Editorials

భారత్‌పై…నేపాల్ ప్రధాని కారుకూతలు

Nepal Prime Minister Fires On India. Claims Kalapani Is Theirs.

భారత్‌పై నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్‌ కన్నా భారత్‌లోని వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. తమ దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తికి భారత్‌ కారణమని పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నిందించారు.

భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురాలు ప్రాంతాలు నేపాల్‌కు చెందినవేనని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం అన్నారు. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ రూపొందించిన కొత్త పటాన్ని నేపాల్‌ మంత్రిమండలి ఆమోదించిన సంగతి తెలిసిందే.

‘భారత్‌ నుంచి అక్రమ మార్గాల్లో వస్తున్న వారి ద్వారానే నేపాల్లో వైరస్‌ వ్యాపిస్తోంది. సరైన పరీక్షలు చేయకుండానే అధికారులు, పార్టీ నాయకులు వారిని అనుమతిస్తున్నారు. బయట నుంచి జనాలు వస్తుండటంతో కొవిడ్‌-19ను కట్టడి చేయడం కష్టమవుతోంది. ఇటలీ, చైనాతో పోలిస్తే భారత వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఎక్కువ మందికి సోకుతోంది’ అని ఓలీ ఆరోపించారు.

దురుద్దేశపూర్వకంగానే నేపాల్‌ ప్రధాని భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఓలితో చైనా ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. వైరస్‌ కారణంగా డ్రాగన్‌ దేశం నుంచి కంపెనీలు భారత్‌కు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇలా దొంగదారిలో ఆరోపణలు చేయిస్తున్నట్టు సమాచారం. కరోనా వైరస్‌ వాస్తవంగా చైనాలోని వుహాన్‌లోనే పుట్టిన సంగతి తెలిసిందే. వైరస్‌ ఆవిర్భావంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని అన్ని దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. అందులో కొన్ని దేశాలను దారికి తెచ్చుకొనేందుకు వివాదాస్పద ప్రాంతాలపై కవ్వించడం, ఎగుమతులు, దిగుమతులను అడ్డుకోవడం వంటివి చేస్తుంది.