DailyDose

నష్టాల్లో టైటాన్ స్టాక్-వాణిజ్యం

Telugu Business News Roundup-Titan Stock In Deep Loss

* జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి తన వాహన శ్రేణి (క్యూ- ఫ్యామిలీ)లో ఆడి క్యూ8 ఎస్‌యూవీ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ క్రీడాకారుడు, టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దీనిని ఆవిష్కరించారు. దీని ధర రూ. 1.33 కోట్లు (ఎక్స్‌ షోరూం)గా ఉంది. ఈ మోడల్ డిజైన్‌, భద్రతాపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనిలో భాగంగానే ఎనిమిది ఎయిర్‌ బ్యాగ్స్‌, ఆడి పార్క్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలైజేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. 3.0 లీటర్‌ టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్‌ ఇంజిన్‌, 500 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ వద్ద 340 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 5.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే విధంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు. ట్రాన్స్‌మిషన్‌ డ్యూటీస్‌ను 8-స్పీడ్‌ టిప్‌ట్రోనిక్‌ లివర్ ద్వారా నిర్వహిస్తారు.

* దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.58గంటల సమయంలో సెన్సెక్స్‌ 183 పాయింట్లు కోల్పోయి 41,769 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 12,302 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.75 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిల్లో నమోదవుతున్న సూచీలు.. నేడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండడంతో నెమ్మదించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపినట్లు కనబడుతోంది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో కొన్ని రోజులుగా లాభాల్లో దూసుకెళ్లిన ఆసియా మార్కెట్లు నేడు స్థిరీకరణ దిశగా సాగుతుండడం కూడా మార్కెట్ల సెంటిమెంటును ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. టైటాన్‌ కంపెనీ, హీరో మోటార్‌కార్ప్‌, కొటక్ మహీంద్రా, బజాజ్‌ ఫినాన్స్‌, సన్‌ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో నమోదవుతుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యస్ బ్యాంక్‌, విప్రో, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

* కూరగాయలు, ఇతర నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో గత నెల టోకు ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. నవంబరులో 0.58శాతంగా ఉన్న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబరులో 2.59శాతానికి చేరింది. రిటైల్‌ ద్రవ్యోల్బణంలో గణనీయ పెరుగుదల, ఆహార పదార్థాల ధరలు మిన్నంటడంతో టోకు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో నవంబరులో 11శాతంగా ఉన్న ఆహార పదార్థాల ధరల పెరుగుదల రేటు 13.12శాతానికి చేరింది. ఇక ఆహారేతర పదార్థాల ధరల పెరుగుదల రేటు దాదాపు నాలుగింతలు పెరిగి 7.72శాతం పెరిగింది. ఇక కూరగాయల ధరలు 69.69శాతం పెరగడం గమనార్హం. ఇందులో అత్యధికంగా ఉల్లి 455.83శాతం, బంగాళాదుంప 44.97శాతం పెరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి.

* భారత్‌ జీడీపీ వృద్ధిరేటు ఇప్పటికే 5శాతం కంటే తక్కువకు చేరింది.. దీనికి తోడు ఇప్పటికే ఉల్లిపాయల ధరలు పెరిగి ప్రభుత్వానికి, ప్రజలకు కన్నీరు పెట్టించాయి. మరోపక్క దాదాపు ఆరునెలల నుంచి క్రమంగా పెరుగుతున్న చమురు ధరలు కూడా తోడవుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. వసూళ్లు క్రమంగా తగ్గిపోయాయి. గత నెల కొంత మెరుగ్గా ఉన్నా.. అంతకుముందు నెలల్లో భారీగానే తగ్గుముఖం పట్టింది. ద్రవ్యలోటును కట్టడి చేయడానికి ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం కూడా అనుకున్నంత ముందుకు సాగలేదు. దీంతో ఎయిర్‌ఇండియా మరింతగా అప్పుల సుడిలో చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ద్రవ్యలోటు మరింత పెరిగే ప్రమాదం ఉంది.