DailyDose

ముంబయిలో గ్యాస్ లీక్ కలకలం-తాజావార్తలు

ముంబయిలో గ్యాస్ లీక్ కలకలం-తాజావార్తలు

* ఇప్పటికే కరోనా మహమ్మారితో వణికిపోతున్న ముంబయి నగరానికి నిన్న రాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన వెంటాడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో చెడు వాసన వస్తోందంటూ శనివారం సాయంత్రం నుంచి ముంబయి నగరపాలక సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా చెంబూర్‌, ఘాట్కోపర్‌, అంధేరీ, కంజూర్‌మార్గ్‌, విఖ్రోలీ తదితర ప్రాంతాల్లో ఈ ఘాటు వాసన వస్తోందంటూ ప్రజలు ఆందోళన చెందారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్‌ అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలుత గ్యాస్‌ లీక్‌గా భావించాయి. దాదాపు 17 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో వాసనకు మూలాలు కనుక్కునేందుకు ప్రయత్నించాయి.

* ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టనబెట్టుకుంటున్న కరోనా వైరస్‌పై చైనా వ్యవహారశైలి ఆదినుంచీ అనుమానాస్పదంగానే ఉంది. దీనిపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా తప్పుపడుతూనే ఉన్నాయి. తాజాగా కొవిడ్‌-19 వైరస్‌కు సంబంధించి పూర్తి వివరణతో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. గత సంవత్సరం డిసెంబర్‌ 27వ తేదీన మాత్రమే ఈ వైరస్‌ను వుహాన్‌ నగరంలో గుర్తించినట్లు శ్వేతపత్రం ద్వారా స్పష్టంచేసింది. న్యూమోనియాకు చెందిన ఈ వైరస్‌ మానవుల్లో ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తున్నట్లు జనవరి 19న కనుగొన్నట్లు దీనిలో వెల్లడించింది.

* గర్భిణిలకు ప్రత్యేకంగా క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌‌ నిలిచింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గర్భిణిలను అత్యంత జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్‌‌ ప్రభుత్వం బిస్లాపూర్‌ జిల్లా కెస్లా గ్రామంలో ఆదివారం ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇక్కడ ఎనిమిదిమంది గర్భిణిలు ఆశ్రయం పొందుతుండగా, వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు తిరిగొచ్చిన వలసకార్మికులేనని అధికారులు పేర్కొన్నారు. వీరితో పాటు వృద్ధులకు, చిన్నారులకు విడిగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నట్టుగా తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండేవారికి పౌష్టికాహారం, ఎప్పటికప్పుడు పరిసరాలను శానిటైజ్ చేయించడం, అవసరమైన ఆరోగ్యసిబ్బందిని ఏర్పాటు చేసినట్టుగా వివరించారు. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యక్తులను 19,732 కేంద్రాల్లో ఉంచి సంరక్షిస్తున్నామని, వీరిలో ఎక్కువ మంది వలసకూలీలే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరో 52వేల మంది గృహనిర్భంధంలో ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రంలో 997 కొవిడ్‌-19 కేసులు నమోదు కాగా 253 మంది కోలుకున్నట్టు అక్కడి వైద్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా నలుగురు మృత్యవాత పడ్డారు.

* బిహార్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా శ్రీకారం చుట్టారు. ‘బిహార్‌ సంవధ్‌ ర్యాలీ’ పేరిట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదివారం మాట్లాడారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, దీనికీ బిహార్‌ ఎన్నికలకు సంబంధం లేదంటూనే ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ హయాంలో సాధించిన ఘనతలను వివరించారు.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారితో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఈ సమయంలో అమెరికా-చైనా మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాశ్చాత్య దేశాలు చేస్తున్న వ్యాక్సిన్‌ అభివృద్ధిని అడ్డుకోవడం లేదా నెమ్మది పరిచేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా రిపబ్లికన్‌ సెనెటర్‌ రిక్‌ స్కాట్‌ ఆరోపించారు. ‘వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలక దశకు చేరుకున్నాం. ఈ సమయంలో కమ్యూనిస్టు చైనా దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని రిక్‌ స్కాట్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే మీ దగ్గర ఎలాంటి రుజువులు ఉన్నాయని అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఇది మేధావి వర్గం నుంచి తెలిసిందని మాత్రం వెల్లడించారు.

* తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొససాగుతూనే ఉంది. నిన్న జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కొత్త కరోనా కేసులు నమోదైతే పరీక్షా కేంద్రాలను మార్చాలని కూడా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం హైకోర్టు తీర్పుపై రాష్ట్ర విద్యాశాఖ సుదీర్ఘంగా చర్చించింది. జీహెచ్‌ఎంసీ మినహా పరీక్షలు నిర్వహిస్తే సాంకేతికంగా అనేక ఇబ్బందులతో పాటు విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణపై రేపు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలా లేదా అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలా అనేదానిపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా ఉద్ధృతిలో మరోసారి పరీక్షలు నిర్వహించాలంటే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండగా.. పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మదింపులో పేద, మధ్య తరగతి జేబులకు ప్రభుత్వం చిల్లు పెడుతోందంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. మూడు నెలల వినియోగాన్ని కలిపి లెక్కించడంతో శ్లాబులు మారుతున్నాయని.. దీనివల్ల వినియోగదారులపై మూడింతలు అదనపు భారం పడుతోందన్నారు. 100 యూనిట్ల శ్లాబ్‌లో ఉన్న వినియోగదారులు 300 యూనిట్ల శ్లాబ్‌లోకి వచ్చారన్నారు. బకాయిలు వాయిదాల్లో చెల్లిస్తే 1.5 శాతం వడ్డీతో వసూలు చేస్తానని చెప్పడం దారుణమన్నారు. అడ్వాన్స్‌ ఛార్జీలు చెల్లించిన వారికి మీరు వడ్డీ చెల్లిస్తారా?అని ప్రశ్నించారు.

* సంచలనాల కోసమే కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని తెరాస నేతలు మండిపడ్డారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ..ఫామ్‌ హౌస్‌పై ఇప్పటికే కేటీఆర్‌ స్పష్టతనిచ్చారని, కావాలనే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటంపై కాంగ్రెస్‌ నేతలు ఆలోచన చేయాలని సూచించారు. బాల్క సుమన్‌ ఆరోపణలపై రేవంత్‌రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.