Movies

లేడీ సూపర్‌స్టార్…రాములమ్మ!

Happy Birthday To Lady Superstar Vijayasanthi || TNILIVE Telugu Movies

ఆమె తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్. తన యాక్షన్‌తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం కూడా. గ్లామర్ కి గ్రామర్ నేర్పిన లేడీబాస్. ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించిన అరుణ కిరణం. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసిన ఆ నటీమణి పేరు విజయశాంతి. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి బర్త్ డే నేడు.

విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాదు. ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటు ఫర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తునే.. ఇటు గ్లామర్ డాల్‌గా తన సత్తా చాటింది. ఆడియన్స్ చేత విశ్వ నట భారతిగా పిలిపించుకునే విజయశాంతి ..1964 జూన్ 24న వరంగల్‌లో జన్మించింది. ఆమె అసలు పేరు శాంతి. తెరపేరులోని విజయను తన పిన్ని విజయలలిత నేమ్ నుంచి తీసుకుంది. హీరోయిన్ గా విజయశాంతి ఫస్ట్ మూవీ 1979లో వచ్చిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’ అనే తమిళ మూవీ. ఈ సినిమాలో నటించేటపుడు ఆమె వయసు పదిహేనేళ్లే. మాతృ భాష తెలుగులో ఆమె యాక్ట్ చేసిన మొదటి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈమూవీ నటిగా విజయశాంతి కి మంచి మార్కులే పడ్డాయి.

కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేసిన విజయశాంతికి నటిగా మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా ‘నేటి భారతం’. ఈతరం ఫిలింస్ పతాకంపై టి.కృష్ణ దర్శకత్వంలోవచ్చిన ఈ చిత్రం నటిగా విజయశాంతికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నటిగా విజయశాంతి వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికే జయసుధ, జయప్రద తమ అభినయంతో.. శ్రీదేవి,మాధవి తమ అందచందాలతో తెలుగుతెరను ఏలుతున్న రోజుల్లో నటిగా.. విజయశాంతి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటికే కథానాయికలుగా స్థిరపడిన వారిని సవాలు చేస్తూ విజయశాంతి విజృంభించింది.

ఒకవైపు ‘నేటి భారతం’ వంటి ఉత్తమ చిత్రాల్లో నటనకు ప్రాధాన్యం గల పాత్రల్లో నటిస్తూనే…మరోవైపు సగటు సినీ వీక్షకులను అలరించే గ్లామర్ మసాల పాత్రలను అలవోకగా పోషించి మెప్పించింది. 1985 నటిగా విజయశాంతికి ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ యేడాది ఈ లేడీ అమితాబ్ నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఆ ఏడాది విజయశాంతి నటించిన ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘దేవాలయం’ వంటి అభ్యుదయ చిత్రాలతో పాటు ‘అగ్ని పర్వతం’,‘పట్టాభిషేకం’ వంటి సినిమాల్లో కమర్షియల్ సినిమాల్లో తన నటనటతో మెప్పించడం విశేషం.

ఒక్కో హీరోతో విజయశాంతిది ఒక్కో కెమిస్ట్రీ. అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోలైన కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవిలతో విజయశాంతి పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది. హీరో ఎవరైనా హీరోయిన్ గా విజయశాంతికి స్పెషల్ అప్పీరియన్స్ ఉండాల్సిందే.

అంతలా క్లాస్ మాస్ తేడా లేకుండా అందరి అభిమానాన్నీ చూరగొన్ననటిగా నిలిచింది విజయశాంతి. నటసింహం బాలకృష్ణ తో విజయశాంతి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర పెద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాయి.

మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఎన్నో సూపర్ హిట్లో నటించింది విజయశాంతి. ‘సంఘర్షణ’తో మొదలైన వీరిద్దరి జోడి ‘మెకానిక్ అల్లుడు’ వరకూ కొనసాగింది.అప్పటి వరకు గ్లామర్, ఫర్ఫామెన్స్‌లతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న విజయశాంతి.. ‘కర్తవ్యం’ సినిమాతో సరికొత్త ఇమేజ్ సొంతం చేసుకుంది.

విజయశాంతి నట జీవితం గురించి చెప్పుకుంటే ‘కర్తవ్యం’ ముందు తర్వాత అనేంతగా గొప్ప మలుపు తీసుకొందీ సినిమా. అంతే కాదు సినిమాలో నటనకు గాను ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమనటిగా నంది అవార్డుతో పాటు నేషనల్ అవార్డు సైతం విజయశాంతి వశమైంది.ఈ సినిమాలో రిస్క్ తీసుకుని డూప్ లేకుండా చేసిన ఫైట్స్ విజయశాంతికి లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమెన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదుల్ని సంపాందించి పెట్టాయి.

