Food

అరటిలో 1000 రకాలు

Telugu food and diet news - Banana specials

చిన్నపిల్లలకు పాలు సరిపడనప్పుడు వారి బుజ్జిబొజ్జలను నింపే పోషకాల పండు.. స్కూలుకో ఆఫీసుకో పరుగులు తీస్తూ టిఫిన్‌ తినే సమయం లేనప్పుడు గుర్తొచ్చే సూపర్‌ఫాస్ట్‌ ఫలహారం… ఇలా ఒక్కటేమిటి అనేక రకాలుగా ఉపయోగపడే ఈ పండు తక్కువ సమయంలో ఎక్కువ శక్తినిస్తుంది. ఈ కాలం ఆ కాలం అంటూ లేకుండా ఏడాది పొడవునా విరివిగా లభించే పండే అరటి. ఎన్నో పోషకాలు, మరెన్నో ఉపయోగాలు కలిగి ఆరోగ్యాన్నిచ్చే అరదరి పండు విశేషాలెన్నో..!
* సామాన్యుల నుంచి ధనికుల వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది అరటిపండు. ఏ పండగొచ్చినా.. పబ్బమొచ్చినా అరటిపండును కొనకుండా ఉండలేం. ఇక ఫంక్షన్లు..పెళ్లిళ్లు ఇలా ఒకటేమిటి ప్రతి శుభకార్యక్రమానికి అరటిపండును ఆరగించేస్తాం. అంతేకాదు, పందిరి తోరణాలుగా.. వడ్డించే ఆకులుగా ఇలా అనేకరకాలు ఉపయోగపడుతుంది అరటి. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫలం. ఏటా గ్లోబల్‌గా 100 బిలియన్ల అరటిపండ్లను తింటున్నారట. అందులోనూ 51 శాతం బ్రేక్‌ఫాస్ట్‌లోనే ఆరగించేస్తున్నారట..! ఇవి 10,000 సంవత్సరాలకు ముందు నుంచే వినియోగంలో ఉన్న తొలి ఫలమని కొందరు పరిశోధకుల మాట. తొలి అరటి మలయ ద్వీపకల్పం, ఇండోనేషియా, ఫిలిప్తైన్స్‌, న్యూ గినియా వంటి ప్రాంతాల్లో లభ్యమయ్యిందట. అక్కడి నుంచి వర్తకులు భారత్‌, ఆఫ్రికాలకు తీసుకెళ్లారు. క్రీ.పూ.327లో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ లోయప్రాంతాల్లో ఈ పంటను పండించడం గుర్తించాడట. అలా అరటిపండు రుచిని ఆస్వాదించి పశ్చిమ దేశాలకు పరిచయం చేశాడు. ఆఫ్రికాలో క్రీ.శ 650 నుంచి వీటి వినియోగం మొదలయ్యింది. ఆఫ్రికా అట్లాంటిక్‌ తీరంలో అరటి పంటను గుర్తించిన పోర్చుగీసు వాళ్లు 16వ శతాబ్దంలో వీటిని అమెరికాకు పరిచయం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1000 రకాల అరటిపండ్లను ఉత్పత్తి చేస్తున్నారు.
**పోషకాలెన్నో…!
అరటి చెట్లు అతిపెద్ద హెర్బాసియస్‌ ఫ్లవరింగ్‌ ప్లాంట్‌. ఇవి పొడవైనా కాండం కలిగి కొమ్మల్లా వేలాడే ఆకులతో ఉంటాయి. వీటి కాండం మిగిలిన చెట్లకు మాదిరి గట్టిగా కాకుండా మెత్తగా ఉంటుంది. చూడటానికి గట్టి కాండంలా కనిపించే వీటిని వృక్షాలనుకుంటారు. కానీ, ఇవి హెర్బ్‌ జాతికి చెందినవి. అరటి పండ్లలో అధిక పొటాషియం తక్కువ సోడియం ఉంటుంది. మెగ్నీషియం, విటమిన్‌-సి, బీ6 వంటి పోషకాలెన్నో ఉంటాయి. అందుకే, దీన్ని కూరలుగా, జ్యూసులుగా, సలాడ్‌గా చేసుకొని కూడా తినేస్తున్నాం. చాలా రకాల పండ్లు, కూరగాయల్లానే వీటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల 90 కేలరీలు అందుతాయట. ఈ పండ్లను తినడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తాయట. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాక జీర్ణశక్తిని పెంచుతాయి. అందుకే మలబద్దకం చేసిన వారికి అరటి పండు తినమని వైద్యులు సూచిస్తుంటారు. మెత్తగా గుజ్జులా ఉండే ఈ పిండిపదార్థం విరేచనం సులువుగా అయ్యేందుకు దోహదపడుతుంది. పసిపిల్లలకు పాలతో పాడు అరటి, సపోట వంటి పండ్లను తినిపిస్తారు.
