Movies

డిస్కో డ్యాన్సర్…మిథున్ చక్రబొర్తి

ఒకప్పుడు హుషారైన స్టెప్పులతో, ఆకట్టుకునే నృత్యాలతో యువతను ఉర్రూతలూగించిన బాలీవుడ్‌ హీరో మిథున్‌ చక్రవర్తి. ‘డిస్కోడ్యాన్సర్‌’ (1982) సినిమా సృష్టించిన సంచలనం ఒక్కటి చాలు ఇతడి గురించి చెప్పడానికి. ఇందులో ‘ఐయామె డిస్కోడ్యాన్సర్‌…’ అనే పాట యువత నాలుకలపై కొన్నేళ్ల పాటు నాట్యం చేసింది. ‘డిస్కో డ్యాన్సర్‌’తోనే కాకుండా ‘తహదర్‌కధ’ (1992), ‘స్వామి వివేకానంద’ (1998) లాంటి చిత్రాలతో జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్న విలక్షణ నటుడు మిథున్‌ చక్రవర్తి. ఇతడి అసలు పేరు గౌరాంగ్‌ చక్రవర్తి. తూర్పు బెంగాల్‌లోని బరిసలల్‌ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని ప్రాంతం)లో 1950 జూన్‌ 16న పుట్టిన మిథున్, కృషి ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు అనేందుకు చక్కని ఉదాహరణగా నిలిచాడు. మిథున్‌ నటించిన మొదటి సినిమా ‘మృగయా’. మృణాల్‌సేన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1976లో విడుదలై మిథున్‌కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మొదట్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటనా జీవితాన్ని ప్రారంభించిన మిథున్, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్టార్‌ హోదాను అందుకున్నాడు. నటనలో మాత్రమేకాదు వ్యాపార, వాణిజ్య, సామాజిక సేవారంగాల్లో సేవలందించాడు. రాజకీల్లోకి అడుగుపెట్టి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ‘డిస్కోడ్యాన్సర్‌’ చిత్రంలో ‘జిమ్మీ’గా మిథున్‌ పోషించిన పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సోవియట్‌ యూనియన్,రష్యా వంటి దేశాల్ల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. హిందీ, బెంగాలీ, భోజ్పురి, తమిళ్, తెలుగు, కన్నడ పంజాబీ భాషల్లో మొత్తం 350 చిత్రాల్లో మిథున్‌ నటించారు. మోనార్క్ గ్రూప్‌ ద్వారా విద్య, వైద్యరంగాల్లో సేవలందిస్తున్నారు. 1992లో సునీల్‌దత్, దిలీప్‌కుమార్‌లతో కలిసి సినీ, టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న సినీ రంగకళాకారుల కష్టాలను తీర్చేందుకు కృషి చేశారు. గ్రాండ్‌ మాస్టర్‌గా లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ‘జిమ్మీ జించాక్‌’ అనే కామిక్‌ పుస్తకం మిథున్‌ చక్రవర్తి జీవితం ఆధారంగా వచ్చిందే. ఈ కామిక్‌కు మిధున్‌ ముందుమాట కూడా రాశాడు. బెంగాలి, హిందీ, భోజ్‌పురి భాషల్లో మిథున్‌ జీవిత చరిత్ర పుస్తకాలొచ్చాయి. ఇప్పుడు మిథున్‌ 70వ వసంతంలోకి అడుగిడుతున్నారు.