ScienceAndTech

అమ్మకానికి భారతీయుల ఆధార్ వివరాలు

Indian aadhaar and passport details available online in black market

ఏడు కోట్ల మందికిపైగా భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగడి సరకు తరహాలో అంతర్జాలంలో అమ్మకానికి ఉన్నట్లు గత నెల్లో గుర్తించిన సైబర్‌ నిఘా సంస్థ ‘సైబిల్‌’ బుధవారం మరో ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. లక్ష మందికిపైగా భారతీయుల జాతీయ గుర్తింపు పత్రాలు (ఐడీలు) ఇంటర్నెట్‌లో విక్రయానికి ఉన్నాయని తెలిపింది. ఆధార్‌, పాన్‌, పాస్‌పోర్ట్‌ సహా పలు ఐడీల కాపీలు వాటిలో ఉన్నట్లు తమ తాజా నివేదికలో పేర్కొంది. అంతగా ప్రముఖుడేమీ కాని ఓ నటుడు వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని చెప్పింది. సదరు వ్యక్తి నుంచి దాదాపు వెయ్యి ఐడీలను తాము సేకరించగలిగామని.. అవన్నీ స్కాన్‌ చేసిన కాపీలేనని వెల్లడించింది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన భారతీయుల వివరాలు అమ్మకానికి ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థ నుంచి కాకుండా, థర్డ్‌ పార్టీ నుంచి ఐడీలు పక్కదారి పట్టినట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలినట్లు పేర్కొంది.