Health

కరీంనగర్‌లో ఏడుగురికి కొరోనా నిర్ధారణ

7 More Indonesians Identified As Corona Positive In Karimnagar

తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో మరో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఇండోనేషియాకు చెందిన ఏడుగురి నివేదికల్లో పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ నెల 14న ఇండోనేషియా వాసులు 10 మంది బృందంగా కరీంనగర్‌కు వచ్చారు. ఈ నెల 16న వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అప్పటినుంచి వీరిని ప్రభుత్వం ఐసోలేషన్‌లో వార్డులో ఉంచి చికిత్స అందిస్తోంది. వీరిలో తాజాగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌ అని నివేదికల్లో తేలినట్లు ప్రభుత్వం పేర్కొంది. కరీంనగర్‌కు వచ్చిన వీరు మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. వీరంతా మొదట ఇండోనేషియా నుంచి దిల్లీకి విమానంలో వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు రైలులో ప్రయాణం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ బృందంతో నేరుగా కలిసిన వారి వివరాలను వైద్యాఆరోగ్య శాఖ సేకరిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వ్యక్తులు కరోనా వైరస్‌ బారిన పడుతున్న దృష్ట్యా దేశంలోని విమానాశ్రయాల్లో జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశారు.