Editorials

ఆవుల గోపాలకృష్ణమూర్తిని అమెరికా ఎలా ఎందుకు గుర్తించింది?

Innaiah Muchatlu - How and why USA invited aavula gopalakrishnamurthy?

ఎ.జి.కె. అంటే ఆవుల గోపాలకృష్ణమూర్తి. తెనాలిలో ప్లీడర్ వృత్తిలో ఉన్న మానవవాది. అలాంటి వ్యక్తిని అమెరికా ప్రభుత్వం గుర్తించి, తమ దేశానికి పిలిపించి సత్కరించడాన్ని విస్మయం గొలిపిన సత్యం.

1963లో తన కుమార్తె జయశ్రీ పెళ్ళి చేస్తున్న రోజే ఎ.జి.కె. వివాహ రజతోత్సవం కూడా. పెళ్ళి కార్యక్రమం జస్టిస్ ఆవుల సాంబశివరావు ఆధ్వర్యాన, కొండవీటి వెంకటకవి లౌకిక పురోహిత్య కార్యక్రమం సాగుతున్న సందర్భం. ఆవుల, మేకల వియ్యం గురించి కవులు చమత్కారంగా ఆశీస్సులు అందిస్తున్న సమయం. జూన్ 1న ఎ.జి.కె. యింటి వద్ద జరుగుతున్న కార్యక్రమానికి దినపత్రికలో సింగిల్ కాలం వలె నిటారుగా వున్న వ్యక్తి వచ్చారు.

మద్రాసు సమాచారశాఖ అమెరికా కార్యాలయంలో తెలుగు విభాగం నడిపిస్తున్న బి.ఎస్.ఆర్.కృష్ణ వచ్చారు. పెళ్ళికి అందరివలె ఆహ్వానితుడుగా వచ్చాడనుకున్నారు. జేబులోనుండి కాగితం తీసి ఎ.జి.కె. అందించారు. విప్పి చూస్తే అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఎ.జి.కె.ని తన దేశం వచ్చి, చూచి. యిష్టం వచ్చిన చోట్లకు వెళ్ళి గమనించమని ఆహ్వానంలో వున్నది. విషయం తెలిసి, పెళ్ళి సందడికి తోడైన ఆనందాన్ని అందరూ పంచుకున్నారు.

ఆవుల గోపాలకృష్ణమూర్తి తెనాలిలో వుంటూ, మానవవాద ఉద్యమంలో ఎం.ఎన్.రాయ్ తత్వాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేసిన వ్యక్తి. తెనాలి మున్సిపాలిటీకి ఒకసారి ఛైర్మన్ గా పనిచేశారు. రచయిత విమర్శకుడు. నిశిత పరిశీలకుడు.

ఎ.జి.కె. అందుకున్న ఆహ్వానం వార్తాపత్రికలకు ఎక్కింది. అందరూ అభినందిస్తుండగా, సత్కార సభ పెట్టి మనదేశ ఔన్నత్యం, వివేకానంద గొప్పతనం అమెరికాలో చాటమని వక్తలు కోరారు. ఎజికె సమాధానమిస్తూ వివేకానంద గురించి తనకు తెలిసిన నిజాలు చెబుతానని దేశ విషయాలు యధాశక్తి వివరిస్తానని అన్నారు. దానికి చిలవలు పలవలు చేర్చి, వివేకానంద గురించి అమెరికాలో ఎండగడతానన్నారని, ఆయన్ను అమెరికా పంపించరాదని ఆంధ్రప్రభలో లేఖలు రాశారు. నీలం రాజు వెంకటశేషయ్య ఎడిటర్ గా వున్న ఆ పత్రిక ఎ.జి.కె. వ్యతిరేక ప్రచారం చేసింది. అవేమీ పనిచేయలేదు. ఎ.జి.కె. యధావిధిగా అమెరికా వెళ్ళారు.

ఆగస్టు 20న అమెరికా రాజధాని వాషింగ్టన్ లో నాటి అధ్యక్షుడు కెన్నడి వైట్ హౌస్ లో ప్రెస్ సమావేశం జరిపారు. దానికి ఇండియా అతిథిగా ఎ.జి.కె.ని ఆహ్వానించి ప్రధమ శ్రేణిలో కూర్చోబెట్టారు.

అమెరికాలో ఎ.జి.కె. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరికి కలవాలన్నా యథేచ్ఛగా చేయవచ్చునన్నారు. ఎ.జి.కె. భిన్న రంగాలను ఎంచుకొని, తూర్పు పడమర ప్రాంతాలలో తనకిష్టమైన విశేషాలు చూచారు.

ముందుగా ఫెరంక్ నాగీ (హంగరీ మాజీప్రధాని) అధ్యక్షతన వాషింగ్టన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడమని పిలిస్తే, గంటసేపు వ్యవసాయ సమస్యలపై ప్రసంగించారు. అందరూ శ్లాఘించారు.

మిల్వాకీలో లైబ్రరీ వారు పిలిస్తే వెళ్ళి, చూచి, చిన్న ఉపన్యాసం యిచ్చారు. ఆయన సంతకం చేసిన పుస్తకం అక్కడ ప్రదర్శనలో వుంది.

ప్రాథమిక పాఠశాల విద్య చూస్తానంటే ఒహైఓ రాష్ట్రంకి తీసుకువెళ్ళారు. మాధుర్యం వివరిస్తూ తెలుగు మాధుర్యం వివరిస్తూ పద్యాలు, కథలు చెబితేే ముసిముసి నవ్వులతో స్వీరించారు. బాలబంధు బి.వి.నరసింహారావు మొదలు తెలుగు రచయితల నుండి వినిపిస్తూ పిల్లలకు ఆనందపడే రీతిలో ఎ.జి.కె. చెప్పారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలస్ నగరంలో రేడియో వారి ఆహ్వానంపై గంటసేపు మానవవాద తత్వం గురించి ప్రసంగించారు. అది దేశవ్యాప్తంగా ప్రసారం చేశారు. 1963లో జరిగిన యీ రికార్డు విశేషమైనది.

రైతు అభిమానిగా పొలాలు, ఉత్పత్తి తీరు, పంట ధరలు పరిశీలించారు. ఫ్రెస్నో రైతులు సాదరంగా ఎజికెను తీసుకెళ్ళి తమ వ్యవసాయ రీతులు వివరించారు. ఎజికె సందర్శన జ్ఞాపకార్థం ఒక రోజు నగర మేయర్ గా ఎజికెను గౌరవించారు.

అమెరికాలో నేటివ్ ఇండియన్ల స్థితిగతులు స్వయంగా చూచి పరిశీలించడం అరుదైన అవకాశం. ఆ పని పూర్తి చేశారు.

న్యూయార్క్ లో ఎలెన్ రాయ్ సోదరుడిని కలసి, ఎలెన్ విషాదాంతాన్ని తలచుకొని కన్నీరు పెట్టుకున్నారు. రెండు మాసాలు అమెరికాలో విజయవంతంగా గడిపి, జయప్రదంగా పర్యటన ముగించుకొని తిరిగి ఇండియా వచ్చారు. పర్యటనలో ఎక్కడా వివేకానంద ప్రస్తావన రాలేదు.

స్వదేశంలో మంచి స్వాగతం లభించింది. అనేక సభలు జరిగాయి. తన అనుభవాలను వివరించారు. అవన్నీ గ్రంథస్తం చేశారు. ఆయన ప్రసంగాలు విని, మనం మాట్లాడుకునే మాటలే అతని నోటి నుండి వస్తే మధురంగా మారతాయని వ్యాఖ్య వచ్చింది.

మద్రాసులోని అమెరికా సమాచార శాఖ వారిని అడిగితే, ఎజికె పర్యటన గురించి తృప్తి చెందారని తెలిసింది కానీ ఆయన్ను ఎలా ఎంపిక చేశారు అనేది జవాబు లేని ప్రశ్నగానే వుండిపోయింది!