Movies

వాక్‌శుద్ధి కలిగిన తెలుగు స్టార్…ఎన్‌టీఆర్ జన్మదినం నేడు!

Rejoicing the legacy and movies of Jr NTR On His Birthday

‘కూచిపూడికైనా.. కుంగ్‌ఫూలకైనా… దేనికైనా రెడీ’ అంటూ ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’లో పాట పాడుకొన్నారు. ఆ పాట సినిమాలోని పాత్రకే కాదు, స్వతహాగా ఎన్టీఆర్‌కి కూడా వర్తిస్తుంది. డ్యాన్సుల్లోనైనా.. ఫైట్లలోనైనా… భావోద్వేగాలు పండించడంలోనైనా.. వినోదం పండించడానికైనా… ఇలా దేనికైనా ఎన్టీఆర్‌ రెడీనే. తాత పోలికలతో పుట్టిన ఎన్టీఆర్‌… నటన పరంగా తాతకి తగ్గ మనవడు అనిపించుకొన్నాడు. నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీసుని ప్రభావితం చేసిన ఘనత ఆయనది. తొలి అడుగుల్లోనే స్టార్‌ కథానాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత ఆటు పోట్లు ఎదురైనా… పడి లేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత శక్తిమంతమైన స్టార్‌ కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు ఎన్టీఆర్‌. సినిమా రంగంపైనే కాకుండా… బుల్లితెరపై కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. నటన పరంగానే కాకుండా.. గాయకుడిగా కూడా తన ప్రావీణ్యం ప్రదర్శించారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో 25 సినిమాల మైలురాయిని అధిగమించిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకి 1983, మే 20న హైదరాబాద్‌లో జన్మించిన ఎన్టీఆర్‌.. విద్యారణ్య హైస్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సెంట్‌ మేరీస్‌ కాలేజీలో ఇంటర్‌మీడియట్‌ పూర్తి చేశారు. చిన్నప్పుడే కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం సంపాదించారు. బాలనటుడిగా ‘బాలరామాయణం’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తొలి అడుగులోనే నందితో మెరిసి వెండితెరను పులకింపజేశాడు.

అంతకు ముందే తాత నందమూరి తారక రామారావు సారథ్యంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో అద్భుతమైన నటనను కనబర్చి నటసార్వభౌముడినే మెప్పించాడు. చిరు ప్రాయంలోనే చిరుతలా తెలుగు తెరపై నట విశ్వరూపాన్ని చూపించిన ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తెరంగేట్రం చేశాక మరింత జోరు చూపించాడు. ‘నిన్నుచూడాలని’తో తొలిప్రయత్నంలో నిరాశపర్చినా ‘స్టూడెంట్‌ నెం.1’తో నటుడిగా తనలోని ప్రతిభను తొలిసారి సినీ ప్రియులకు రుచిచూపించాడు. భవిష్యత్‌ టాలీవుడ్‌ నెం.1 కథానాయకుడిని తానేనంటూ ఆనాడే చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్‌. ‘ఆది’ కేశవ రెడ్డిగా రికార్డుల తొడగొట్టి.. ‘సింహాద్రి’తో విజయదరహాసం చేసి.. ‘ఆంధ్రావాలా’గా తెలుగువారి మదిని దోచుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్లపాటు పరాజయాలతో ఉక్కిరిబిక్కిరయినా ‘యమదొంగ’తో పడిలేచిన కెరటంలా వెండితెరపై మెరుపులు మెరిపించాడు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. ఆ తర్వాత ‘అదుర్స్‌’ అనిపించే కథలతో ‘బృందావనం’లో కృష్ణుడిగా అపజయమెరుగని సినీ ప్రయాణం సాగిస్తూ ‘ఊసరవెల్లి’లా వైవిధ్యమైన పాత్రలతో అభిమానులకు మరింత చేరువయ్యాడు. చిత్ర సీమలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే స్టార్‌ కథానాయకుడిగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవల కాలంలో ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకొన్నారు. ‘యమదొంగ’తో పాటు… ‘కంత్రి’, ‘అదుర్స్‌’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల్లో గీతాలు ఆలపించి గాయకుడిగా కూడా మెప్పించారు ఎన్టీఆర్‌. తెలుగులోనే కాకుండా కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘చక్రవ్యూహం’ అనే చిత్రంలో కూడా ఎన్టీఆర్‌ పాట పాడారు. లక్ష్మీప్రణతిని 2011 మే 5న వివాహం చేసుకొన్నాడు. ఈరోజు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు.