Food

భాగ్యనగరి ఆకలి తీర్చే “మొబైల్ అన్నపూర్ణ”

Telangana Govt Begins Mobile Annapurna For Feeding Poor People

ప్రభుత్వ అధికారులు కొత్త ఆలోచనలతో మరిన్ని వినూత్న పథకాలు తీసుకురావాలని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆకాంక్షిచారు. పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ప్రస్తుత సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ రూపొందించిన అన్నపూర్ణ పథకం ద్వారా ఇప్పటి వరకు 150 ప్రాంతాల్లో 4కోట్ల మందికి ఆహారాన్ని అందించినట్లు తలసాని వివరించారు. అన్నపూర్ణ పథకం ప్రవేశపెట్టి రూ.5కే భోజనం పథకం ప్రారంభించి నేటికి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా అమీర్‌పేటలో ఆరేళ్ల వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఇతర మెట్రో నగరాల కన్నా హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కొరకు ప్రయోగాత్మకంగా ‘మొబైల్‌ అన్నపూర్ణ’ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రూ.5కే భోజనం పథకాన్ని ‘హరేకృష్ణ మూమెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌’ సహకారంతో తొలిసారిగా నాంపల్లిలో ప్రారంభించినట్లు గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్‌ సైతం సిరిసిల్లలో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. ఇప్పుడు 150 కేంద్రాల్లో ప్రజలకు అన్నపూర్ణ భోజనం అందించడం సంతోషంగా ఉందన్నారు. అన్నపూర్ణ మంచి పథకమని.. ఈ కేంద్రాలకు వచ్చిన వారికి నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. అన్నపూర్ణ సెంటర్‌కు వచ్చి భోజనం చేయలేని వారికి ‘మొబైల్‌ అన్నపూర్ణ’ కింద ఆటోల ద్వారా ఇంటి వద్దకే భోజనాన్ని తీసుకెళ్లేలా ఆలోచన చేసినట్లు మేయర్‌ వివరించారు.