DailyDose

రాష్ట్రపతి భవన్‌లో కరోనా కేసు-TNI కరోనా కథనాలు

రాష్ట్రపతి భవన్‌లో కరోనా కేసు-TNI కరోనా కథనాలు

* తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. చెన్నైలో ఓ తమిళ న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తున్న 25మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో పలువురు పాత్రికేయులు కూడా ఉన్నట్టు తెలిపారు. ముంబయిలో నిన్న 53మంది మీడియా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

* కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై పలు దేశాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ పుట్టుక, వ్యాప్తి విషయంలో డ్రాగన్‌ దేశం మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలినాళ్ల నాటి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరారు. ‘‘ఈ మహమ్మారి పుట్టుక విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించాలి. తద్వారా ప్రపంచం దీని నుంచి నేర్చుకునేందుకు అవకాశం ఏర్పుడుతుంది’’ అని విలేకరులతో మట్లాడుతూ మెర్కెల్‌ అన్నారు.

* నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య 8కి చేరుకున్నాయి. రెండో కేసుతో కాంటాక్ట్‌ అయిన పని మనిషికి పాజిటివ్‌గా అధికారులు గుర్తించారు. దీంతో ఖమ్మంలోని బీకే బజార్‌ను కలెక్టర్‌ ఆర్వీ కణ్ణన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఖమ్మంలో పాజిటివ్‌ కేసులన్నీ ఒకరి ద్వారానే వ్యాపించాయని కలెక్టర్ వెల్లడించారు.

* కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో నలుగురు ఢిల్లీ మతప్రార్థనలకు వెళ్లొచ్చినవారే కావడం గమనార్హం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అధికారులు 25 ప్రాంతాల్లో రెడ్‌జోన్లు ప్రకటించారు. గ్రీన్‌జోన్ ప్రాంతాల్లోనే సడలింపులు ఇచ్చారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా 1,350 మంది రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సిఫారసు చేసిన రెండు రకాల ఆల్కాహాల్‌ మిళిత క్రిమిసంహారకాలు కరోనా వైరస్‌ కట్టడిలో ప్రభావవంతంగా పనిచేస్తాయని జర్మనీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఇవి చేతులను శుభ్రం చేసుకునేందుకు బాగా ఉపయోగపడతాయని, 30 సెకన్లలోనే కొవిడ్‌-19ను నిర్వీర్యం చేయగలవని ప్రయోగ పరీక్షల్లో గుర్తించారు. ఔషధ కంపెనీలు వాటిని తయారు చేయడం కూడా చాలా సులువని శాస్త్రవేత్తలు అంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో సూచించిన మొదటి రకం ఆల్కాహాల్‌ మిళిత క్రిమిసంహారకం తయారీకి 80 వాల్యూమ్‌ పర్సెంట్‌(వీపీ) ఇథనాల్‌, 1.45 వీపీ గ్లిజరిన్‌, 0.125 వీపీ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వాడతారు. ఇక రెండో రకం దానిలో 75 పీవీ ఐసోప్రోపనోల్‌, 1.45 వీపీ గ్లిజరిన్‌, 0.125 వీపీ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ సమ్మేళనాలు ఉంటాయి.

* ఉగ్రవాదంలానే కరోనాపై కూడా కలిసి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్‌కు పిలుపునిచ్చారు. భారత్‌ ఇటీవల ఆ దేశానికి ఔషధాలు, గోదుమలు సరఫరా చేసిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ గనీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దానికి స్పందనగా మోదీ సోమవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. న్యూదిల్లీ, కాబుల్‌ మధ్య ప్రత్యేక మైత్రి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదంపై పోరాడినట్లు గుర్తుచేశారు. అదే రీతిలో కరోనాపై పోరాడదామన్నారు.

* ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి బయట పడేందుకు దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న ‘లాక్‌డౌన్‌’ కారణంగా భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది. భారతీయులు ఒక్క మార్చి నెలలోనే మున్నెన్నడు లేని విధంగా ఉపాధి కోల్పోయారని భారతీయ ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) వెల్లడించడం కూడా దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మార్చి నెలాఖరు నాటికి దేశంలో ఉద్యోగుల శాతం 38. 2 శాతానికి, నిరుద్యోగ సమస్య మున్నెన్నడు లేనివిధంగా 8.7 శాతానికి పడిపోయిందని సీఏంఐఈ వెల్లడించింది. ఏప్రిల్‌ ఆఖరు నాటికి భారత్‌లోని 50 కోట్ల మంది ప్రజలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా అవుతారని, మరో 50 కోట్ల మంది జేబుల్లో ఆర్థిక నిల్వలు సగానికి పడిపోతాయని ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’లో సామాజిక, ఆర్థిక సమానత్వంపై సీనియర్‌ ఫెల్లోషిప్‌ చేస్తోన్న ఏఈ సురేశ్‌ అంచనా వేశారు. ప్రపంచంలోని పలు దేశాల తరహాలోనే కరోనా వైరస్‌ సంక్షోభం బాధితులకు భారత ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా చేయడంతో నేరుగా నగదు చెల్లిస్తోంది.

* కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 23న బ్లాక్‌డే పాటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్వీ అశోకన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు దేశంలోని డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు. దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

* దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీ వీధుల్లో వ్యాప్తిచెందిన వైరస్‌ తాజాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌కూ పాకింది. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతనికి కూడా వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందే అతని కుటుంబంలో ఒకరు వైరస్‌ కారణంగా మృతి చెందారు.