Movies

అశ్లీలత అనే అనారోగ్యంతో బాధపడుతున్న సినిమా

Telugu Cinema Suffering From Porn And Vulgarity

నా చిన్నప్పుడు సినిమా అంటే నేల టిక్కెట్ లో కూర్చొని స్క్రీన్ మీద అన్నగారు ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, ఎస్ వి ఆర్, అల్లురామలింగయ్య, జగ్గయ్య, సావిత్రి, అంజలీదేవి, రావు గోపాల్ రావు, చిరంజీవి, ఒక మంచి కథ… సినిమాను ప్రేమించే దర్శకుడు, సినిమా బ్రతకాలి అనుకునే నిర్మాత అందరూ కలసి కుటుంబం అంతా కూర్చోని చూడదగ్గ సినిమా ఒకటి తీసేవారు. మంచి కథ ఉండేది కాబట్టి అందరికి నచ్చేవి, సవంత్సరాలు తరబడి ఆడేవి, అందరూ చూసి ఆనందించే వారు, నటీనటులు కు మంచి గుర్తింపు వచ్చేది, దర్శకుడు కి మంచి పేరు వచ్చేది, నిర్మాత కు బాగా డబ్బులు వచ్చేవి, పరిశ్రమ మీద ఆధారపడ్డ కుటుంబాలు అన్నీ బాగా బ్రతికేవి.

ఇప్పుడు సినిమా కూడా కొన్ని సినిమాలు పర్వాలేదు, కుటుంబం అంతా వచ్చి థియేటర్ లో కూర్చోకపోయినా…, కథ బాగుండి హిట్ టాక్ పడితే హీరో మార్కెట్ ని బట్టి, నిర్మాత కెపాసిటీ ని బట్టి లేదా దర్శకుడు విజన్ ని బట్టి ఓ రెండు మూడు వారాలు ఆడుతున్నాయి, అక్కడక్కడ కొన్న బయ్యర్లు కొంతమేర నష్టపోయినా నిర్మాత మంచి హృదయంతో తరువాత సినిమాలో ఏదో అలా గడిచిపోతుంది.

ఇప్పుడు చిన్న సినిమా…, ఈ చిన్న సినిమాతో ఈ మధ్యే మరోక రూపం కలిగిన సినిమా కూడా తయారయింది, అదే “పోరంబోకు” సినిమా. దానికి మరో పేర్లు “పోర్న్” “బూతు” సినిమాలు.

ఇప్పుడు చిన్న సినిమా గురించి మాట్లాడుకుంటే, తక్కువ బడ్జెట్, యూత్ ఫుల్ కథలు, సినిమాను కొత్తగా తీయాలనే దర్శక నిర్మాతలు, టాలెంట్ నిరూపించుకోవాలనే నటీనటులు…, వీళ్ళందరి కృషితో చిన్న సినిమా ఎలానో బ్రతికి బట్టకడుతుందని చెప్పుకోవాలి.

ఇప్పుడు ”పోరంబోకు” … దీనికి కథ తో పనిలేదు, దర్శకుడుకి సినిమా పట్ల అవగాహన ఉండాల్సిన అవసరం లేదు, నిర్మాత కు సినిమా అంటే అభిలాష ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు.
దర్శక నిర్మాతకు ఆన్ స్క్రీన్ లో ఆఫ్ స్క్రీన్ లో బాగా సహకరించే ఒక బొంబాయి అమ్మాయిని హీరోయిన్ అంటారు, ఆ అమ్మాయి కి యాక్టింగ్ రాకపోయినా పర్వాలేదు, పక్కలో యాక్టివ్ గా ఉంటే చాలు. నాలుగు సార్లు ఎద సంపంద, ఐదు సార్లు తొడల పైభాగం చూపించి ఒక రెండు మూడు పోర్న్ సీన్లు, నాలుగు బెడ్ సాంగ్స్ షూట్ చేస్తే సినిమా అయిపోద్ది. దీనికి అదిరిపోయే టైటిల్ పెట్టి, అద్భుతమైన ట్రైలర్ కట్ చేసి మార్కెట్ లోకి వదిలితే సినిమాకు వందల సంఖ్యలో ధేయటర్లు కావాలి, కోట్లలో కలెక్షన్లు కావాలి, అంతే కొడితే దెబ్బతో చేతిలో ఒక ఆడి కార్, ఫిల్మ్ నగర్ లో ప్లాట్ తో లైఫ్ సెటిల్ అయిపోవాలి…, ఇది అదిరిపోయే ప్లాన్.

ఇలాంటి సినిమాల మధ్యలో నీతి, నిజాయితీ, సంస్కృతి కలిగిన సినిమా చచ్చిపోతుంది.
సార్ ఇలాంటి బూతు ఎందుకు అంటే, వర్మ లాంటి దర్శకుడే తీశాడు…, మనమెందుకు తీయకూడదు అని ఆఫీస్ లో వొట్కా తాగుతూ మాట్లాడుకుంటారు.

కళామ్మతల్లి కి ఏ బట్టలు కట్టినా పర్వాలేదు కానీ, వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్లు మాత్రం సంప్రదాయంగా ఉండాలి. కమిషన్లు తీసుకొని బ్రతికే వాళ్లే ఇలాంటి సినిమాలకు పైపెచ్చు నిర్మాతలు గా కూడా మారతారు. ఏ అమ్మాయి ఎంతకు దొరుకుద్దో వాళ్ళకే బాగా తెలుసు, ఏ హోటల్ ఏ రేటులో ఉంటుందో, ఏ నిర్మాత ఎంత ముట్టచెప్తాడో కూడా బాగా తెలుసు.

అందుకే అన్నా, కామంతో సినిమా చచ్చిపోతుంది అని.

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ని బ్రతకించటానికి అందరూ బాహుబలి లు తీయాలని లేదు, కానీ పరమ బూతు సినిమాలు తీయకుండా ఉంటే చాలు.

నేను ఎవరికి సలహాలు ఇవ్వడం లేదు.

సినిమా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి అంతే.

అమ్మాయి తొడల మధ్య కెమెరా నలిగినట్టు, బూతు మధ్య సినిమా ఉండకూడదు.