DailyDose

TVS విక్రయాలు కూడా పడిపోయాయి-వాణిజ్యం

TVS Sales Drop Drastically-Telugu Business News Roundup Today

* ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌కార్డులను వినియోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది. గడువు తేదీలోపు పాన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానించని వినియోగదారులపై ఆదాయపుపన్ను చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు తప్పవని తెలిపింది.

* ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ విక్రయాలు ఫిబ్రవరి నెలలో 15 శాతం తగ్గాయని సంస్థ ప్రకటించింది. దీనికి కరోనా ప్రభావం ఒకటి కాగా, మరొకటి బీఎస్‌-4 యూనిట్ల ఉత్పత్తిని తగ్గించడం కూడా ఓ కారణమని తెలిపింది. గత నెలలో మొత్తం 2,99,353 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. ప్రణాళిక ప్రకారం డీలర్‌ స్థాయిలో బీఎస్-4 యూనిట్లను తగ్గిస్తూ వచ్చామని కంపెనీ ప్రకటించింది. మిగిలిన వాహనాల్ని కూడా ఈ నెలలోపు విక్రయిస్తామని ధీమా వ్యక్తం చేసింది. మరోవైపు కొవిడ్‌-19 వల్ల విడిభాగాల తయారీపై ప్రభావం పడిందని తెలిపింది. కరోనా వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామంది. తమ ద్విచక్ర వాహనాలు గత ఏడాది ఫిబ్రవరిలో 2,85,611 యూనిట్లు అమ్ముడుపోగా.. 2020, ఫిబ్రవరిలో 2,35,891కి పడిపోయాయని కంపెనీ వెల్లడించింది. అంటే 17.4శాతం తగ్గుదల నమోదైనట్లు పేర్కొంది. ఇక దేశీయంగా ద్విచక్రవాహనాల విక్రయాలు 26.72శాతం పడిపోయినట్లు పేర్కొన్నారు. మోటార్‌ సైకిళ్లు 3.29శాతం, స్కూటర్లు 30.25శాతం తగ్గినట్లు తెలిపింది. అయితే త్రీవీలర్‌ విక్రయాలు మాత్రం 25 శాతం పెరగడం గమనార్హం. అలాగే ఎగుమతులు సైతం 25శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.

* విమాన ప్రయాణికులకు శుభవార్త! ఇకపై ఎగరుతున్న విమానాల్లో కూడా వైఫై ద్వారా ఇంటర్నెట్‌ సేవల్ని వినియోగించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు ఇంటర్నెట్‌ సేవల్ని ప్రయాణికులకు అందించేలా విమానయాన సంస్థలకు అనుమతినిస్తూ పౌరవిమానయాన శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘‘విమానం ఎగురుతున్న సమయంలో ఇంటర్నెట్‌ సేవల్ని వినిగించుకునేలా ప్రయాణికులకు పైలట్‌-ఇన్‌-కమాండ్‌ అనుమతించొచ్చు. తద్వారా వైఫై సదుపాయంతో ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, స్మార్ట్ వాచ్‌, ఈ-రీడర్‌ వంటి డివైజ్‌లను ఫ్లైట్‌ మోడ్‌ లేదా ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌లో ఉంచి ఇంటర్నెట్‌ని వాడుకోవచ్చు’’ అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఎయిర్‌క్రాఫ్ట్‌లో నిబంధనల ప్రకారం ఇంటర్నెట్‌ సేవల్ని అందించే సదుపాయాలు ఉన్నాయని డైరెక్టర్‌ జనరల్‌ ధ్రువీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

* పసిడి మార్చి కాంట్రాక్టు ఈవారం కూడా సాంకేతికంగా సానుకూలంగానే కనిపిస్తోంది. ఒకవేళరూ.41,995 కంటే ఎగువన కదలాడకుంటే రూ.40,097 స్థాయికి కాంట్రాక్టు దిగివస్తుందని భావించవచ్చు. వెండి మే కాంట్రాక్టు ఈవారం రూ.45,527 కంటే ఎగువన కదలాడకుంటే మరింత డీలాపడేందుకు అవకాశం ఉంటుంది