NRI-NRT

ఒక్కనెలలో 6000 మంది వచ్చేశారు

6000 NRTs Return From Multiple Countries To Telugu States

విదేశాల నుంచి ప్రవాసాంధ్రులను తీసుకొస్తున్న విమాన సర్వీసులతో గన్నవరం విమానాశ్రయానికి రద్దీ పెరిగింది. గత రెండు నెలల్లోనే 65 విమాన సర్వీసులు తరలివచ్చాయి. వీటిలో 9వేల మంది వరకు ప్రయాణికులు రాష్ట్రానికి తరలివచ్చారు. జులైలోనే 40కు పైగా విమాన సర్వీసులు రాగా.. వాటిలో ఆరు వేల మందికి పైగా వచ్చారు.వచ్చిన విదేశీ ప్రయాణికులందరినీ కృష్ణా జిల్లాలోనే ఉంచేందుకు క్వారంటైన్‌ కేంద్రాలు ఆరంభంలో ఏర్పాటు చేశారు. వారి సంఖ్య పెరుగుతుండడంతో పది సర్వీసుల వరకు కృష్ణా జిల్లాలోనే ఉంచి.. ఆ తర్వాత ఎక్కడి వారిని అక్కడికి ప్రత్యేక బస్సుల్లో పంపించడం ఆరంభించారు. ప్రస్తుతం నిత్యం ఇతర జిల్లాలకు చెందిన ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. వందే భారత్‌మిషన్‌ కింద లండన్‌, పారిస్‌, జెడ్డా, రియాద్‌, అల్మెటి, మస్కట్‌, బహ్రెయిన్‌ వంటి దేశాల నుంచి విమాన సర్వీసులు వస్తున్నాయి. షార్జా, దుబాయ్‌ నుంచి కూడా వస్తున్నారు. కువైట్‌ నుంచి అక్కడి ప్రభుత్వమే ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతూ.. ప్రవాసాంధ్రులను ఇక్కడికి పంపిస్తోంది. కువైట్‌లో పాస్‌పోర్టులు లేకపోవడం తదితర కారణాలతో చిక్కుకుపోయిన వారిని క్షమాభిక్ష కింద అక్కడి ప్రభుత్వం పంపిస్తోంది. ప్రస్తుతం కువైట్‌ నుంచి వస్తున్న సర్వీసులే అధికంగా ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు మరిన్ని సర్వీసులు తరలిరానున్నాయి. 27న కువైట్‌, 28న దుబాయ్‌, 29న జెడ్డా, 30న కువైట్‌ నుంచి సర్వీసులు రానున్నాయి. మరికొన్ని సర్వీసులు షెడ్యూల్‌లో లేకుండా అప్పటికప్పుడు వస్తున్నవీ ఉంటున్నాయి. ఒక్కోదానిలో 150 నుంచి 180 మంది వరకు తరలివస్తున్నారు. ఒక్కోసారి అర్ధరాత్రి 2గంటలకు సైతం విదేశీ సర్వీసులు గన్నవరానికి వస్తున్నాయి. ప్రస్తుతం రోజూ ఆరు నుంచి ఏడు దేశీయ సర్వీసులు గన్నవరం విమానాశ్రయానికి వస్తున్నాయి. మరోవైపు విదేశాల నుంచి రోజుకు రెండు మూడు సర్వీసులు చేరుకుంటున్నాయి. దీంతో గతంలో కంటే ఇప్పుడే విమానాశ్రయంలో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. విదేశాల నుంచి వచ్చేవారిని తరలించేందుకు బయట సిద్ధంగా ఉంచిన ప్రత్యేక బస్సులు, ఆయా జిల్లాల అధికారులు, సిబ్బందితో ప్రాంగణం నిండిపోతోంది. దేశీయ సర్వీసుల్లో వచ్చే వారికి ప్రస్తుతం క్వారంటైన్‌ లేకపోవడంతో వాళ్లు సొంత వాహనాల్లో వెళ్లిపోతున్నారు. వీరిలో పది శాతం మందికి కరోనా నిర్ధరణ పరీక్షల కోసం నమూనాలను తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి మాత్రం అందరికీ తప్పనిసరిగా పరీక్షలు చేశాకే.. జిల్లాల వారీగా క్వారంటైన్‌ కేంద్రాలకు పంపిస్తున్నారు.