DailyDose

రిజర్వేషన్లకు అడ్డంపడింది తెలుగుదేశమే-తాజావార్తలు

Botsa Blames TDP Over Election Reservations-Telugu Breaking News Roundup Today

* రాష్ట్రంలో కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కరపత్రాన్ని విడుదల చేసింది. కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించింది. ప్రజలంతా వాటిని పాటించి వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది. జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలని కరపత్రంలో ప్రభుత్వం పేర్కొంది.

* అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. మందడంలో డ్రోన్‌ కెమెరాతో పోలీసులు చిత్రీకరించారనే ఆందోళనలో అరెస్టయి గుంటూరు జైల్లో ఉన్న రైతులను ఆయన పరామర్శించారు. రైతుల పక్షమని కాలర్‌ ఎగరేసే వైకాపా ప్రభుత్వం.. 2,500 మంది అమరావతి రైతులపై కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* గుంటూరులో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. సీఏఏపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరిగిన తర్వాతే చట్టం చేశారని గుర్తుచేశారు. ఓ వర్గానికి నష్టం జరుగుతుందంటూ ఎంఐఎం, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని.. తద్వారా లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు.

* నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు విషయంలో పటియాలా హౌస్‌ కోర్టు మరోసారి స్టే విధించడంపై బాధితురాలి తల్లి ఘాటుగా స్పందించారు. ఉరిశిక్ష అమలు ప్రక్రియ పదేపదే వాయిదా వేయడం.. మన వ్యవస్థ వైఫల్యాన్ని చూపిస్తోందని అన్నారు. నిర్భయ దోషులకు రేపు విధించాల్సిన ఉరిశిక్షపై పటియాలా హౌస్‌ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. న్యాయస్థానం తాను ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఎందుకింత సమయం తీసుకుంటోందన్నారు.

* ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌కార్డులను వినియోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది. గడువు తేదీలోపు పాన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానించని వినియోగదారులపై ఆదాయపుపన్ను చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు తప్పవని తెలిపింది.

* రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలిందని, అది ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 59 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దీన్ని తెదేపా అడ్డుకుందని ఆరోపించారు.

* నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను పరిశీలించి పనుల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో నిర్మిస్తున్న ఫైఓవర్‌, దుర్గం చెరువు వంతెన పనులను పరిశీలించి కాంట్రాక్టు ఏజెన్సీలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన సుందరీకరణ పనులను ఇప్పటి నుంచే ప్రారంభించాలని మంత్రి సూచించారు.

* ఇటలీ నుంచి జైపూర్‌కు వచ్చిన ప్రయాణికుడికి సోమవారం కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిందని రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అతడి రక్త నమూనాలను మరోసారి పరీక్షించేందుకు పుణెలోని ఎన్‌ఐవీకి పంపినట్లు తెలిపారు. రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి జైపూర్‌ వచ్చిన ప్రయాణికుడిని స్క్రీనింగ్ నిర్వహించగా కరోనా లక్షణాలున్నట్లు తేలింది.’ అని తెలిపారు.

* రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీ వీడింది. సంఘటన జరిగిన 21 రోజులకు పోలీసులు నిందితుడ్ని గుర్తించారు. ఆమె తండ్రే హత్య చేసినట్లు నిర్ధరించారు. కరీంనగర్‌లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ముత్త రాధిక ఫిబ్రవరి 10న ఇంట్లో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె ఖర్చులు భరించలేక ఆమె తండ్రే దిండుతో నొక్కి చంపి గొంతు కోసినట్లు తెలిపారు.