DailyDose

రెహ్మాన్….₹13కోట్ల పన్ను బకాయిలు కట్టు-వాణిజ్యం

Oscar Winner AR Rahman Gets Tax Notices From Govt

* ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బకాయి వెంటనే చెల్లించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. రెహమాన్‌ చెల్లించాల్సిన పన్ను రూ.6.79కోట్లు, జరిమానా మరో రూ.6.79కోట్లతో సహా చెల్లించాల్సిందిగా జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌ శాఖలు ఆదేశాలు జారీ చేశాయి. రెహమాన్‌ తన ఆర్జనకు తగినట్టుగా పన్ను చెల్లించడం లేదని జీఎస్టీ కమిషనర్‌ (చెన్నై సౌత్‌) కేఎం రవిచంద్రన్‌ అన్నారు. ‘‘చలన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చటంతో పాటు దేశ విదేశాల్లో బహిరంగ ప్రదర్శనలతో, రాయల్టీల ద్వారా కూడా ఆయన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆదాయ మార్గాలన్నీ వస్తుసేవల పన్ను పరిధిలోకి వస్తాయి. కానీ, ఈ సంగీత దర్శకుడు వాటికి పన్ను చెల్లించలేదు’’ అని రవిచంద్రన్‌ వివరించారు. ‘రెహమాన్‌ తన ట్యూన్లకు యజమాని అనే మాట నిజమే కాకుంటే.. నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సంగీతానికి సంబంధించి అన్ని హక్కులు నిర్మాతలకే చెందుతాయి.. అందువల్ల అవి సేవాపన్ను పరిధిలోకి వెళ్లవు’ అని రెహమాన్‌ తరపు న్యాయవాది వివరించారు. కాగా, ఆదేశాల అమలును మార్చి నాలుగోతేదీ వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని రెహమాన్‌ మద్రాస్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.

* దేశీయంగా తయారీని పెంచడం, విదేశీ దిగుమతులను తగ్గించుకోవడంలో భాగంగా అవసరంలేని వస్తువుల జాబితాలో ఉన్న టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు సంబంధిత ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సంబంధిత దిగుమతిదారు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నుంచి లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. 2018-19 మధ్య కాలంలో సుమారు ఒక బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన టీవీ ఉత్పత్తులు దేశంలోకి దిగుమతయ్యాయి. భారత్‌కు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తొలి స్థానంలో ఉండగా.. వియత్నాం, మలేసియా, హాంకాంగ్‌, కొరియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌, జర్మనీ దేశాలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. దేశీయంగా తయారీని పెంచడంలో భాగంగా ఫర్నీచర్‌ దిగుమతులపైనా ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిఫైన్డ్‌ పామాయిల్‌ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

* కరోనా భయాలను అధిగమించి రెండు రోజుల పాటు లాభాల్లో పయనించిన మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి. గురువారం ఉదయం 9.55గంటల సమయంలో సెన్సెక్స్ 87 పాయింట్లు నష్టపోయి 41,478 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు దిగజారి 12,171 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.18 వద్ద కొనసాగుతోంది. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం దాదాపు ఆరేళ్ల గరిష్ఠానికి చేరడం, డిసెంబరు పారిశ్రామికోత్పత్తి వృద్ధి క్షీణించడం వంటి వార్తలు మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ ఫలితాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. యస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టైటాన్‌ కంపెనీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌ కంపెనీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

* నాట్కో ఫార్మా అక్టోబరు- డిసెంబరులో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.513 కోట్ల ఆదాయాన్ని, రూ.104.40 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2018-19 ఇదేకాలంలో ఆదాయం రూ.580 కోట్లు, నికరలాభం రూ.159.30 కోట్లు ఉన్నాయి. హెపటైటిస్‌-సీ ఔషధ విభాగానికి అనుగుణంగా లాభాలు తగ్గాయని కంపెనీ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి కంపెనీ ఆదాయం రూ.1,545 కోట్లు కాగా, లాభం రూ. 364.90కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌పై రూ.3.50 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.