Health

తిమ్మిర్లు చాలా ప్రమాదకరం

Numbness At Different Points Of Body Is A Dangerous Sign - 2020 Telugu Health News

శరీరం తిమ్మిరిగా ఉందా? జాగ్రత్త.. ఈ ముప్పు పొంచివుంది

మీ శరీరం సూదులు గుచ్చుతున్నంత మంటగా.. తిమ్మిర్లుగా ఉంటుందా? అయితే, జాగ్రత్త.. అవి ఎన్నో రోగాలకు సూచనలు.

ఈ లాక్‌డౌన్‌లో చాలామందికి వస్తున్న సమస్య తిమ్మిర్లు. శరీరమంతా సూదులతో గుచ్చుతున్నట్లుగా.. నడుస్తుంటే మంటగా.. జివ్వుమని లాగేస్తున్నట్లుగా అనిపించడమే ‘తిమ్మిరి’. మనం ఒకే చోట కదలకుండా ఉండేప్పుడు ఏర్పడే తిమ్మిరిలతో పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ, దీర్ఘకాలికంగా వేదించే తిమ్మిర్లతోనే జాగ్రత్తగా ఉండాలి. అది వ్యాధులకు సంకేతంగా భావించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. నరాల వ్యవస్థ నాశనమవుతుంది. ఆ తర్వాత కోలుకోలేనన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

తిమ్మిర్లు ఎందుకు వస్తాయి?:

నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు రూపంలో సంకేతాలిస్తుంది. ఒక్కోసారి ఆ చోట స్పర్శ కూడా తెలీదు. ఈ పరిస్థితినే ‘న్యూరోపతీ’ అంటారు. అయితే, తిమ్మిర్లు అన్నీ ఒకే రకమైనవిగా భావించకూడదు. వీటిలో కూడా తేడాలు ఉంటాయి. ఎక్కువ సేపు కదలకుండా కుర్చున్నప్పుడు సూదులతో గుచ్చుతున్నట్లుగా ఉండటం, మంటలు ఏర్పడటాన్ని పాజిటీవ్ తిమ్మిర్లుగా పేర్కొంటారు. నెగటివ్ తిమ్మిర్లు దీర్ఘకాలికంగా వేధిస్తాయి. ఇవి ఎక్కువ నొప్పి పెడతాయి. ఈ తిమ్మిర్ల వల్ల స్పర్శ కూడా కోల్పోతారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు నెగటివ్ తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటిని ‘ప్రెషర్ పాల్సీస్’ అని కూడా ఉంటారు. ఇలాంటి న్యూరోపతీ సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

డయబెటీస్ రోగుల్లోనే ఎక్కువ:

మధుమేహం (డయబెటీస్) రోగుల్లో ఎక్కువగా తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. వీరు నిత్యం అరికాళ్ల మంటలతో బాధపడతారు. నడవకపోయినా సరే.. కార్లు చివ్వుమని నొప్పి పెడతుంటాయి. సూదులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది. ఈ తిమ్మిర్లు ఒక్కసారి నరకాన్ని చూపిస్తాయి. తిమ్మిర్లు ఎక్కువైతే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. మధుమేహం ప్రారంభంలో ఈ తిమ్మిర్లు కాళ్లకే పరిమితమవుతాయి. వ్యాధి ముదిరేకొద్ది తిమ్మిర్లు అన్ని అవయవాలకు పాకేస్తాయి. శరీరం మొత్తం మంటగా అనిపిస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. డయబెటిక్ చికిత్సకు ఇచ్చే ఇన్సులిన్‌ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. దీన్నే ‘ఇన్సులిన్‌ న్యూరైటిస్‌’ అంటారు. మధుమేహం వల్ల శరీరంలో ఉండే పొడవైన నరమే ముందుగా ఎఫెక్ట్‌ అవుతుంది. ఈ నరాలు కాళ్లలో ఉంటాయి. దీంతో మధుమేహం ఎటాక్ చేయగానే తిమ్మిర్లు కాళ్ళలోనే మొదలవుతాయి. మధుమేహం ఉందని తెలుసుకొనేసరికే శరీరంలోని 20 పైగా నరాలు దెబ్బతిని ఉంటాయట.

వంశపారంపర్యంగానూ వస్తాయ్.. :
ఈ తిమ్మిర్లు కొందరికి వంశపారంపర్యంగా సంక్రమిస్తాయట. దీన్నే ‘హెరిడిటరీ న్యూరోపతీ లయబిలిటీ టు ప్రెషర్‌ పాల్సీస్‌’ అంటారు. వీరికి నిత్యం నరాలు జివ్వుమంటూ ఇబ్బంది కలిగిస్తుంటాయి. కొద్ది సేపు చేతులను కదల్చకుండా ఉంచినా తిమ్మిర్లు వచ్చే్స్తాయి. స్థూలకాయం, క్యాన్సర్‌, ఎయిడ్స్‌, హైపోథైరాయిడ్‌, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌‌లకు చికిత్స తీసుకునే రోగులు, కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌ ఉన్న రోగుల్లో కూడా ‘ప్రెషర్‌ పాల్సీ’ కనిపిస్తుంది. ఫోలిక్ యాసిడ్ లోపం, విటమిన్-B12, థయమిన్, పైరిడాక్సిన్ డెఫిషియన్సీ, పైరిడాక్సిన్ ఎక్సెస్‌కు గురయ్యేవారిలో కూడా తిమ్మిర్లు ఏర్పడతాయి. క్షయ రోగులకు ఇచ్చే మందుల ప్రభావం వల్ల కలిగే పైరిడాక్సిన్‌ డెఫిషియన్సీ వల్ల తిమ్మిర్లు వస్తాయి. మద్యం అతిగా తాగేవారిలో కూడా తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటిని ‘ఆల్కహాలిక్ న్యూరోపతీ’ అంటారు.

పక్షవాతం వస్తుందా? :
కొన్ని తిమ్మిర్లు క్రమేనా పక్షవాతానికి దారితీయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘ఫ్యాబ్రిస్’ అనే వ్యాధి కలిగినవారిలో మొదట శరీరంలో తిమ్మిర్లు ఏర్పడతాయి. చర్మంపై మచ్చలు (పిగ్మేంటేషన్ లేదా వర్ణక పరిణామం) ఏర్పడతాయి. ఆ తిమ్మిర్లు క్రమేనా ముదిరి పక్షవాతానికి దారితీస్తాయి. ఈ సమస్య మధుమేహ రోగుల్లో కూడా ఎక్కువే. కొందరిలో తిమ్మిర్లు తీవ్రమై పక్షవాతం ఏర్పడుతుంది. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ రోగుల్లో సైతం ఈ సమస్య ఏర్పడవచ్చు.

తిమ్మిర్లను వస్తే ఏం చేయాలి?:
తిమ్మిర్లు ఎక్కువ రోజులు వేధిస్తుంటే.. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. తిమ్మిర్లు మీ శరీరంలో తీవ్రమైన అనారోగ్యానికి సంకేతాలని గుర్తించాలి. అయితే, ఈ తిమ్మిర్లు చాలా వ్యాధులతో ముడిపడి ఉంటాయి. అందుకే వైద్యులు ముందుగా రోగికి థైరాయిడ్, డయబెటీస్, విటమిన్ డెఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ‘నర్వ్ కండక్షన్’ ద్వారా తిమ్మిర్లను అంచనా వేస్తారు. ఒక వేళ మీ నోట్లో పుండ్లు (మౌత్ అల్సర్), కీళ్ల నొప్పుల్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ‘కనెక్టివ్ టిష్యూ డిజార్డర్‌‌’గా భావిస్తారు. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే మెదడు సంబంధ సమస్యలుగా గుర్తించాలి.