DailyDose

వారెన్ బఫెట్‌కు ట్రంప్ పాఠాలు-వాణిజ్యం

వారెన్ బఫెట్‌కు ట్రంప్ పాఠాలు-వాణిజ్యం

* సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూలు) ప్రైవేటీకరించే విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ వెల్లడించారు. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.20 లక్షల కోట్ల ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీ ప్రకటించే సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు వీలుగా వ్యూహాత్మక రంగాల్లో గరిష్ఠంగా 4 ప్రభుత్వ రంగ కంపెనీలు ఉండేలా, మిగతా ప్రభుత్వ కంపెనీలను దశల వారీగా ప్రైవేటీకరిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై గురువారం చర్చలు ప్రారంభమయ్యాయి. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కొంచెం కష్టమైన పనే. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. వ్యూహాత్మకేతర పీఎస్‌యూలను ఎప్పుడు వీలైతే అప్పుడు విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంద’ని వర్చువల్‌ ఏఐఎమ్‌ఏ కార్యక్రమంలో పాల్గొన్న సంజీవ్‌ సన్యాల్‌ వివరించారు.

* ప్రపంచ సంపన్నుల్లో ఒకరు, ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ తప్పులో కాలేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఎయిర్‌లైన్స్‌ రంగంలో తన కంపెనీ వాటాలను బఫెట్‌ విక్రయించి తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఎయిర్‌లైన్స్‌ షేర్లు భారీగా పుంజుకున్న నేపథ్యంలో శ్వేతసౌధం వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

* క్యామ్రి హైబ్రిడ్‌ విద్యుత్తు కారు, ది వెల్‌ఫైర్‌ మోడళ్ల ధరలను జులై నుంచి పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ శుక్రవారం తెలిపింది. రూపాయి మారకపు విలువలో గణనీయ మార్పు రావడమే ఇందుకు కారణమని వివరించింది. అయితే ధరల పెంపు ఎంతమేర ఉండొచ్చో ఇంకా నిర్ణయించలేదు. స్వీయ ఛార్జింగ్‌ సదుపాయం కలిగిన క్యామ్రి హైబ్రిడ్‌ కారు టయోటా మోడళ్లలో ప్రధానమైనది. ఇటీవల దేశీయంగా ఆవిష్కరించిన ది వెల్‌ఫైర్‌ మోడల్‌ అత్యంత విలాసవంతంగా ఉండే, శక్తిమంత ఇంజిన్‌ కలిగిన వాహనం. పర్యావరణ హితమే కాక, మైలేజీ కూడా ఎక్కువగా ఇస్తుంది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ.1000 కోట్లకు పరిమితం చేయనున్నట్లు ఆదిత్యబిర్లా గ్రూప్‌ సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్రకటించింది. కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో, నగదు నిల్వలు కాపాడుకోవడం ముఖ్యమని భావిస్తున్నట్లు సంస్థ వివరించింది. లాక్‌డౌన్‌ కారణంగా విక్రయాలపై ప్రభావం పడినా, మూలధనం, ఆర్థిక వనరులు సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.

* గురుగ్రామ్‌లో 5 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటులో ఉత్పత్తి ఆరంభమైందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రకటించింది. సంస్థ స్వీయ విద్యుత్తు అవసరాల కోసం ఈ ప్లాంటు నిర్మించింది. రూ.20 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంటు వల్ల రాబోయే 25 ఏళ్లలో 5390 టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాల విడుదలను నివారించగలమని భావిస్తున్నట్లు సంస్థ వివరించింది. ఏటా 7010 మెగావాట్‌ అవర్‌ విద్యుత్తును ఈ ప్లాంటు నుంచి పొందగలమని వెల్లడించింది. 2014లో మానేసర్‌ (హరియాణా) ప్లాంటు కోసం 1 మెగావాట్‌ సౌర విద్యుత్తు ప్లాంటును సంస్థ నిర్మించి, తదుపరి ఈ సామర్థ్యాన్ని 1.3 మెగావాట్లకు పెంచింది కూడా.

* కూరగాయలు, పళ్లు, మాంసాన్ని కడిగి, శుభ్రం చేసుకునేందుకు సాఫో బ్రాండ్‌పై ప్రత్యేక ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ కెవిన్‌కేర్‌ ప్రకటించింది. ఈనెల 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ ఉత్పత్తి తెస్తున్నట్లు వివరించింది. సూక్ష్మక్రిములు, పురుగుమందుల అవశేషాలను తమ ఉత్పత్తి తొలగిస్తుందని వివరించింది.