DailyDose

పడిపోయిన మారుతీ విక్రయాలు-వాణిజ్యం

Maruti Sales Collapse In February 2020-Telugu Business News Roundup Today

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ విక్రయాలు ఫిబ్రవరి నెలలో కూడా తగ్గాయి. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే దేశీయ విక్రయాలు తగ్గి 1,34,150కు చేరాయి. గత సీజన్‌లో 1,39,100 కార్లను విక్రయించింది. మరోపక్క ఎగుమతులు మాత్రం 7.1శాతం పెరిగాయి. గతేడాది 9,582 కార్లను విక్రయించగా.. ఈ సారి 10,261 కార్లను అమ్మింది. అదే సమయంలో 2,699 గ్లాన్జా కార్లను కూడా ఎగుమతి చేసింది. మొత్తం విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది 1,48,682 కార్లను విక్రయించగా.. ఈ సారి 1,47,110 కార్లను విక్రయించింది.

* నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థపై ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) చేసిన దాడుల్లో లెక్కలు చూపని రూ.400 కోట్ల నల్ల ధనం వెలుగు చూసింది. దేశ వ్యాప్తంగా అనేక శాఖలున్న ఈ వ్యాపార సంస్థ ఫెర్రస్‌, సీసం, రాగి, అల్యూమినియం విడి భాగాలను సరఫరా చేస్తోంది. దాదాపు రూ. వెయ్యి కోట్ల టర్నోవర్‌ కలిగిన ఈ సంస్థ రూ. 400 కోట్లకు పైగా అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సదరు సంస్థ కార్యాలయం నుంచి రూ. కోటి నగదుతో పాటు లావాదేవీలకు సంబంధించిన ఇతర దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

* వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఫిబ్రవరి నెలకు గానూ రూ.1.05 లక్షల కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 8 శాతం పెరగ్గా.. గత నెలతో పోలిస్తే వసూళ్లు  తగ్గడం గమనార్హం. జనవరి నెలలో రూ.1.10 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఫిబ్రవరి నెలకు గానూ జీఎస్టీ కింద మొత్తం రూ.1,05,366 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ.20,569 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.27,348 కోట్లు, ఐజీఎస్టీ 48,503 కోట్లుతో పాటు సెస్సుల రూపంలో రూ.8,947 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

* ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ కాప్‌జెమినీ ఈ ఏడాది భారత్‌లో 30వేల మందిని కొత్తగా నియమించుకోనుంది. ఇప్పటి ఈ సంస్థలో దాదాపు 1.15లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సరికొత్త నియామకాలతో తమ సంస్థ విలువ మరింత పెరుగుతందని చెబుతోంది. ఈ నియామకాల్లో అనుభవం ఉన్న వారితోపాటు ఫ్రెషర్లు కూడా ఉండనున్నారని కంపెనీ చెబుతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అశ్విన్‌ యార్డి పీటీఐకు వెల్లడించారు. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగం మంది భారతీయులే కావడం విశేషం. ‘‘ మా వ్యాపారంలో భారత్‌ అత్యంత కీలకమైన భాగస్వామి. మేము 25,000-30,000 మంది ఉద్యోగులను నియమించుకొంటాము. ’’ అని అశ్విన్‌ వెల్లడించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం దిశగా మళ్లుతున్నాయి. తాజా పరిస్థితులను చూస్తూంటే ఈ పతనం ఇప్పట్లో ఆగేలా లేదు. ఎందుకంటే ఈ పతనం మొత్తానికి మూలకారణం కరోనా వైరస్‌(కోవిడ్‌-19). కరోనా వైరస్‌ విజృంభణ నెమ్మదిస్తేనే మార్కెట్‌ పుంజుకొనే అవకాశం ఉంటుంది. మరోపక్క అమెరికా మార్కెట్లలో కూడా భారీగా కరెక్షన్‌ జరుగుతోంది. డోజోన్స్‌ దాదాపు 12.4శతం పతనమైంది. ఇక ఎస్‌అండ్‌పీ 500 సూచీ 500 పాయింట్లు పతనం కాగా.. నాస్‌డాక్‌ సూచీ 10.5 శాతం కుంగింది. అమెరికా మార్కెట్లలో ఈ స్థాయి విక్రయాల ఒత్తిడి ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపిస్తుంది. అమెరికాలో చాలా కంపెనీల షేర్ల ఇప్పటికే రికార్డు స్థాయి అత్యల్పాలకు చేరుకొన్నాయి. ముఖ్యంగా చైనా, ఇతర కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనే సప్లై ఛైన్‌ దెబ్బతినడం ఉత్పాదక రంగంపై ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు చాలా దేశాలు ఇతర దేశస్తులపై ఆంక్షలు విధించడం వంటి వాటితో పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోంది. ఇప్పటికే కరోనా ప్రపంచ అంటువ్యాధిగా ప్రకటించే స్థాయికి చేరుకొందని చాలా పరిశోధనా సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలో జాప్యం జరుగుతోంది. ఒక వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన వెలువడితే మార్కెట్ల పరిస్థితి మరికొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది.