DailyDose

మీకు లోన్ ఇవ్వకపోతే నాకు చెప్పండి-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Nirmala Assures On Banks And Loans

* బ్యాంకులు కారణం లేకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) రుణాలను మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఓ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్ని గురించి ఆమె ట్రేడర్లకు వివరించారు. ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకులు ఎలాంటి కారణం లేకుండా రుణం మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇందుకోసం ఫిర్యాదుల స్వీకరణకు ఓ ప్రత్యేక కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఫిర్యాదు చేసినప్పుడు సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు సైతం ఓ కాపీని పంపాలన్నారు. ఆర్థిక మూలాలు బాగున్నందునే విదేశీ మారక నిల్వలు అధిక స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

* అసత్య ప్రచారాలతో వ్యాపార ప్రకటనలు చేసే వారిపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. చర్మ సౌందర్యం, లైంగిక సామర్థ్యం పెంపు, సంతానోత్పత్తి వంటి వాటి కోసం ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులను మభ్యపెట్టాలని చూసే వ్యాపార సంస్థలకు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షలు వరకు జరిమానా విధించే విధంగా చట్టంలో మార్పులు చేయనుంది. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ డ్రగ్స్‌, మ్యాజిక్‌ రెమిడీస్‌ (అభ్యంతరకర ప్రకటనల చట్టం 1954)కు ముసాయిదా సవరణను ప్రతిపాదించింది. ఇందు కోసం ముసాయిదా చట్టంలో ఉన్న వ్యాధులు, రుగ్మతల జాబితాలో పలు మార్పులు చేసింది. దాని ప్రకారం 78 రకాల వ్యాధులు, రుగ్మతలకు సంబంధించిన ప్రకటనలపై కూడా నిషేధం విధించింది.

* దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని ఆర్‌బీఐ నివేదిక ఒకటి చెబుతోంది. జనవరిలో ప్రస్తుత పరిస్థితుల సూచీ (సీఎస్‌ఐ) 83.7కి చేరిందని తెలిపింది. 2015 మార్చి తర్వాత ఈ సూచీ కనిష్ఠానికి చేరడం గమనార్హం. పరపతి విధాన సమీక్ష సందర్భంగా గురువారం ‘వినియోగదారుల విశ్వాస సూచీ’ని ఆర్‌బీఐ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరలు, సొంత ఆదాయం, ఖర్చు వంటి వాటిపై సుమారు 13 నగరాల్లో 5,389 గృహ వినియోగదారుల నుంచి ఆర్‌బీఐ అభిప్రాయాలు స్వీకరించింది.

* చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మనదేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. వివిధ పర్రిశమలను కలవరపరుస్తోంది. ముడి ఔషధాల కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడిన ఫార్మా పరిశ్రమ మరింత భయపడుతోంది. మందుల తయారీకి అవసరమైన పలు ముడి పదార్ధాలను ఇక్కడి ఫార్మా కంపెనీలు చైనా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. వీటిని ఇక్కడి ఫార్మా కంపెనీలు తుది వినియోగానికి అనువైన ట్యాబ్లెట్లు, కేప్సుల్స్‌గా తయారు చేస్తున్నాయి. దాదాపు దేశీయ అవసరాల్లో 60-80 శాతం వరకూ చైనా నుంచి వస్తున్నవే. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఫార్మా కంపెనీలు సుమారు రూ.17,000 కోట్ల విలువైన బల్క్‌, ఏపీఐ ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ఇక్కడి ఫార్మా కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. అక్కడి నుంచి మన అవసరాలకు తగ్గట్లుగా ముడి ఔషధాలు రావటం లేదు.

* రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ 3 చైనా బ్యాంకులకు 6 వారాల్లోగా 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.700 కోట్లు) చెల్లించాల్సిందేనని బ్రిటన్‌కోర్టు తీర్పు ఇచ్చింది. రుణ ఒప్పందం కింద అనిల్‌ నుంచి 680 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4800 కోట్ల) రికవరీ చేయాలని కోరుతూ చైనా బ్యాంకులు వేసిన దావాను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంబానీ నికరవిలువ సున్నాగా మారిందన్న ఆయన తరఫు న్యాయవాదుల వాదనను కోర్టు అంగీకరించలేదు. ఆయన కుటుంబం కూడా ఆదుకునే పరిస్థితి లేదనడాన్ని న్యాయమూర్తి డేవిడ్‌ వాక్స్‌మన్‌ తిరస్కరించారు. ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని రిలయన్స్‌ గ్రూప్‌ తెలిపింది. ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (ముంబయి శాఖ), చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎగ్జిమ్‌బ్యాంక్‌ ఆఫ్‌ చైనాలు అనిల్‌పై దావా వేశాయి. 2012 ఫిబ్రవరిలో తీసుకున్న 925 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6750 కోట్ల) రుణానికి సంబంధించి వ్యక్తిగత పూచీకత్తును పాటించలేదనే దానిపై ఈ దావా దాఖలైంది. అలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని అంబానీ ఖండించారు.