**వేయి రకాలు….
ఈ పండ్లలో పచ్చ, ఆకుపచ్చ, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలు మాత్రమే మనకు తెలుసు కానీ, అరటి పండ్లలో వెయ్యి రకాలున్నాయని మీకు తెలుసా..! క్యావెండిష్‌, పిసాంగ్‌ రాజ, రెడ్‌, లేడీఫింగర్‌, బ్లూజావ, ప్లాంటేయిన్‌, మంజనో, బుర్రో, బరాంగన్‌, గోల్డ్‌ఫింగర్‌ వంటివి కొన్ని. వీటిలో ఎక్కువ ఎగుమతి అయ్యేది కవాండిష్‌. లేడీ ఫింగర్‌ అరటి చిన్నగా ఉంటుంది. కేవలం 4-5 అంగుళాలు ఉంటుంది. బ్లూజావా అరటి పండ్లను ఐస్‌క్రీం అరటి అని అంటారు. ఎందుకంటే వీటి రుచి వెనీలాలా ఉంటుంది. అందుకే ఐస్‌క్రీం అరటి అనే పేరు వచ్చింది. మంజానో అరటిని యాపిల్‌ బనానా అంటారు. ఎర్ర అరటి పండ్లను అమెరికాలో ఇష్టంగా తింటారు. వీటిని తూర్పు ఆఫ్రికా, ఆసియాల్లో పండిస్తారు. అరటి ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, వంకాయ, గోధుమ వంటి వివిధ రంగులో పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రకాల అరటి పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే వీటిలో చాలావరకు రుచి చప్పగా ఉంటాయి. సహజమైన అడవి అరటిలో రుచికి తియ్యగా ఉంటుంది. దీనిలో గింజలు నల్లగా పెద్దపెద్దగా ఉండి రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. ఈశాన్య ఆసియాలో అరటిపండ్లు ఎర్రగా ఉంటాయి. కానీ, వాటి రుచి మాత్రం సాధారణంగా ఉండే వాటిలానే ఉంటాయట. ఈరోజు మనం తినే అరటిపండ్లు అసలైన అడవి పండ్ల కన్నా రుచిగా ఉంటాయి.
**కూర అరటి…
అరటి పండ్లను బొటానికల్‌ బెర్రీ అని పిలుస్తారు. సాధారణంగా మనం తీసుకునే అరటి పండ్లు తియ్యగా ఉంటాయి. తీపి పదార్థం అధికంగా ఉండటంతో వీటిని జ్యూస్‌ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తాం. కానీ, కూర వండుకునే అరటి రకాలు కూడా ఉన్నాయి. ఇవి పచ్చిగా ఉండి చప్పగా ఉంటాయి కాబట్టి కూరకు బాగుంటాయి. పచ్చి అరటి ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్‌తో పాటు అనేక రోగాలు పోతాయని, బరువును తగ్గించడంతోపాటు శరీరంలోని బ్యాడ్‌ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుందని, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను క్రమబద్ధీకరిస్తుందని అంటుంటారు. పచ్చ అరటి పండ్లలో ఉండే పిండిపదార్థం రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అదే పసుపు రంగుల్లో ఉండే అరటిలో ఎక్కువ శాతం షుగర్‌ కలిగి ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారు రాత్రిపూట ఈ పండును తీసుకోకపోవడమే మంచిది.
**అరటి ఆకుల్లో భోజనం
అరటి చెట్లలో ప్రతిదీ ఉపయోగకరమే. అరటి పండ్లను తినడానికి ఉపయోగిస్తే వాటి ఆకులను భోజనానికి వడ్డించడానికి వాడతారు. ఈ ఆకుల్లో తినడం వల్ల ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అంతేకాదు ఆహారంలో ఉండే క్రిములు, బ్యాక్టీరియాలను పోగొడతాయి. స్వచ్ఛమైన ఆకుల్లో భోజనం అదో సంప్రదాయం. దక్షిణ భారత్‌లో ఈ ఆచారాన్ని చాలా ప్రాంతాల్లో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇవి వాటర్‌ప్రూఫ్‌గా ఉంటాయి. పదార్థాలకు మంచి ఫ్లేవర్‌ను అందిస్తాయి. వీటి వినియోగం కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకులను ఆయుర్వేద మూలికల్లో వాడుతున్నారు. అయితే విచ్చలవిడిగా వాడిపారేసేంతగా ఆకులు.. ప్రయాణ ఖర్చుల వల్ల ఇవి ఎక్కువ అందుబాటులో ఉండటం లేదు.
*కాదేదీ అనర్హం అన్నట్లు అరటి పండ్లు, ఆకులు, కాండం ఇలా ప్రతిదీ మానవులకు ఉపయోగపడుతున్నాయి. అరటి పంట కోత అనంతరం కోసి పడేసే కాండాలను సేకరించి వాటితో పర్యావరణహితమైన ఫైబర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాక ఈ ఫైబర్‌తో కాగితాలను, వస్త్రాలను కూడా చేస్తున్నారు. తొక్కే కదా అని పారేయకుండా ఈ తొక్కలపై చిత్రాలను గీసాడో చిత్రకారుడు. ఆరోగ్యాన్ని అందిస్తూ ఫలవంతమైన అరటి పండ్లు ప్రకృతి ఇచ్చిన కానుకగా భావించాలి. ఈ పంటను అధికంగా పండించడం ద్వారా రైతులకు, వినియోగదారులకు మేలు చేసిన వారమవుతాం. ఏటా ఏప్రిల్‌ మూడో బుధవారాన్ని బనానా డేగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అరటిని తినడం, బనానా డ్రెస్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించి దీని ప్రాముఖ్యతను తెలుపుతున్నారు.