ఒక్కసారిగా తెలుగుతెరను ఏలుతున్న నలుగురు హీరోల స్థాయికి ఆమె ఇమేజ్ చేరింది. ఫస్ట్ టైం కొన్ని ఫిల్మ్ మ్యాగజైన్స్ ఒక హీరోయిన్‌కు సూపర్ స్టార్ బిరుదు ఆమె పేరు ముందు చేర్చి రాసాయి. ‘కర్తవ్యం’ తెచ్చిపెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల విజయశాంతి తన చిత్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలో సైతం అడుగు పెట్టి మంచి విజయాలనే అందుకుంది.

స్వాతి ముత్యం హిందీ రీమేక్ ‘ఈశ్వర్’ లో అనిల్ కపూర్ సరసన విజయశాంతి మెరిసింది. కర్తవ్యం హిందీ రీమేక్ ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా నటించి నిర్మించింది. బాలీవుడ్ లో సైతం ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసింది. హోల్ ఇండియాలో తన పేరు మారుమోగేలా చేసింది.

పై చిత్రాలన్ని ఒక ఎత్తు 1992లో విజయశాంతి నటించిన ‘మన్నన్’ ఒక ఎత్తు. దాదాపు ఎనిదేళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి డైరెక్టుగా నటించిన తమిళ చిత్రం. సూపర్ స్టార్ రజనీకాంత్ కు పోటీగా అహంకార పూరితమైన హీరోయిన్ పాత్రలో ఆమె జీవించి తమిళ తంబిలచే జేజేలు కొట్టించుకుంది. అందులో ఒక సీన్ లో విజయశాంతి రజనీకాంత్ ను చెంపదెబ్బ కొట్టె సీన్ ఉంది. తెరపై వేరే ఏపాత్ర కూడా రజనీని తిట్టడం కొట్టడం వంటివి చేస్తే రజనీ అభిమానులు సహించరు. మరే ఇతర నటి ఆ పని చేసినా.. తన అభిమానులు తెరలు చించేసి ఉండేవారని విజయశాంతి కాబట్టి ఆ పని వారు చేయలేదని.. రజనీ ఆ సినిమా 100డేస్ ఫంక్షన్ లో అన్నాడు. విజయశాంతి కున్న ఫాన్ ఫాలోయింగ్ కు ఇది నిదర్శనం. రజనీతో సరిసమానంగా కోలీవుడ్లో విజయశాంతికి అభిమానులుండడం విశేషం.

1993లో ‘పోలీస్ లాకప్’ తర్వాత విజయశాంతి నటించిన చిత్రాలు ఆశించిన విజయాలు నమోదు కాలేదు. విజయశాంతి పని ఇక క్లోజ్ అనుకుంటున్న సమయంలో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ పెద్ద సెన్సెషనే క్రియేట్ చేసింది. దాసరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచి అందరి అంచనాలు మించిపోయింది.

అంతేకాదు అదే ఏడాది విడుదలైన టాలీవుడ్ టాప్ హీరోల హిట్టైన చిరంజీవి.. ‘హిట్లర్’, బాలకృష్ణ.. ‘పెద్దన్నయ్య’, నాగార్జున.. ‘అన్నమయ్య’, వెంకటేష్.. ‘ప్రేమించుకుందాం…రా’ చిత్రాల కంటే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది ‘ఒసేయ్ రాములమ్మ’. బాక్సాఫీసు వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందీ చిత్రం. ఈ సినిమాకు సైతం నాల్గో సారి ఉత్తమనటిగా నంది అవార్డు అందుకుంది విజయశాంతి. ఈ చిత్రంలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందంటే అప్పటి నుంచి ప్రేక్షకులు ఆమెను అభిమానంతో రాములమ్మ గా పిలవడం ప్రారంభించారు.

రాములమ్మ క్రమంగా తన చిత్రాలను తగ్గించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ లో చేరి క్రియాశీలకంగా వ్యవహరించింది. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ సభ్యురాలైంది.ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. అంతేకాదు ఆ పార్టీ తరుపున స్టార్ కంపెనేయిర్‌గా వ్యవహరింది. గత 13 ఏళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉన్న విజయ్ శాంతి..మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది.