Movies

భరణిపై కౌర్ కవిత

Punam Kaur Writes Poem On Tanikella Bharani

తనికెళ్ల భరణి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనో రచయిత, నటుడు. అలాగే, ఆయనొక ఆధ్యాత్మిక సాహితీ వేత్త. శివతత్వాన్ని అవపోసన పట్టిన భక్త. తెలుగుతెర తోట రాముడు తనికెళ్ల భరణి. ‘మిథునం’లో అప్ప దాసు, బుచ్చి లక్ష్మి పాత్రలకు ప్రాణం పోసిన దర్శక సృష్టి. రచయితగా, దర్శకుడిగా విభిన్న పాత్రలకు ప్రాణం పోసిన ఆయన, నటుడిగా వచ్చిన అవకాశాలకు అంతే అందంగా జీవం పోశారు. తెరపై పాత్రలు తగ్గట్టు విలక్షణ, వైవిధ్యమైన నటన కనబర్చిన తనికెళ్ల భరణి, తెర తీసిన తర్వాత నిజజీవితంలో నటన అనే కళను అవపోసన పట్టలేకపోయారు. తనికెళ్ల భరణి ఒక మాట రాసినా, తెరపై నటుడిగా ఒక మాట చెప్పినా… గోడ కట్టినట్టు, గులాబీ మొక్కకి అంటు కట్టినట్టు పద్దతిగా ఉంటుంది. ఆయన గురించి అంతే పద్దతిగా, చక్కగా నటి పూనమ్ కౌర్ ఒక కవిత రాశారు. తనికెళ్ల భరణి జీవితంలో పూనమ్ కౌర్ పరకాయ ప్రవేశం చేసినట్టు, ఆయన ఆత్మ ఆమెను ఆవహించినట్టు…. రాశారంటే అతిశయోక్తి కాదు. పూనమ్ కౌర్ మాట్లాడూతూ “భరణి గారికి గురు గోబింద్ సింగ్ జీ అంటే ఎంతో గౌరవం. బైసాఖి సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో చాట్ నిర్వహించాను. నా తరపున ఆయనకు ఈ కవిత వినిపించా. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నట్టు నేను రాసిన కవిత” అని అన్నారు. పూనమ్ కౌర్ రాసిన కవిత:

ఔను….

నేను నటుడినే.

కానీ, నిజ జీవితంలో నటించలేకపోయాను.

ఔను …

నేను ఒక కళాకారుడినే.

కానీ, కళామతల్లి మీద

ప్రేమ, అభిమానంతో,

కళ విలువ తెలియకుండా

నా దగ్గరకి వచ్చే

ప్రతి మనిషికి నేను

నా కళని అమ్ముకోలేకపోయాను.

సాహిత్యం పట్ల ప్రేమతో,

మన భారత దేశంలో ఉన్న

సంస్కృతిని మరింతగా వికసింపచేయాలని

ఒక చిన్న ఆశ.

ఆ భావంతో,

మనసు నిండా అదే ఆలోచనతో

నేను నా ప్రతి నాటకం రాశా.

డబ్బు గురించి మాట్లాడితే

అవసరాలు కొన్ని, ఆశయాలు కొన్ని తీర్చుకున్నాను.

అమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రేమతో,

కరుణతో, మర్యాదతో వచ్చినపుడు

శిరసు వంచి అందుకున్నాను.

నా దగ్గరకి వచ్చిన మనిషి

అహంభావం చూపించినా,

నేను ప్రేమతోనే చూశాను.

కానీ,

నాలో ఉన్న కళా దైవాన్ని మాత్రం

ఏరోజూ అహంతో పంచుకోలేకపోయాను.

వెనకడుగు వేసే ప్రతి నిమిషం

కుటుంబ అవసరాలు గుర్తుకు వచ్చేవి.

కానీ నా స్వార్ధం కోసం

నేను అత్యంత గౌరవాన్ని ఇచ్చే

కళామతల్లిని నేను అమ్ముకోలేకపోయాను.

పూజ చేశాక,

మా ఆవిడ నా నుదిటిన పెట్టిన బొట్టుతో

నా పాదం బాధ్యతతో బయటకు కదిలేది.

నాకు తోడుగా ఎప్పటికీ ఉంటాను

అని మా ఆవిడ అంటే,

నీ సహాయం లేకుండా

ఈ జీవితం ఎలా గడిపేది అంటాను నేను.

పిల్లలందరిని నేను కోరుకునేది ఒకటే.

అమ్మ అనే బంధానికి ప్రేమని పంచండి.

నాన్న అనే పదంతో స్నేహం పెంచుకోండి.

ఇంతకంటే ఎక్కువ ఏమీ ఆశల్లేని

నేను…..

మీ

తనికెళ్ళ భరణి