Kids

పిల్లలూ…ఇది ఇసుక తుఫాను కథ

The story of sand storms for kids-Telugu kids information

ప్రాంతం: దేశ రాజధాని దిల్లీ…
తేదీ: ఈ నెల తొమ్మిది…
పట్టపగలు ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్మేశాయి…
భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు…
ఇంకా ఇసుక తుపాను కలిసి రాజధానిపై దాడి చేశాయి….
దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది…
ఇసుక తుపాను వల్ల విమాన సర్వీసులూ నిలిచిపోయాయి…
ఇదంతా సరే అసలు ఈ ఇసుక తుపాన్లేంటీ?
ఎందుకొస్తాయి? ఎప్పుడొస్తాయి? తెలుసుకుందామా తుపాను కన్నా వేగంగా!
అసలు ఇసుక తుపాను అంటే?
వేడి గాలులు దూరంగా ఉన్న ఇసుక తిన్నెలపైకి వీస్తూ ఇసుక రేణువులను పైకి తీసుకెళ్లి వాటిని దూర దూర ప్రాంతాలకు రవాణా చేస్తాయి. ఇవే ఇసుక తుపానులు.

ఇంతకీ ఇవి ఎలా ఏర్పడతాయి?
ఉష్ణమండల ప్రదేశాల్లో వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ. ఈ సమయంలో వాతావరణంలో అస్థిరత ఏర్పడి ‘క్యుములోనింబస్‌’ మేఘాలు ఏర్పడతాయి. అప్పుడు మేఘాల దగ్గర్నించి గాలులు వేగంగా వీస్తూ నేలను ఢీకొంటాయి. ఆ ప్రాంతంలోని ఇసుక రేణువులను పైకితీసుకుపోతాయి. ఇసుక రేణువులు నేల నుంచి రెండు, మూడు కిలోమీటర్ల ఎత్తుకు వెళతాయి. అక్కడ ఒక గోడలా ఏర్పడి మేఘాలతో వెళ్లి ఇసుక తుపాను వస్తుంది.

ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్న దగ్గర వస్తాయో?
ఇసుక తుపానులు రావడానికి వాతావరణ పరిస్థితులతో పాటు భూమి భౌతిక స్థితి కూడా కారణం. భూమి ఉపరితలం మీదున్న చెట్లు, వేడి వంటి వాటిపై గాలుల వేగం ఆధారపడి ఉంటుంది. భూమిపై వీచే గాలుల వేగం ఒక హద్దు దాటిందంటే అది ఇసుక తుపానుగా మారిపోతుంది.

ఈ ఇసుక తుపానులు ఎక్కడైనా రావచ్చా? వర్షాకాలంలోనూ వస్తాయా?
ఎక్కువ తేమ, వృక్ష సంపద ఉన్న ప్రదేశాల్లో వీచే గాలికి రాపిడి కలుగుతుంది. అందువల్ల గాలి వేగం తగ్గిపోతుంది. వర్షపాతం కూడా అధికంగా ఉంటే నేల మీద మట్టి రేణువులు, లేదా ఇసుక రేణువులు పైకి ఎగరడానికి విడిగా వీలుగా ఉండవు. అందువల్ల ఇటువంటి ప్రాంతాల్లో ఇసుక తుపానులు వచ్చే అవకాశం చాలా తక్కువ. మన దక్షిణ భారత దేశంలో ఇటువంటివి అరుదు. సాధారణంగా రావు.

ప్రభావం ఎంతసేపు?
ఇసుక తుపాను చురుకుదనం ఒకటి రెండు గంటలుండి తగ్గిపోవచ్చని అనుకోవడానికి లేదు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి దీని ప్రభావం ఉంటుంది. కాకపోతే తీవ్రత తగ్గుతుందంతే.

వీటి వల్ల వచ్చే నష్టాలేంటి?
బలమైన గాలులు నిరంతరం ఇసుకను భారీగా రవాణా చేయడం వల్ల పేరుకుపోయిన ఇసుక తిన్నెలు తయారవుతాయి. ఇవి రోడ్లు, ఇళ్లు, పంట పొలాలు, రైలు పట్టాలు, పంట కాల్వలను పూడ్చి వేస్తాయి. పంట
పొలాల్లోని మట్టిని ఇసుక తుపానులు హరించేస్తాయి. అందువల్ల పంట పొలాలకు, వ్యవసాయ క్షేత్రాలకు విపరీతమైన నష్టం.

ఇసుక తుపాన్లు ఇప్పుడే ఎక్కువగా వస్తున్నాయా?
అప్పట్లోనూ వచ్చేవి. అయితే అడవులన్నీ తగ్గిపోవడంతో ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. చెట్లు పెంచడం, నేల స్వభావంలో మార్పు తెచ్చే చర్యలు తీసుకోవడం వల్ల ఇసుక తుపానులను కొంతవరకు నివారించవచ్చు.

మన దేశంలో ఏఏ ప్రాంతాల్లో ఇసుక తుపాన్లు వస్తూ ఉంటాయి?
థార్‌ ఎడారి, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో ఎక్కువగా వస్తాయి.

ప్రపంచంలో వేరే ఎక్కడైనా వస్తాయా?
సహారా ఎడారి, చైనా, మంగోలియా, అమెరికా అరిజోనా ఎడారుల్లో, న్యూమెక్సికో, టెక్సాస్‌ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఇసుక తుపాన్లు వస్తూ ఉంటాయి.

ఇసుక తుపానులకూ పేర్లుంటాయా?
ఇసుక తుపానులను మన దేశంలో అయితే ‘అంథీ’ లేదా ‘లూ’ అని అంటారు. ఇరాన్‌లో ‘సిస్థాన్‌’ సుడాన్‌లో ‘హబూబ్‌’ మెక్సికోలో ‘తోలినేరావ్‌’, మొరాకోలో ‘సహేవ్‌’ సౌదీ అరేబియాలో ‘బేలట్‌’ అంటూ పిలిచేస్తారు.