల్లో ఇది మేతగా ఉపయోగపడుతుంది. దీంతో పాల ఉత్పత్తితో పాటు వెన్నశాతం తగ్గకుండా చూడొచ్చు.
*దాణా
పాడి పశువులకు దాణాలో గోధుమ, వరి తవుడు కలిపి, తడిపి పెడితే పాలలో వెన్నశాతం పెరుగుతుంది. పాల ఉత్పత్తి, వెన్నశాతం, శరీర బరువు ఆధారంగా పశువులకు దాణా అందించాలి. దాణా మిశ్రమంలో మొలాసిస్‌ 10 శాతం వరకు కలపవచ్చు. ఎక్కువగా కలిపితే వెన్నశాతం తగ్గుతుంది. దాణాకు ప్రత్యామ్నాయంగా అజొల్లాను ఇవ్వొచ్చు. దీన్ని చౌకగా పెంచుకోవచ్చు. అజొల్లాను రోజుకు 1-1.5 కిలోలు అందిస్తే.. తేలికగా జీర్ణమై పశువు ఆరోగ్యంగా ఉంటుంది. అజొల్లా వాడకంతో 25 శాతం వరకు దాణా ఖర్చు తగ్గుతుంది. వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం పెరుగుతుంది.
*పీచు ప్రాధాన్యం
పాలిచ్చే పశువులకు ఇచ్చే మేతలో 20-25 శాతం పీచు పదార్థం ఉండాలి. లేత పచ్చిగడ్డిలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చిమేతతో పాటు ఎండుగడ్డిని మేతగా వేస్తే వెన్నశాతం పెరుగుతుంది.
*ఇతర కారణాలు
పొదుగులోని చివరి ధారల్లో, పశువు ఒట్టిపోయే ముందు ఇచ్చే పాలలోనూ వెన్నశాతం ఎక్కువగానే ఉంటుంది. పాలను 4-5 నిముషాల వ్యవధిలోనే పిండాలి. పశువులు ఎదలో ఉన్నప్పుడు పాల ఉత్పత్తితో పాటు వెన్నశాతం తగ్గుతుంది. పశువుల వయస్సు పెరిగే కొద్దీ పాలలో వెన్నశాతం తగ్గుతుంది. ఈత చివరలో పాల ఉత్పత్తి తగ్గి, వెన్నశాతం పెరుగుతుంది. దాణా, గ్రాసాలను రోజుకు 3-4 విడతలుగా మేపాలి. పశువులను భయాందోళనలకు గురిచేసినా, పాలు పిండే వ్యక్తి మారినా.. వెన్నశాతం తగ్గుతుంది.