DailyDose

నేను గీత దాటలేదు-వాణిజ్యం

Nirmala Seetaraman Says She Did Her Duty-Telugu Business News Roundup Today

* ఎలాంటి మినహాయింపులు లేని కొత్త పన్ను విధానంలో వల్ల దేశంలో సేవింగ్స్‌పై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే సేవింగ్స్‌ చేయడం తగ్గుతోందని వారు పేర్కొంటున్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో రెండు రకాల పన్ను విధానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మునుపు ఉన్న పన్ను విధానంతో పాటు ఎలాంటి మినహాయింపులూ లేని తక్కువ పన్ను శాతం కలిగిన రెండో విధానాన్ని తీసుకొచ్చారు. అయితే, ఇది ఐచ్ఛికమని కేంద్రం పేర్కొంది.

* బాధ్యతలను, నిర్వహణ వంటి కీలక అంశాలను దృష్టిలోపెట్టుకొనే బడ్జెట్‌ తయారు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బీఎం(ఫైనాన్షియల్‌ రెస్పాన్స్‌బిలిటీస్‌, బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలను దృష్టిలోపెట్టుకొనే దీనిని తయారు చేశామన్నారు. తనను అత్యధిక సేపు బడ్జెట్‌ చదవిన ఆర్థిక మంత్రిగా కంటే అత్యధిక కాలం బడ్జెట్‌ను ప్రిపేర్‌ చేసిన ఆర్థిక మంత్రిగా గుర్తుంచుకోవాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఎక్కడా తాము దాటలేదన్నారు. ‘‘ఆర్థిక క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకొన్నాము. మీకు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మోదీ నేతృత్వంలో వచ్చిన బడ్జెట్లలో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. ఇదే అతి సుదీర్ఘమైన బడ్జెట్‌ స్పీచ్‌ అని చాలా మంది నాతో చెప్పారు. కాకపోతే ఈ బడ్జెట్‌ గత జులై నుంచి ఇప్పుడు ఫిబ్రవరి వరకు కసరత్తు చేశాము. సుదీర్ఘకాలం కసరత్తు చేసిన బడ్జెట్‌గా గుర్తుంచుకోవాలి’’ అని సీతారామన్‌ తెలిపారు.

* కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడనుంది. ఈ ప్రభావం వచ్చే 15రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యూచర్‌ ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఫీచర్‌ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని మెగ్‌అజ్‌ మొబైల్స్‌ సంస్థ సీఈవో నిఖిల్‌ చోప్రా తెలిపారు. ఈ పెంపు 10శాతం వరకు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక స్మార్ట్‌ ఫోన్ల ధరలు 6-7శాతం పెరిగే అవకాశం ఉంది. మరో 15-20 రోజుల్లోపే ఈ ఎఫెక్ట్‌ ఉండనుంది. ఇక ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లపై ప్రభావం మాత్రం నామమాత్రమే. ఎందుకంటే భారత్‌లో వీటి మార్కెట్‌ వాటా చాలా తక్కువగా ఉండటమే కారణం.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వ్యూహాన్ని మార్చుకొంది. సెడాన్‌లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీల పైనుంచి దృష్టిని చిన్న కార్లపైకి మళ్లించింది. చిన్నకార్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. జనవరిలో మారుతీ మొత్తం 1,79,103 కార్లను ఉత్పత్తి చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2.1శాతం తక్కువ. కాకపోతే మారుతీ చిన్నకార్ల ఉత్పత్తిని పెంచి.. సెడాన్లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తిని తగ్గించింది. చిన్న కార్ల సెగ్మెంట్‌లో ఆల్టో, ఎస్‌ప్రెస్సోల వాటా దాదాపు 25.10శాతంగా ఉంది. అంటే 34,288 కార్లను ఈ జనవరిలో తయారు చేసింది.. గతేడాది ఇదే సీజన్‌లో వీటి సంఖ్య 27,408గా ఉంది. ఇక కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్లోకి వచ్చే డిజైర్‌, స్విఫ్ట్‌, బాలినో, కొత్త వేగనార్‌ వంటి వాటి ఉత్పత్తి కూడా 6.31శాతం పెరిగింది.