WorldWonders

నిర్భయ గ్యాంగ్‌ను ఉరితీసే యముడు ఇతడే

Nirbhaya Talari Pawan Reaches Tihar Jail To Do The Final Great Thing

నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుకు కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో శిక్షను అమలుపరచేందుకు తలారీ పవన్‌ జల్లాద్ తీహాడ్‌ జైలుకు చేరుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. జైలు ప్రాంగణంలో ఆయన కోసం ప్రత్యేక గది, వసతి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడో తరానికి చెందిన తలారి పవన్‌ జల్లాద్ జైలు ప్రాంగణంలోనే ఉండి ఉరితాడు సామర్థ్యంతోపాటు ఇతర విషయాలను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు. శుక్రవారంనాడు పవన్‌ డమ్మీ ఉరిని నిర్వహించనున్నారు. నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు పరిచేందుకు మీరట్ చెందిన తలారి పవన్‌ జల్లాద్‌ సేవలను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు జైలు అధికారులు అభ్యర్థించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల ముందు నిర్భయ దోషులకు ఉరి వేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందుకోసం బక్సర్ నుంచి తాళ్లను తెప్పించినట్లు సమాచారం. కారాగార ప్రాంగంణంలోని మూడో నంబర్‌ జైలులో నిర్భయ దోషులు నలుగురిని ఏకకాలంలో ఉరి తీయనున్నారు. అయితే తమకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా ఆపేందుకు నిర్భయ దోషులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిర్భయ దోషి అక్షయ్‌కుమార్‌ వేసుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దానితో పాటు ఫిబ్రవరి 1న అమలు కానున్న ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా అతడు వేసిన మరో పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరో నిందితుడు వినయ్‌ శర్మ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.