Movies

దాదాసాహెబ్ పురస్కార గ్రహీత రాజ్‌కపూర్

Tributes to legendary indian actor raj kapoor

స్వేచ్చగా ఆయన కలలు కంటాడు. అంతే స్వేచ్చగా ఆ కలల్ని శిల్పాలుగా చెక్కుతాడు. అనే కలలన్నే బాక్సాఫీస్‌ సాక్షిగా సినీ విపణిలో వీక్షకులకు అమ్మేస్తాడు. ఔను… ఆయనో ‘కలల బేహారి’. సౌందర్య స్వప్నాల సంచారి. ‘బ్లాక్‌అండ్‌వైట్‌’ కళాఖండాలకూ రెయిన్‌బోలో లేని రంగులద్దడంలో ఆయన సిద్దహస్తుడు. సినిమాని శ్వాసించాడు. శాసించాడు. వత్సరాలు గడిచినా వన్నె తగ్గని అత్యద్భుత సినిమాలు మనకిచ్చి వచ్చిన పనైపోయిందంటూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. భౌతికంగా ఆయన లేకున్నా అటు బాలీవుడ్‌తోపాటు యావత్‌ భారతీయ సినిమా ఆయన స్ఫూర్తిని గుండెల్నిండా నింపుకుని మరీ ముందుకు సాగుతోంది. ఆయనే ‘షోమాన్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’, భారతీయ సినిమాకి ‘బ్రాండ్‌ అంబాసిడర్‌’, ‘ఇండియన్‌ చార్లీ చాప్లీన్‌’, ‘రాజాసాబ్‌’… ఇలా అనేకపేర్లతో ఆత్మీయంగా అంతా పిలుచుకునే రణ్‌బీర్‌ రాజ్‌కపూర్‌. భారతీయ సినిమా రంగంలో రాజ్‌కపూర్‌గా లబ్దప్రతిష్టులు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాజ్‌కపూర్‌ సేవలు అనుపమానం.. అమోఘం.. అద్భుతం. ఇవాళ ఆయన (జూన్‌ 2) వర్ధంతి.

లెక్కలేవన్ని అవార్డులు, రివార్డులు దక్కించుకున్న ఈ సృజనశీలి 1951లో రూపొందించిన ‘ఆవారా’, 1954లో తీసిన ‘బూట్‌పాలీష్‌’ ప్రతిష్టాత్మక ‘కేన్స్‌’ చిత్రోత్సవానికి నామినేట్‌ అయి ఆయన ఖ్యాతిని పెంచాయి. ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డులు 9 పొందిన రాజ్‌కపూర్‌ చిత్రసీమకు చేసిన సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1971లో ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది. 1987లో ప్రతిష్టాతక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు రాజ్‌కపూర్‌ని వరంచివచ్చింది.