Editorials

పాకిస్థాన్‌కు 8నెలల గడువు

Pakistan Gets 8 Months To Prevent Black Listed

పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) చివరి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతానికి ‘గ్రే లిస్ట్‌’లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్‌లో జరగబోయే సమీక్ష సమావేశం కల్లా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే ‘బ్లాక్‌ లిస్ట్‌’లో చేర్చడం తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రముఠాలకు నిధుల సరఫరాను కట్టడి చేసేందుకు కొత్తగా మరో 8 అంశాలతో కూడిన లక్ష్యాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ముందుంచింది. టర్కీ మినహా ఎఫ్‌ఏటీఎఫ్‌ సభ్యదేశాలన్నీ పాక్‌ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాక్‌ను ‘గ్రే లిస్ట్‌’లో కొనసాగిస్తూ ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి. నిధుల కట్టడి దిశగా కఠిన చర్యలు తీసుకునేందుకు పాక్‌కు గత అక్టోబర్‌లోనే అవకాశం కల్పించింది. కంటితుడుపు చర్యలతో సరిపెట్టాలని చూసిన దాయాది దేశ దుర్బుద్ధిని పసిగట్టిన ఎఫ్‌ఏటీఎఫ్‌ ‘గ్రే లిస్ట్‌’ నుంచి తప్పించకుండా గట్టి హెచ్చరికే జారీ చేసింది. గత అక్టోబర్‌ 2018లో ఎఫ్‌ఏటీఎఫ్ తొలిసారి పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది‌. 15 నెలల సమయం ఇచ్చినప్పటికీ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో దాయాది విఫలమైంది. దీంతో మరోసారి ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమైన నేపథ్యంలో బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే ‘బ్లాక్‌ లిస్ట్‌’లో ఉన్నాయి. తాజాగా నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ఇమ్రాన్‌ ప్రభుత్వం ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. పారిస్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ సదస్సు ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 11ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాక్‌ కోర్టు తీర్పు వెలువరించింది. మరికొంత మందిని కూడా అరెస్టు చేసింది. అయితే ఇవన్నీ కంటితుడుపు చర్యలేనని భారత్‌ కొట్టిపారేస్తూ వచ్చింది. ‘బ్లాక్‌ లిస్ట్‌’ ముప్పు తప్పించుకోవడానికే పాక్‌ ఇలాంటి తాత్కాలిక చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. తాజాగా పాక్‌ చర్యలను పరిగణనలోకి తీసుకోని ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయంతో భారత్‌ వాదనకు బలం చేకూరినట్లైంది.