DailyDose

₹45వేల కోట్లు నష్టపోయిన టిక్‌టాక్-వాణిజ్యం

TikTok Losses 45000 Crores - Telugu Business News Roundup

* యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చైనా విలవిల్లాడుతోంది. మింగలేక కక్కలేక బాధపడుతోంది. డబ్లూటీసీ నియమాలకు విరుద్ధమని డొల్ల మాటలు చెబుతోంది. అయితే, యాప్‌ల నిషేధంతో డ్రాగన్‌ కంపెనీలపై దెబ్బ బాగానే పడిందని తెలిసింది. నిషేధం వల్ల టిక్‌టాక్‌, హెలో యాప్‌ల మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఏకంగా రూ.45వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) నష్టపోనుందని చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఒక్క మేలోనే ప్రపంచ వ్యాప్తంగా 112 మిలియన్ల సార్లు టిక్‌టాక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్న మొబైల్‌ యాప్‌ విశ్లేషణ సంస్థ సెన్సార్‌ ట్వోర్‌ నివేదికను ఉటంకించింది. వీరిలో ఎక్కువమంది భారతీయులే ఉన్నారని అమెరికాకు రెట్టింపు సంఖ్యలో డౌన్‌లోడ్లు చేసుకున్నారని వెల్లడించింది.
భారత్‌ నిషేధించిన 59 యాప్‌లు మొత్తంగా రూ.70-80వేల కోట్ల వరకు నష్టపోయే అవకాశముందని తెలుస్తోంది.

* ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ భారతీయ రైల్వే..రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ప్రజా రవాణా సంస్థ.ఇప్పుడు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసింది.భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని ప్రైవేటు సంస్థలను కేంద్ర ప్రభుత్వం మొదటిసారి ఆహ్వానించింది.109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్ల ద్వారా ప్యాసింజర్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులను కోరింది.ఈ ప్రాజెక్టులో ప్రైవేటు రంగ పెట్టుబడులు 30 వేల కోట్లు.రైళ్ల నిర్వహణ బాధ్యత ప్రైవేటు సంస్థలపై ఉంటుంది.రైళ్ల నిర్వహణ, సముపార్జన, ఆపరేషన్ మరియు నిర్వహణకు ప్రైవేట్ కంపెనీలు బాధ్యత వహిస్తాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.32 సమయంలో సెన్సెక్స్‌ 235 పాయింట్లు లాభపడి 35,646 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 10,504 వద్ద ట్రేడవుతున్నాయి. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, రైటెస్‌ లిమిటెడ్‌, దిలిప్‌ బిల్డ్‌కాన్‌ వంటి షేర్లు లాభాల్లో ఉండగా.. ఓమెక్స్‌, మాగ్మా ఫిన్‌కార్ప్‌, శ్రెయి ఇన్‌ఫ్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక రంగాల వారీగా చూస్తే ఫైనాన్స్‌, బ్యాంక్‌, ఎనర్జీల షేర్లు అత్యధిక లాభాల్లో ఉన్నాయి. ఐటీ, ఆటో, ఇన్ఫ్రా రంగాల సూచీలు నష్టపోతున్నాయి.

* కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి ప్రముఖ విమాన యాన సంస్థ ఇండిగో శుభవార్త చెప్పింది. దేశంలో వైద్యులు, నర్సులకు విమాన ఛార్జీల్లో రాయితీలు ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకు విమాన ఛార్జీల్లో 25శాతం మేర రాయితీ కల్పించనున్నట్టు తెలిపింది. దేశానికి సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞత చాటేందుకు ‘కుకీ క్యాంపెయిన్‌’ కింద ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చెక్‌ ఇన్‌ సమయంలో ఈ రాయితీ పొందే వైద్యులు, నర్సులు తమ ఆస్పత్రి ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ నెల 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు తమ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకొనే వైద్యులు, నర్సులకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంచుతున్నట్టు ఇండిగో సీవోవో విలియం బౌల్టెర్‌ తెలిపారు.

* కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఆ సమయంలో డబ్బులేకపోవడంతో చాలామంది ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్‌ నుంచి 55లక్షలకు పైగా చందాదారులు రూ.15,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే, ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందో రాదో చూసుకోవడం ముఖ్యమని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు.

* ఎయిర్‌టెల్‌ డేటా కేంద్ర వ్యాపార విభాగమైన ‘ఎన్‌ఎక్స్‌ట్రా డేటా లిమిటెడ్‌’లో 25 శాతం వాటాను 23.50 కోట్ల డాలర్ల (సుమారు రూ.1780 కోట్లు)కు కొనుగోలు చేయనున్నట్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ కార్లయిల్‌ గ్రూప్‌ ప్రకటించింది. దీనిప్రకారం చూస్తే ఎన్‌ఎక్స్‌ట్రా డేటా ఎంటర్‌ప్రైజ్‌ విలువ 120 కోట్ల డాలర్లు (సుమారు రూ.9084 కోట్లు) గా తేలుతోంది. ఈ లావాదేవీ పూర్తయ్యాక ఎన్‌ఎక్స్‌ట్రా డేటాలో 75 శాతం వాటా ఎయిర్‌టెల్‌కు, 25 శాతం కార్లయిల్‌కు ఉంటుంది.