Devotional

వారములు వాటి వ్రతఫలితములు

Weekdays And Their Vrathams-Telugu Devotional News Feb 2020

1. వారములు-వ్రత ఫలితాలు. – ఆద్యాత్మిక వార్తలు – 04/02
వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్కో దేవతకూ ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో, వ్రతం ఏదో ముందుతరాలవారు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం! రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులభం.
1.ఆదివారవ్రతం:
చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారంనాడు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగ ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారంనాడు ఆరంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలూ ఆచరించాలి. అలా ఆచరించలేనివారు కనీసం 12 వారాలైనా చేయాలి.
**వ్రతవిధానం:
ఆదివారంనాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగాజలాన్ని, లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.
2.సోమవార వ్రతం:
అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.
**వ్రతవిధానం:
చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ‘ఓం నమశ్శివాయ’అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పూవులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరాన్ని ధరించాలి. పూజాసమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతోపాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి.
3.మంగళవారం:
ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారవ్రతం ఆచరించాలి.
**వ్రతవిధానం:
ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, రుణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి.
4.బుధవారవ్రతం:
స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.
**వ్రతవిధానం:
ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజచేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.
5.గురువారవ్రతం:
మానసికప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యాఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.
**వ్రతవిధానం:
ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్లపాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు, ఒక పూట తప్పనిసరిగాఉపవాసం ఉండి, స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి.
6.శుక్రవార వ్రతం:
దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.
**వ్రతవిధానం:
ఈ పూజను శ్రావణమాసం లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.
7.శనివారవ్రతం:
వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.
**వ్రతవిధానం:
శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారంనాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అంటే ఈ క్రింది నెంబర్ కు ఫోన్ చేయండి. మీ జాతకమును క్షుణ్ణంగా పరిశీలించి తగిన పరిహారాలు తెలియజేయబడును
2.శారదాపీఠంలో ఏపీ సీఎం ప్రత్యేక పూజల
విశాఖలోని శారదాపీఠాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం సందర్శించి రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఇటీవలే నిర్మించిన స్వయంజ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్ర వ్యాఖ్యానంతో ముద్రించిన ‘తత్త్వమసి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక స్వరూపానందేంద్రతో ఏకాంతంగా సమావేశమయ్యారు
3.ఫిబ్రవరి 9న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో ఈ నెల 9వ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి గరుడసేవ నిర్వహిస్తున్నట్టు తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఆ రోజు రాత్రి ఏడు నుంచి 9 గంటల వరకు సర్వాలంకారుడైన మలయప్పస్వామి గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపింది. అదేవిధంగా దివ్యప్రబంధ మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దివ్యప్రబంధ పారాయణ మహోత్సవంలో 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారని, ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి పారాయణదారులను ఆహ్వానించినట్టు పేర్కొన్నది. ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థాన మండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం ఉంటుందని, పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొని సందేశమిస్తారని పేర్కొన్నారు.
**శ్రీవారి కానుకల్లో వాచీల ఈ-వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఈ-వేలం నిర్వహిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. స్వామివారికి కానుకలుగా వచ్చిన క్యాషియో, టైమెక్స్, అల్విన్, టైమ్స్, సొనాటా, టిస్సాట్, ఫాస్ట్ట్రాక్ తదితర కంపెనీల వాచీలు ఉన్నాయని తెలిపింది. కొత్త వాటితోపాటు ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కూడా ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయంలో 0877-2264429 నంబర్లోగానీ, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.inలోగానీ సంప్రదించాలని టీటీడీ సూచించింది.
4. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి తితిదే అధికారులు స్వాగతం పలికారు.
శ్రీవారి సేవలో మంత్రి పేర్ని నాని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా, కుమార్తె దీపా వెంకట్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు
5. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగివస్తుండగా తన తండ్రి రైలు నుంచి పడిపోయాడని, వారం రోజులైనా ఆచూకీ లేదని, తక్షణమే తన తండ్రి ఆచూకీ తెలుసుకోవాలని అంబాజీపేట తాహసిల్దార్ కు కుమారుడు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే అంబాజీపేట పెద్ద వీధిలోని శ్యామల నగర్ లో నివాసం ఉంటున్న వి.బదరీనారాయణ, భార్య వర్ధని, కుమారుడు శ్యామ్ తో కలిసి గత నెల 22న తిరుపతి వెళ్లి, 26వ తేదీన తిరిగి వస్తున్నారు. అయితే ట్రైన్ తిరుపతి దాటిన తర్వాత నారాయణ ప్రమాదవశాత్తు పడిపోయాడని ఆ దృశ్యాన్ని చూసిన తక్షణమే సమాచారాన్ని ట్రైన్ టి.సి కి, తెలిపామని, తన తండ్రి కోసం వెతికామని, అయితే ఆచూకీ లభ్యం కాలేదని బదరీ నారాయణ కుమారుడు శ్యామ్ తెలిపాడు. అనంతరం గూడూరు స్టేషన్ లో తన తల్లి తో కలిసి దిగిపోయి, 27వ తేదీన మరోసారి వెతికినా ఫలితం లేకపోయిందని,గూడూరు రైల్వే స్టేషన్ లో తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఇదే విషయాన్ని శ్యామ్, తహసీల్దార్ ఎల్.జోసెఫ్ కు చెప్పి కన్నీటి పర్యంతం కావడంతో తహసీల్దార్ జోసెఫ్ స్పందించి ప్రభుత్వ పరంగా ఆచూకీ తెలుసుకొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
6. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుడిని నిన్న 59,015 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,389 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
7. శుభోదయం
మహనీయుని మాట
బయట కనిపించే మురికి
గుంతల కన్నా
మనసులో మాలిన్యం ఉన్న
వ్యక్తులతో చాలా ప్రమాదం
– సర్వేపల్లి రాధాకృష్ణన్ !
నేటి మంచిమాట
బాగుండటం అంటే……
బాగా ఆస్తి ఉండటమో లేక
బాగా సంపాదించే ఉద్యోగం
ఉండటమో కాదు..
నవ్వుతూ ఉండటం
నలుగురితో ఉండటం
8. నేటి ఆణిముత్యం
జలముల నగ్ని ఛత్రమునఁ జండమయూఖుని దండతాడనం
బుల వృషగర్దభంబులను బొల్పగుమత్తకరీంద్రమున్ సృణిం
జెలఁ గెడురోగ మౌషధముచే విషముందగుమంత్ర యుక్తి ని
మ్ములఁదగఁజక్కఁజేయనగు మూర్ఖునిమూర్ఖత మాన్పవచ్చునే.
భావము:
నిప్పుకు నీరు; ఎండకు గొడుగు; మదించినఏనుగుకు అంకుశము; ఎద్దు, గాడిదలకు కర్ర; ప్రబలిన వ్యాధులకు మందులు; విషవిరుగుడుకు (పాము.తేలు మొ.వి) మంత్రములు నివారకములుగా ఉపయోగించి వాటిని అదుపు చేయవచ్చు. కాని, మూర్ఖుని మూర్ఖత్వాన్ని మాన్పవచ్చునా? దీనికి మటుకు ఏ మందు లేదా సాధనము లేదు.
9. నేటి సామెత
పొద్దెప్పుడు కుంకుతుందా ముద్ద ఎప్పుడు మింగుతానా అన్నట్టు
పనిదొంగలు,
తిండిపోతుల వ్యవహార శైలి.
వారి గురించి ఈ సామెత పుట్టింది.
10. నేటి సుభాషితం
నైపుణ్యం….. ఒక నిరంతర సాధనా ఫలితం, అది అకస్మాత్తుగా వచ్చేది కాదు
నేటి జాతీ
గుటకలు మింగు తున్నాడు
ఏదో చెప్పడానికొచ్చి సందేహిస్తున్నాడు:
ఉదా: ఏరా గుటకలు మింగు తున్నావు. ధైర్యంగా చెప్పు.
11. చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 4
బిర్జూ మహరాజ్
1509 : శ్రీ కృష్ణదేవ రాయలు విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు.
1891 : స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు మాడభూషి అనంతశయనం అయ్యంగారు జననం (మ.1978).
1911 : ప్రముఖ కవి, పండితుడు వేదుల సూర్యనారాయణ శర్మ జననం (మ.1999).
1936 : సుప్రసిద్ధ హిందీ నటీమణి వహీదా రెహమాన్ జననం.
1938 : భారతీయ కథక్ నాట్య కళాకారుడు బిర్జూ మహరాజ్ జననం.
1943 : భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం జననం.
1962 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు డాక్టర్ రాజశేఖర్ జననం.
1974: భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ మరణం (జ.1894).
14. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
ఈరోజు మంగళవారం,
04.02.2020
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 15C°-27C°
నిన్న 59,015 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 01 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
నిన్న 19,389 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.65 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,ఫిబ్రవరి విశేషం
• ఫిబ్ర‌వ‌రి 9న పౌర్ణ‌మి
గ‌రుడ సేవ‌, శ్రీ‌ రామ‌కృష్ణ‌
తీర్థ ముక్కోటి.
• ఫిబ్రవరి 21న గోగ‌ర్భ
తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి
మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free#18004254141
12. సర్వేజనాః సుఖినోభవంతు.
శుభోదయం
మహనీయుల మాట
సంతోషం అనేది నారింజపండ్ల రసం లాంటిది.అది ఈ రోజే తాగితే రుచిగా,తీయగా వుంటుంది. రేపటి కోసం వుంచుకుంటే కొంచెం చేదుగా మారుతుంది. రేపటి ఆందోళనల కోసం నేటి సంతోషాన్ని వాయిదా వేయవద్దు.
నేటి మంచి మాట
మనసంతా మంచితో నిండితే..ఎంత పెద్ద తప్పులైనా
పొరపాట్లయినా చిన్నవిగా కనిపిస్తాయి..!!
బలహీనమైన బంధాలైనా శాశ్వతమవుతాయి..!!
మనసంతా ద్వేషం నింపుకుంటే
ఎంత చిన్న తప్పయినా పొరపాటైనా
అతి పెద్దగా కనిపిస్తుంది..!!
అత్యంత బలమైన బంధమైనా దూరమవుతుంది..!!
13. పంచాంగం
శ్రీరస్తు, శుభమస్తు, ఆవిఘ్నమస్తు,
తేదీ … 4 – 02 – 2020,
వారం … భౌమ్యవాసరే 【 మంగళవారం 】
శ్రీ వికారి నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
శిశిరఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
తిధి : దశమి సా5.51
తదుపరి ఏకాదశి,
నక్షత్రం : రోహిణి రా10.29
తదుపరి మృగశిర,
యోగం : ఐంద్రం రా2.27
తదుపరి వైధృతి,
కరణం : గరజి సా5.51
తదుపరి వణిజ తె5.52
ఆ తదుపరి భద్ర/విష్ఠి,
వర్జ్యం : ఉ2.07 – 3.48 &
తె4.13 – 5.51,
దుర్ముహూర్తం : ఉ8.50 – 9.35 &
రా10.57 – 11.48,
అమృతకాలం : రా7.08 – 8.49,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండం. : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.35,
సూర్యాస్తమయం : 5.54,
14. నేటిమాట
మానవ జన్మకు సార్థకథ ఏమిటి
భగవంతుడు నిత్యమూ మనతో ఉంటున్నాడు. ఆయన లేని కాలము గానీ ప్రాంతము గానీ లేనే లేదు…
అన్ని కాలాల యందునూ అన్ని ప్రాంతాల యందునూ ఉంటున్నాడు… సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు అగు పరమేశ్వరుణ్ణి కేవలం కొన్ని దినములకు, కొన్ని ప్రాంతములకు మాత్రమే పరిమితం చేయడం తప్పు… ఇది సరియైన భక్తి అనిపించుకోదు కూడా,…కంటిలో ప్రాణమున్నంత వరకూ భగవంతుని యందు భక్తి విశ్వాసాలు దృఢము చేసుకోవాలి… ఒంటిలో శక్తి ఉన్నంత వరకూ నిస్వార్థంగా సేవలు చేస్తూనే ఉండాలి, అపుడే మానవ జన్మకు సార్థకత…
15. ఆధ్యాత్మికం
ఈ జగత్తు ఎక్కడిది? ఎవరు సృష్టించారు? ఎందుకోసం? శాశ్వతమైన భగవంతుడే అశాశ్వతమైన సృష్టిని సృష్టించాడని భారతీయ వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. మరి, జీవులు ఎక్కడివి? మానవులుగా మన పాత్ర ఎలాంటిది? ఇందులోని మర్మం తెలుసుకొందాం!‘ఈ ’ ప్రశ్న తరచుగా జిజ్ఞాసువులలో కలుగుతుంది. పరమేశ్వరుడు ‘సృష్టి స్థితి లయ’లకు కారణం. కనుక, ‘అతని కోసమే సృష్టి రచన జరిగిందని’ వాదించే వారు కొందరున్నారు. కానీ, స్వాధ్యాయశీలురైన పండితులు ‘ఈ సృష్టిని జీవుల కోసమే పరమేశ్వరుడు సృష్టించాడని’ పూర్తిగా నమ్ముతారు.ఈ సృష్టిలో మూడు పదార్థాలు స్పష్టంగా గోచరిస్తాయి. మొదటిది: పరమేశ్వర తత్తం. రెండవది: జీవ తత్తం. మూడవది: ప్రకృతి తత్తం. సృష్టికంటే ముందు సూక్ష్మరూపంలో ఉన్న జీవులు సూక్ష్మమైన ప్రకృతిని ఆశ్రయించే ఉంటారు. ఈ స్థితినే ‘ప్రళయం’ అని పిలుస్తాం. ప్రళయంలోను పరమేశ్వరుడు స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఒక విధంగా జీవులు, ప్రకృతి పరమేశ్వరునిలో అవిభక్తమై ఉంటాయి. ప్రళయకాలాన్నే మన పెద్దలు శూన్యంగా భావిస్తారు. కానీ, పరమేశ్వరునితోపాటు జీవులు, ప్రకృతి ఉనికిగల పదార్థాలు. వాటి ఉనికికి ఎప్పుడూ భంగం ఉండదు.పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. చైతన్య స్వరూపుడు. చైతన్యం అంటే ‘జ్ఞానం’. ‘జ్ఞానం’ కలవాడు ఎప్పుడూ మిన్నకుండడు. అంటే, ఊరికే ఉండడని అర్థం. ఎల్లవేళలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. పరమేశ్వరుడు కూడా అంతే. అతనికి సృష్టి రచన చేయడానికి కరచరణాదుల అవసరం లేదు. తాను సర్వవ్యాపకుడు కనుక అశరీరుడు, అచలుడు కూడా. తాను కదలక, సృష్టిలో ప్రతి పదార్థాన్నీ కదిలేలాగా చేస్తాడు. ఇదే ఆయన తత్తం. ఇంతకూ ‘పరమేశ్వరుడు సృష్టిని ఎవరి కోసం రచించినట్లు?’ అంటే, కొందరు అనుకొంటున్నట్లు ‘తన కోసం ఎంత మాత్రం కాదు’. మరి, ఎవరి కోసం? జీవులకోసం అన్నదే దీనికి సరైన సమాధానం.ప్రకృతి జడం. అది పరిణామశీలం కలిగింది. అందువల్లనే పాంచభౌతికమైన జడప్రపంచం ఏర్పడుతుంది. ప్రపంచం ఉద్భవించడానికి ముఖ్యకారణం ప్రకృతి. ఈ ప్రకృతిని ‘ఉపాదాన కారణం’ అంటారు. ఏ కారణం లేకుంటే కార్యం పుట్టదో, దానికే ‘ఉపాదాన కారణమని’ పేరు. ప్రకృతికి, ప్రపంచానికి ‘కార్యకారణ సంబంధముంది’. మరి, ‘స్వయంగా ప్రకృతి పరిణామం చెందగలదా?’ అంటే ‘అది జడం (జ్ఞానం లేనిది) కనుక, దానికా శక్తి లేదు’. అందుకే, సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు తన జ్ఞానంతోనే జడప్రకృతిని ప్రపంచంగా పరిణమింపజేస్తాడు. జీవులు జ్ఞానం కలిగినవి మాత్రమే కాదు, కర్మలు చేయడంలో ఉత్సాహం కలిగినట్టివి కూడా.జీవులు కర్మలు (పనులు) చేసినప్పుడు వాటి ఫలాలు అనుభవించక తప్పదు. మరి, అవి చేసే ధర్మాధర్మాలకు అనుగుణంగా సుఖదు:ఖాలను ఎవరివ్వాలి? ప్రకృతా జడం. దానికి జీవుల ప్రవృత్తులెట్లా తెలుస్తాయి? అది అసాధ్యం. ఒక్క సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మాత్రమే జీవులు చేసే పుణ్యపాప కర్మలను గురించి తెలుసుకోగలిగినవాడు. అందువల్లే జీవులు అనుభవించే సుఖదు:ఖాలకు అనుగుణంగా సృష్టి రచన చేయవలసి ఉంటుంది. పరమేశ్వరుడు సృష్టి రచన చేయడంలో సర్వస్వతంత్రుడు, ఆనంద స్వరూపుడు. అతడు జీవులకు సుఖదు:ఖాలు కలిగించేవాడు మాత్రమే. కానీ, తాను వాటిని అనుభవించలేడు. కర్మలు చేయడంలో జీవులు స్వతంత్రులు, కర్మఫలాలను అనుభవించడంలో మాత్రం అస్వతంత్రులు.పరమేశ్వరుడు ‘తాను అనుభవించేది లేదు కనుక, సృష్టి రచన తన కోసం చేసుకోడు’. కర్మలు చేస్తూ, సుఖదు: ఖాలను అనుభవించే అర్హత కలిగినవి జీవులే కనుక వాటికోసమే సృష్టి రచన చేస్తున్నాడు. పరమేశ్వరుడు కేవలం సృష్టి చేసి ఊరుకోడు. ప్రపంచాన్ని అన్ని విధాలుగా రచించి ప్రాణికోటిని జీవింపజేస్తాడు. దీన్నే ‘స్థితి’ అంటాం. సృష్టించి, పోషించి అంతటితోనూ ఊరుకోడు. ప్రళయం కూడా చేసి, జీవులకు విశ్రాంతిని ఇస్తాడు. జీవులకు సృష్టి జాగ్రదవస్థ లాంటిది. స్థితి స్వప్నం లాంటిది. ప్రళయం నిద్ర లాంటిది. అయితే, అన్ని కాలాలలోను జీవులుంటాయి. పరమేశ్వరుని వలె జీవులుకూడా శాశ్వతమైనవే. అయితే, ‘శాశ్వతుడైన పరమేశ్వరుడు శాశ్వతులైన జీవుల కోసం సృష్టించిన ప్రపంచం అశాశ్వతమైంది’ అన్న విషయం మాత్రం మరవరాదు.పరమేశ్వరుడు పూర్వసృష్టులలో వలెనే ఈ సృష్టిలోను సూర్యచంద్రాదులనే కాదు, సమస్త పదార్థాలనూ సృష్టించినట్లు వేదం ప్రబోధిస్తున్నది. ‘సూర్యాచంద్రమసౌధాతా యథాపూర్వమ/ కల్పయత్‌ దివంచ పృథివీంచ అంత/ రిక్షమ థోస్వ:’ (ఋగ్వేదం 10-190-3). ఎప్పుడైతే ఈ ప్రపంచం ప్రాణికోటి సుఖదు:ఖాలకు అనుగుణంగా సృష్టింపబడిందో అప్పుడే ప్రాణులు ఆచరించే కర్మలు కూడా నిత్యమైనవనే అభిప్రాయం ధ్రువపడుతుంది. జీవుల కర్మలకు అనుగుణమైన రీతిలో సృష్టి రచన చేసే పరమేశ్వరుడు ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి మహిమోపేతుడో మనం ఎంతమ్రాతం ఊహంచలేం.జీవులకు సృష్టి జాగ్రదవస్థ లాంటిది. స్థితి స్వప్నం లాంటిది. ప్రళయం నిద్ర లాంటిది. అన్ని కాలాలలోను జీవులుంటాయి. పరమేశ్వరుని వలె జీవులుకూడా శాశ్వతమైనవే. శాశ్వతుడైన పరమేశ్వరుడు శాశ్వతులైన జీవులకోసం సృష్టించిన ప్రపంచం మాత్రం అశాశ్వతం.
**సర్వాధీశుడే న్యాయాధీశుడు!
వేదాంత దర్శనం పరమేశ్వరుడు ‘తన ప్రయోజనం కోసం కాక, జీవుల ప్రయోజనం కోసమే’ ఈ సృష్టి రచన చేసినట్లు స్పష్టపరుస్తున్నది. ‘న ప్రయోజన వత్వాత్‌’ (2-1-32). అంటే, లోకంలో రాజులు, ధనవంతులు తమకు ప్రయోజనం లేకున్నప్పటికీ మానవాళి వినోదార్థం నృత్యగాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అలాగే, ఆనంద స్వరూపుడైన పరమేశ్వరుడు జీవుల ప్రయోజనం కోసమే జగత్తును నిర్మించినట్లు వ్యాసభగవానుడు వేదాంత దర్శనంలో చెప్పిన మాటలు (లోకవత్తు లీలా కైవల్యం) తప్పనిసరిగా గమనించాలి. విషమం, విచిత్రం అయిన ఈ జగత్తును పరమేశ్వరుడు తన ఇష్ట ప్రకారం కాక ప్రాణుల కర్మఫలాలకు తగినట్లుగానే నిర్మించి, ఇచ్చాడు. అందువల్లే అతడు సర్వాధీశుడే కాదు, న్యాయాధీశుడని కూడా మనం అర్థం చేసుకోవాలి.
16. రాశిఫలం – 04/02/2020
తిథి:
శుద్ధ దశమి సా.5.43, కలియుగం-5121 , శాలివాహన శకం-1941
నక్షత్రం:
రోహిణి రా.10.25
వర్జ్యం:
మ.2.03 నుండి 3.43వరకు, తిరిగి రా.తె. 4.09 నుండి 5.47 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.1048నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి వుంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషిచేస్తారు. స్ర్తిలు, బంధు, మిత్రులను కలుస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) మిక్కిలి ధైర్య సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అకాల భోజనంవల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
17. మంగళవారం, 4 ఫిబ్రవరి 2020
శ్రీ అంగారక స్తుతి
||ధరణీ గర్భసంభూతం|
||విద్యుత్కాంతి సమప్రభమ్ కుమారం శక్తి హస్తం|
|తం మంగళం ప్రణామామ్యహమ్|
తిథి: దశమి 21:49
నక్షత్రము: రోహిణి 01:49+
మాసము: మాఘము (శుక్లపక్షం)
శాలివాహన శకం 1941
వికారి నామ సంవత్సరం (శిశిర రుతువు))
ఉత్తరాయణం
యోగము: ఐంద్ర 05:13+
కరణము: తైతుల 09:40 గరజి 21:49 పణజి 09:46+
సూర్య రాశి:
image.gif
మకరరాశి
చంద్ర రాశి:
image.gif
వృషభరాశి
అమృతకాలము: 22:28 – 00:08+
అభిజిత్ ముహూర్తము: 12:03 – 12:49
బ్రహ్మ ముహూర్తము: 05:06 – 05:54
దుర్ముహూర్తము: 09:00 – 09:45, 23:10 – 00:00
వర్జ్యము: 17:29 – 19:09
గుళిక: 12:26 – 13:52
రాహుకాలము: 15:18 – 16:43
యమగండము: 09:34 – 11:00
6:42 am – 6:09 pm
చంద్రోదయం: 04-02-2020 (13:35)
చంద్రాస్తమయం: 05-02-2020 (02:43)
18. 5న నెమలి ఆలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు
గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 5వ తేదీన భీష్మ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్‌ నేల సంధ్య తెలిపారు. గుడిలో ఏకాహ దీక్ష హరినామ సంకీర్తన, అష్టకలశ స్నాపన, అఖండ దీపారాధన నిర్వహిస్తారు. యాగశాలలో 11 గంటలకు వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహానికి లక్ష తులసీ పూజ, రాజ్యలక్ష్మి అమ్మవారికి శత సహస్ర కుంకుమార్చన, తదుపరి దశాంశ క్షీరతర్పణ, శతాంశ వేణుగోపాల మహామంత్ర హోమం, పూర్ణాహుతి, దర్బారుసేవ, ఆశీర్వచనం, పండిత సత్కారం నిర్వహిస్తారని చెప్పారు.