Health

గోకుల్ ఛాట్ యజమానికి కరోనా-TNI బులెటిన్

గోకుల్ ఛాట్ యజమానికి కరోనా-TNI బులెటిన్

* భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గతకొన్ని రోజులుగా దేశంలో నిత్యం 300లకు పైగా కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి.తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 380మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు.దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 9900కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.ఇక, కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 కేసులు నమోదయ్యాయి.

* ఏపీలో 5280కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు. గడిచిన 24 గంటల్లో 193 కొత్త కేసులు నమోదు.

* మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి ఏరియాలోని శాంతి గని, కాసిపేట బొగ్గు గనుల లో కరోనా కోవిడ్-19 చర్య ల లో భాగంగా కార్మికులు సింగరేణి యాజమాన్యం , మాస్కూలు కార్మికులకు పూర్తి స్థాయిలో నాణ్యత గల శానిటైజర్ లు సింగరేణి యాజమాన్యం సమకూర్చ లేదని కార్మికులు ఆరోపించారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలో శాంతిగని బొగ్గు గనికి చెందిన కార్మికునికి కరోనా సోకడంతో కార్మికులకు భయాందోళన మొదలైంది. కార్మికులకు పూర్తి స్థాయిలో సెల్ఫ్ శానిటైజర్ లు సమకూర్చాలని తెలిపారు. అదేవిధంగా కార్మికులు క్వారెంటాయిన్ లో 14 రోజులు ఉన్నవారికి లీవ్ లు ఇవ్వాలని కార్మికులు తెలిపారు.

* ప్రపంచ జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే అవకాశముందని ఇటీవలి ఓ అధ్యయనం తెలిపింది. ఈ మేరకు బ్రిటన్‌లోని ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’కు చెందిన నిపుణుల బృందం తమ పరిశోధనా ఫలితాలను వెల్లడి చేసింది. వివిధ ప్రభుత్వాలు, సంస్థలు అధికారికంగా వెల్లడించిన కొవిడ్‌-19 ప్రమాద కారకాలను, అంటువ్యాధులకు సంబంధించిన విస్తారమైన గణాంకాలను, సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని విశ్లేషించిన అనంతరం తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు నిపుణులు తెలిపారు.

* కోఠిలోని గోకుల్‌ చాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. దీంతో గోకుల్ చాట్‌ను అధికారులు మూసివేశారు. దుకాణంలోని 19 మందిని క్వారంటైన్‌కు తరలించారు. గత మూడు రోజులుగా గోకుల్ చాట్‌కు వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

* దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 10,215 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 1,80,012కి పెరిగింది. దీంతో కరోనా రికవరీ రేటు 52.47 శాతానికి పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,53,179గా ఉంది.

* కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్‌ను వణికించిన ఈ మహమ్మారి తాజాగా దేశ రాజధాని బీజింగ్‌పై పడగవిప్పింది. నగరంలో ఉన్న అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ షిన్‌ఫడి తాజాగా వైరస్‌కు కేంద్ర బిందువైంది. నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతుండటంతో బీజింగ్‌లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చినట్లు నగర అధికారులు హెచ్చరిస్తున్నారు.