WorldWonders

అమరావతి అసెంబ్లీకి రెండో దారి నిర్మాణం

New road being constructed for amaravathi assembly

అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం చెరువు నుంచి శాసనసభకు రావడానికి వీలుగా రోడ్డును(జడ్‌ రోడ్డు) గతంలో ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రారంభోత్సవ సమయంలో ఎమ్మెల్యేలు, ఇతరులు రావటానికి వీలుగా దీన్ని నిర్మించారు. ఆ తర్వాత నుంచి దీన్ని వినియోగించడం లేదు. పైపులైన్లు ఏర్పాటు చేయడం కోసం పెద్ద గుంతలు తవ్వారు. ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదు. కొన్ని రోజులుగా వాటిని పూడ్చి వాహనాల రాకపోకలకు వీలుగా మరమ్మతులు చేస్తున్నారు. రాజధాని తరలింపు ప్రకటన తర్వాత ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మందడం, వెలగపూడి ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికపై సోమవారం కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 20న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగనుంది. సమావేశాలకు హాజరు కావడానికి సీఎం, మంత్రులు, అధికారులు సీడ్‌యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం మీదుగా ప్రస్తుతం అసెంబ్లీకి వస్తున్నారు. ఉద్యమం నేపథ్యంలో ఇదే దారిలో వస్తే నిరసన ప్రదర్శనలతో రాకపోకలను అడ్డుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాసనసభకు వచ్చే కృష్ణాయపాలెం చెరువు దగ్గర నుంచి అసెంబ్లీకి వచ్చే రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు.