DailyDose

12వ రోజు పెరిగిన ఇంధన ధరలు-వాణిజ్యం

12వ రోజు పెరిగిన ఇంధన ధరలు-వాణిజ్యం

* పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.12వ రోజు గురువారం కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.లీటర్‌ పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 64 పైసలు పెంచాయి.దీంతో గడిచిన 12 రోజుల్లో పెట్రోల్‌పై రూ.6.55,  డీజిల్‌పై రూ.7.04 పెంచాయి.ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.77.81, డీజిల్‌ ధర రూ.76.43కు చేరుకున్నాయి. 

* నివారించడానికి వీలయ్యే వ్యయాలను పక్కనపెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు కేంద్రం సూచించింది. సిబ్బంది కార్ల కొనుగోలు, అతిథి గృహాల నవీకరణ, ఇంటీరియర్‌ పనుల వంటి వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని.. తద్వారా ఆర్థిక వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని వివరిస్తూ, పీఎస్‌బీలకు ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్‌ఎస్‌) సవివరంగా సలహాలను పంపింది. ప్రధాన వ్యాపార కార్యకలాపాలకే వనరులు వినియోగించాలని సూచించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) తన ఉన్నతాధికారులకు రూ.1.3 కోట్లకు పైగా విలువైన మూడు ఆడి కార్లను ఇటీవల కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ సలహాలు వెలువడడం గమనార్హం.

* బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, లోహ షేర్ల అండతో దేశీయ మార్కెట్లు గురువారం భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌700 పాయింట్లు లాభపడి, 34,208 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 10వేల మార్కును దాటి స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.14 కొనసాగుతోంది.

* అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు ఆవిష్కరించడం సెల్‌ఫోన్‌ కంపెనీలకు సులభం కానుంది. ఇందుకు ఉపకరించేలా, 5జీ టెక్నాలజీకి సహకరించే స్నాప్‌డ్రాగన్‌ 690 చిప్‌సెట్‌ను క్వాల్‌కామ్‌ బుధవారం విడుదల చేసింది. 300-500 డాలర్ల (సుమారు రూ.22,000-38,000) ధరల శ్రేణిలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణకు ఇవి దోహద పడనున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిప్‌సెట్‌తో ఇవి విపణిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, మోటరోలా, షార్ప్‌, టీసీఎల్‌, వింగ్‌టెక్‌ వంటి కంపెనీలు ఈ చిప్‌సెట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయొచ్చు. మన దేశంలో ఇంకా 5జీ సేవలను టెలికాం సంస్థలు ప్రారంభించలేదు.

* కొవిడ్‌- 19 బాధితులకు ఉపశమనం కలిగించేందుకు ఉపయోగిస్తున్న ఫవిపిరవిర్‌ ఔషధాన్ని తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆప్టిమస్‌ ఫార్మా ప్రకటించింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ 200 ఎంజీ, 400 ఎంజీ డోసుల్లో ఫవిపిరవిర్‌ ట్యాబ్లెట్లను హైదరాబాద్‌ సమీపంలోని యూఎస్‌ఎఫ్‌డిఏ అనుమతి కల తన యూనిట్లో తయారు చేస్తోంది. జపాన్‌కు చెందిన టొయోమా కెమికల్స్‌ చెందిన ‘అవిగన్‌’ అనే బ్రాండెడ్‌ ట్యాబ్లెట్‌కు, ఫవిపిరవిర్‌ జనరిక్‌ ఔషధం. దీన్ని జపాన్‌తో పాటు రష్యా, చైనా, యూఏఈ తదితర దేశాల్లో కొవిడ్‌- 19 బాధితులకు ఇస్తున్నారు. రోగి స్థితిగతులను బట్టి 4 నుంచి 14 రోజుల పాటు ఈ ఔషధాన్ని వాడాలని సిఫార్సు చేస్తున్నారు. ఫవిపిరవిర్‌ ఔషధాన్ని దేశీయంగా విక్రయించేందుకు అనుమతి కోరుతూ సీడీఎస్‌సీఓ (సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌) వద్ద దరఖాస్తు చేసినట్లు ఆప్టిమస్‌ ఫార్మా వివరించింది. ఒక పక్క ఎగుమతులు చేస్తూనే, మరోపక్క దేశీయ అవసరాలకు కూడా ఈ ఔషధాన్ని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆప్టిమస్‌ ఫార్మా డైరెక్టర్‌ పి.ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

* ఇండియా సిమెంట్స్‌లో నియంత్రిత వాటాను కొనుగోలు చేయాలని దేశవ్యాప్తంగా డిమార్ట్‌ పేరిట సూపర్‌ మార్కెట్లను నిర్వహిస్తున్న భారత వ్యాపార దిగ్గజం రాధాకిషన్‌ దమానీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియంత్రిత వాటాదారైన ఎన్‌. శ్రీనివాసన్‌తో దమానీ టేకోవర్‌ విషయంలో చర్చలు జరిపినట్లు పేరు బయటకు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్‌లో శ్రీనివాసన్‌కు 29 శాతం వాటా ఉంది. ఎటువంటి బలవంతపు టేకోవర్‌ లేకుండా.. స్నేహపూర్వక వాతావరణంలో మేనేజ్‌మెంట్‌లో మార్పు కనిపిస్తుందని శ్రీనివాసన్‌కు దమానీ హామీనిచ్చినట్లు తెలుస్తోంది. అయితే దమానీ, శ్రీనివాసన్‌లు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ వర్గాలు చెబుతున్నాయి. కాగా, డిమార్ట్‌ సూపర్‌మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు చెందిన ప్రతినిధి ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించగా.. ఇండియా సిమెంట్స్‌ ప్రతినిధి ఈ సమాచారం సరైనది కాదన్నారు. కాగా, దమానీ, కుటుంబ సభ్యులు గత కొన్ని నెలలుగా ఈ సిమెంట్‌ కంపెనీలో షేర్లను కొనుగోలు చేస్తూ వచ్చారు. మార్చి 31తో ముగిసిన ఏడాదిలో వీరి వాటా నాలుగింతలై 20 శాతానికి చేరడం గమనార్హం.